రావూరి భరద్వాజ: ఉడతమ్మ ఉపదేశం.. కథ

14 Nov, 2021 13:09 IST|Sakshi

గోదావరీ నదీతీరాన ఒకప్పుడు చిక్కని అడవులు ఉండేవి. ఆ అరణ్యాల నిండా రకరకాల జంతువులు ఉండేవి. ఆ జంతువులను చూడడానికీ, అడవిలోని చెట్లను చూడడానికీ, దూరప్రాంతాల నుంచి చాలామంది వస్తూ పోతూ ఉండేవారు. ఆ వచ్చినవారు తమ వెంట రకరకాల కాయలనూ, పళ్లనూ, మిఠాయిలనూ తెచ్చుకొనేవారు. తిన్నంత తిని, మిగిలిన వాటిని దూరంగా విసిరేస్తూ ఉండేవారు.

ఒకసారి– ఈ అడవిని చూడడానికి ఒక కుటుంబం వచ్చింది. వస్తూ వస్తూ వాళ్లు రకరకాల ఫలహారాలు తెచ్చుకున్నారు. మధ్యాహ్నం దాకా అడవిలో తిరిగారు. చూడవలసినవన్నీ చూశారు. అలసిపోయి ఒక చెట్టు కిందకొచ్చారు. వచ్చాక– తాము తెచ్చుకున్న మూటలు, పొట్లాలు విప్పుకొని కడుపునిండా తిన్నారు. తినగా మిగిలిన వాటిని చెట్టు కిందే పారబోశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక వెళ్లిపోయారు.
ఇదంతా ఆ చెట్టుతొర్రలో ఉన్న ఉడతపిల్లాడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడి వాళ్లక్కడకు వెళ్లిపోయాక, ఆ ఉడతబ్బాయి కిందకు దిగివచ్చాడు. చెల్లాచెదురుగా చెట్టు కింద పడి ఉన్న మిఠాయి ముక్కల్ని ముందు కొంచెం రుచి చూశాడు. అవి తియ్యగానూ, రుచిగానూ ఉన్నాయి. తాను తినగలిగినన్ని తిని, మిగిలిన వాటిని అమ్మకోసం అట్టేపెట్టాడు.

సాయంకాలం అయ్యేసరికి, ఆపసోపాలు పడుతూ అమ్మ ఉడత వచ్చింది. రాగానే– ఒక ఆకులో కాసిని మిఠాయి తునకలుంచి అమ్మ ముందుంచాడు ఉడతబ్బాయి. 
కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది ఉడతమ్మ.

జరిగిన సంగతంతా తల్లికి చెప్పాడు ఉడతబ్బాయి. చెప్పీ చెప్పీ చివరికిలా అన్నాడు–
‘అమ్మా! నువ్వు ఇంతకాలమూ, ఈ అడవిలో దొరికే పిందెల్నీ, కాయల్నీ మాత్రమే నాకు పెడుతున్నావు. నేనూ తింటున్నాను. ఈ ప్రపంచంలో మనం తినగలిగినవి ఇవేనేమో, ఇలాంటి వాటినే మనం తినాలేమో అనుకున్నాను. నువ్వయినా– నాకెప్పుడూ ఈ మిఠాయిల సంగతి చెప్పనన్నా చెప్పలేదు. ఎందుకని?’ అన్నాడు ఉడతబ్బాయి.
ఉడతమ్మ సన్నగా నిట్టూర్చింది. 

‘నాన్నా! ఇలాంటివి నాకూ తెలుసు. కావాలనే, వీటి గురించి నీకు చెప్పలేదు. సుఖాలకు అలవాటుపడడం తేలిక. ఆ అలవాటు నుంచి బయటపడడం కష్టం. ముందుగా– కష్టాలంటే ఏమిటో తెలియాలి. అవి బాగా అనుభవించాలి. ఆ తర్వాత సుఖాలను రావాలి.’
‘కొంతకాలం సుఖపడిన తర్వాత కష్టాలు వచ్చాయనుకో– అప్పుడు, ఆ కష్టాలను అనుభవించడానికి పెద్దగా ఇబ్బందులు పడనవసరం ఉండదు. అందుకే– నీకీ మిఠాయిలను గురించి, అవి తినడంలో ఉండే సుఖాలను గురించి చెప్పలేదు. అంతేగాని, నీ మీద కోపంతో కాదు’ అంది ఉడతమ్మ.

‘ఈ మిఠాయిలూ అవీ దొరకడం చాలా కష్టమా?’ అన్నాడు ఉడతబ్బాయి దూరంలోకి చూస్తూ, ఏదో ఆలోచిస్తూ.
‘ఒకరకంగా కష్టం! ఇంకోరకంగా కష్టం కాదు. అయినా– నాకు తెలీక అడుగుతున్నాను; ఈ గొడవలన్నీ నీకెందుకురా నాన్నా?’ అంది ఉడతమ్మ.
‘ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తెలుసుకోవలసినవి, ఇప్పుడే తెలుసుకోవడంలో దోషమేమీ లేదు కదా! అందుకే– అన్నీ అడుగుతున్నాను.’
‘నేనో విషయం స్పష్టంగా చెబుతున్నాను వినమ్మా! నేను ఇకముందు నుంచి ఈ పచ్చికాయలు, పిచ్చికాయలు తినను. నాకు ఖరీదైన భోజనమే కావాలి. అవి– నువ్వెలా తెస్తావో కూడా నాకు అవసరం లేదు. అవి నీవు తెచ్చిపెడుతున్నంత కాలం నీతో ఉంటాను. మానేసిన రోజున, చెప్పాపెట్టకుండా ఎటో పోతాను. అప్పుడు నాకోసం నువ్వు ఏడ్చినా, మొత్తుకున్నా లాభంలేదు. తర్వాత నీ ఇష్టం’ అన్నాడు ఉడతబ్బాయి. ఉడతమ్మ గుండెలు గుభేలుమన్నాయి.

‘నిన్న సాయంకాలం దాకా కుర్రాడు బాగానే ఉన్నాడు. ఈరోజు ఉదయం తాను బయటకెళుతున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఇంత తిండి మూటగట్టుకుని ఇంటికి వచ్చేసరికి కుర్రాడిలా తయారయ్యాడేమిటి?’ 
ఉడతమ్మ కొడుకుని కావలించుకుంది.

బంగారు కన్నయ్యలాంటి తన కొడుకు ఇలా బండబారిపోవడానికి కారణాలేమిటో ఉడతమ్మ సరిగ్గానే ఊహించింది! 
‘బుజ్జినాన్నా! నువ్వెప్పుడూ నన్ను ఏదీ అడగలేదు. ఇంతకాలానికిగాను, నువ్వు నన్ను అడిగిందల్లా మిఠాయిలు మాత్రమే! ఇలా నువ్వు అడగడం కూడా సహజమేరా! పిచ్చితండ్రీ!’
‘చిన్నతనంలో అవీ ఇవీ తినాలని అందరికీ అనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా అమ్మనూ, నాన్ననూ ఏవేవో కావాలని నేనూ అడిగాను. కాకపోతే ఒక చిన్నసంగతి మాత్రం నువ్వు గుర్తుంచుకో!’ అంది ఉడతమ్మ.
‘ఏమిటది?’ అడిగాడు ఉడతబ్బాయి.
‘రేపు– నాకూ చిన్నతనం రావచ్చు. నాక్కూడా, అవీ ఇవీ తినాలని అనిపించవచ్చు. అప్పుడు నేనూ నిన్ను అడుగుతాను. అలా అడిగినప్పుడు, నువ్వు ముఖం చిట్లించుకోకుండా, విసుక్కోకుండా తెచ్చిపెడితే నాకు అంతే చాలు’ అంది ఉడతమ్మ.
ఉడతబ్బాయి ఆశ్చర్యపోయి, అమ్మవైపు చూశాడు. 

‘అదేమిటీ? మళ్లీ నీకు చిన్నతనం రావడమేమిటీ?’ అన్నాడు ముఖం చిట్లిస్తూ.
‘ఎల్లకాలం నేను ఇలాగే ఉండను కదా! ఎప్పటికో అప్పటికి ముసలితనం ముంచుకొస్తుంది కదా! అప్పుడు నేనూ– నీకు మల్లేనే ఎక్కడికీ కదలలేను కదా! ఏమీ సొంతంగా తెచ్చుకోలేను కదా! ఆ రెండో చిన్నతనంలో, నాకు అవీ ఇవీ తినాలనిపించినప్పుడు– నువ్వీ విషయాలన్నీ గుర్తుంచుకొని, విసుక్కోకుండా తెచ్చిపెట్టు. నాకంతకన్నా ఇంకేమీ అవసరం లేదు’ అంది ఉడతమ్మ. 
‘అమ్మా! నువ్వు నన్ను చూసినంత బాగా నేనూ నిన్ను చూడాలని, ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నట్టు? ఇప్పుడలా జరగడంలేదా?’ అన్నాడు ఉడతబ్బాయి.

‘మొన్నమొన్నటిదాకా అలానే జరుగుతూ ఉంది నాన్నా! ఈ మధ్యనే మనవాళ్లు మనుషుల్ని చూసి చెడిపోవడం ప్రారంభించారు. అందుకే ఇంతగా చెప్పవలసి వస్తోంది’ అంది ఉడతమ్మ కొడుకు వైపు జాగ్రత్తగా చూస్తూ.
ఉడతబ్బాయి కళ్లనిండా నీళ్లుతిరిగాయి.
‘అమ్మా! నాకేమీ వద్దు. నాకోసం నువ్వు కష్టపడను కూడా వద్దు. నువ్వు తప్ప– ఇంకేమీ నాకు వద్దు’ అన్నాడు ఉడతబ్బాయి వాళ్లమ్మ కాళ్లను చుట్టుకుపోతూ.
 
– రావూరి భరద్వాజ, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత 

చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!!

మరిన్ని వార్తలు