Nori Ratnamala: బొమ్మలకు జీవం పోసే టీచరమ్మ

21 Mar, 2023 04:05 IST|Sakshi

వరల్డ్‌ పప్పెట్రీ డే

ఆమె ఊహల్లో కథ అల్లుకుపోతే అవి బొమ్మలై మన ముందు కదలాడతాయి. చూసే పిల్లల మొహాల్లో ఆశ్చర్యానందాలను పెద్దల మెదళ్లలో ఆలోచనలను కొత్తగా వికసింపజేస్తాయి. ముప్పైఏళ్లుగా పప్పెట్రీతో స్నేహం చేస్తూ ‘మా బొమ్మల టీచర్‌’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే పేరు నోరి రత్నమాల. హైదరాబాద్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ కాలనీలో ఉంటున్న ఈ విశ్రాంత టీచరమ్మను కలిస్తే ఎన్నో అందమైన కథల మాలను మన ముందుంచుతారు.

‘విష్ణుశర్మ అడవి గుండా ప్రయాణిస్తుంటాడు. దారిలో బావిలోనుంచి మమ్మల్ని కాపాడండీ.. అని కేకలు విని అక్కడకు వెళ్లి లోపలకు చూస్తాడు. అందులో ఒక పులి, కోతి, పాముతో పాటు మనిషి ఉంటాడు. వారందరినీ కాపాడే సమయంలో ‘మనిషిని మాత్రం కాపాడవద్దు’ అని చెబుతాయి మిగతా జంతువులు...’ అంటూ మనిషిలో ఉండే స్వార్థం ప్రాణాపాయం ఎలా కలిగిస్తుందో చెబుతూనే నేటి సాయంత్రం హైదరాబాద్‌లో ప్రదర్శించబోతున్న కథనాన్ని, అందుకోసం చేసుకున్న ఏర్పాట్ల గురించి చెబుతూనే తనలో ఈ కళ పట్ల ఆసక్తి కలగడానికి దారి తీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు ఈ టీచరమ్మ.

‘‘హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ టీచర్‌గా వర్క్‌ చేశాను. పిల్లలకు ఆసక్తి గొలిపేలా సృజనాత్మకతను పరిచయం చేసే ఆ సబ్జెక్ట్‌ నాకెంతగానో రచ్చింది, ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా సిద్ధం చేసుకోవడం ఎలా అని ఆలోచించినప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకున్న పప్పెట్రీ గురించి గుర్తొచ్చింది, నా చిన్నతనంలో మా నాయనమ్మ నన్ను తోలుబొమ్మలాటకు తీసుకెళ్లేది. అందులో రామాయణ భారత కథలను తెల్లవార్లూ ప్రదర్శించేవారు. బాల్యంలో నా మనసులో నాటుకుపోయిన ఆ కళ ఆ తర్వాత నాకు విద్యార్థులకు పరిచయం చేయడానికి తోడ్పడింది.  

స్కూల్‌ నుంచి మొదలు
సంప్రదాయ తోలుబొమ్మల తయారీ అంటే అంత సులువు కాదు. అందుకని కాగితం, క్లాత్, ఇతర వేస్ట్‌ మెటీరియల్‌ను ఉపయోగించి పప్పెట్రీ బొమ్మలు తయారుచేసేదాన్ని. వాటిద్వారా పిల్లలకు పంచతంత్ర వంటి ఎన్నో కథలు చెప్పేదాన్ని. పిల్లలు కూడా ఈ బొమ్మల ద్వారా తమ ఆసక్తులను కనబరిచేవారు. అక్కడ నుంచి ఇతర టీచర్లకు శిక్షణ, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. దూరదర్శన్‌లోనూ బాలల వికాసానికి పప్పెట్రీతో కార్యక్రమాలు చేశాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో సామాజిక అవగాహన కలిగించే అంశాలెన్నో కథలుగా రూపొందించి, ప్రదర్శించాను.

కదిలించే కథనాలు..
స్వాతంత్య్రానికి ముందు మనకున్న అవగాహన కార్యక్రమాలలో ప్రధానమైనది తోలుబొమ్మలాటనే. ఇది దేశవ్యాప్త కళ. బొమ్మలను తెరముందు కదిలిస్తూ, దీపం వెలుతురు సాయంతో ప్రదర్శన ఉండేది.  సంప్రదాయ బొమ్మల తయారీ ఇప్పుడు కొంచెం కష్టమే. ఇక ప్రదర్శన ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అలాగని నేర్చుకున్న కళను మన దగ్గరే ఉంచలేం. పదిమందికి తెలిసినప్పుడే ఆ కళ బతుకుతుంది. సామాజిక అవగాహనకు నా భాగస్వామ్యమూ ఉండాలి. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చాయి. సంగీత నాటక అకాడమీ నుంచి ఇన్నేళ్లలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. విదేశాలలోనూ పప్పెట్రీ ప్రదర్శన చేయడం, అభినందనలు, అవార్డులు, మరచిపోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

టీమ్‌ వర్క్‌ విజయం
బొమ్మల తయారీ, బొమ్మలు కదల్చడానికి, మంచి కథనానికి, పాటలకు, నేపథ్య సంగీతానికి.. ఇలా ఇదంతా టీమ్‌ వర్క్‌తో కూడుకున్నది. ఇందుకోసం మావారితోపాటు పిల్లలనూ ఆ తర్వాత వారి పిల్లలనూ ఈ పనిలో భాగస్థులను చేశాను. దీనివల్ల వారి లోపల ఉన్న వారికే తెలియని కళ బయటకు వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఉన్న మా పిల్లలు కూడా కథనానికి తగ్గ వాయిస్‌ డబ్బింగ్‌ను క్లిప్పింగ్స్‌ ద్వారా నాకు పంపిస్తుంటారు. ఇందులో నా కుటుంబ సభ్యులే కాదు స్నేహితులు, కొందరు స్వచ్ఛందంగానూ మేం చేసే పనిలో భాగమవుతుంటారు. ఈ కళ బతికుంది అనడానికి ఇంతకుమించి నిదర్శనాన్ని చూపలేం.

డిజిటల్‌ మీడియాలోనూ..
కరోనా సమయంలో నోరి ఆర్ట్‌ అండ్‌ పప్పెట్రీ పేరుతో యూ ట్యూబ్‌లో ఛానెల్‌ స్టార్ట్‌ చేశాను. పిల్లల కోసం పప్పెట్రీ ద్వారా కొన్ని వందల కథలను పరిచయం చేశాను. అవన్నీ ఒక్కదాన్నే చేశాను. పెద్దవాళ్లూ ఆస్వాదించారు. ఎంతోమంది అభినందనలు తెలియజేశారు.   

ఏ దేశానికి లేనన్ని సంప్రదాయ కళలు మన దగ్గర ఉన్నాయి. వాటికి పునరుజ్జీవం కలగాలంటే ప్రభుత్వాలు, సంస్థలు, ఆసక్తి కలవారు ముందుకు రావాలి. పిల్లల్లో ఈ కళలను బతికిస్తే చాలు– ముందు తరాలకు అవి వారసత్వంగా ప్రయాణిస్తాయి. ఏ దేశంలో ఉన్నా మన ప్రత్యేకతను ఈ కళలే చాటుతాయి. అందుకే ప్రాచీన కళలకు ప్రోత్సాహమిద్దాం’’ అని వివరించారు ఈ పప్పెట్రీ హార్టిస్ట్‌.

– నిర్మలారెడ్డి
 

మరిన్ని వార్తలు