కృషి: ఇప్పపూల లడ్డు పసుపు మసాలా పానీయం

20 Aug, 2022 00:14 IST|Sakshi

అడవి నుంచి దూరమయ్యాం..
పల్లె నుంచి పట్టణవాసంలో కరెన్సీ కోసం నిత్యం కసరత్తులు చేస్తున్నాం. కానీ, అడవి పంచే ఔషధం.. పల్లె ఇచ్చే పట్టెడన్నమే మనకు అమ్మ చేతి గోరుముద్దంత ప్రేమను అందిస్తుంది. అలాంటి ప్రేమకు వారధిగా నిలుస్తున్నారు గుంటూరు వాసి షేక్‌ రజియా.
ఛత్తీస్‌గడ్‌లోని అటవీ ప్రాంతాల్లో గిరిజనుల స్థావరాలను వెతుక్కుంటూ వెళ్లి వారి ఆహారపు అలవాట్లు తెలుసుకుని, ‘బస్తర్‌ ఫుడ్‌ ఫర్మ్‌ అండ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌’ పేరుతో సంస్థను నెలకొల్పి
అక్కడి మహిళల చేత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయిస్తున్నారు. వాటికి పట్టణాల్లోనే కాదు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ విలువనూ.. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలనూ పెంచుతున్నారు. ఆరేళ్లుగా రజియా చేస్తున్న ఈ కృషి గురించి అడిగితే ఆమె ఎన్నో అడవి ముచ్చట్లను ఆనందంగా పంచుకున్నారు.

‘‘జగ్దల్‌పూర్‌లో ‘బస్తర్‌ ఫుడ్‌ ఫర్మ్‌’ మెయిన్‌ ప్రాజెక్ట్‌ ఉంది. ఇక్కడ నుంచి దంతెవాడ, బస్తర్‌లోనూ మా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆదివాసీలున్న చోటును వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడి ఒక యూనిట్‌ని తయారు చేస్తాను. అలా ఇప్పటివరకు పదికి పైగా యూనిట్స్‌ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆదివాసీల ఆహార ఉత్పత్తులను నాణ్యంగా తయారు చేయిస్తుంటాను. వాటిని పట్టణవాసులకు మార్కెటింగ్‌ చేస్తుంటాను. వీటిలో.. మహువా (ఇప్పపూల) లడ్డూ, టీ పొడి, కుకీస్, పసుపు మసాలా, చింతపండు సాస్, ఇన్‌స్టంట్‌ చింతపండు రసం పౌడర్, చాక్లెట్స్, తేనె, సేంద్రియ బియ్యం, కారం, బెల్లం.. ఇలా 22 ఉత్పత్తులు ఉన్నాయి.

ఆంధ్రా నుంచి ఛత్తీస్‌గడ్‌
మా నాన్నగారు గుంటూరులో ఉండేవారు. వ్యాపారరీత్యా ఛత్తీస్‌గడ్‌లో స్థిరపడ్డారు. అమ్మ, ఇద్దరు తమ్ములు, బాబాయ్‌ కుటుంబ సభ్యులు ..అందరం కలిసే ఉంటాం. అలా నా చదువు అంతా అక్కడే సాగింది. మైక్రోబయాలజీలో డిగ్రీ చేశాను. స్వచ్ఛమైన అడవి సౌందర్యం గురించి నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ అడవి బిడ్డల జీవనశైలి మీద నా చూపు ఉండేది. నా చదువులో భాగంగా మొక్కల పరిశోధనకు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి, గిరిజనులను కలిశాను. అప్పుడు అక్కడి గ్రామాల్లో కొంతమంది మహిళలు మహువా (ఇప్పపూల) లడ్డూలను తయారుచేస్తున్నారు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఇప్పపూలలో ఉండే పోషకాలను అడిగి తెలుసుకున్నాను. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఇప్పపూలలో తలనొప్పి, విరేచనాలు తగ్గించే సుగుణాలు ఉన్నాయి. చర్మ, కంటి సమస్యలతో సహా చాలా వ్యాధులకు ఔషధంగా వాడచ్చు. వంటకాలకు సహజమైన తీపిని అందిస్తాయి. దీంతో పోషకాహార నిపుణులు, మరికొంత మంది సాంకేతి నిపుణులు, ఆరుగురు గిరిజన మహిళలతో కలిసి అన్ని అనుమతులతో 2017లో ‘బస్తర్‌ ఫుడ్‌ ఫర్మ్‌’ ప్రారంభించాను.

సవాళ్లను ఎదుర్కొంటూ...
ముందు ఈ బిజినెస్‌కి ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. ‘ఎందుకు కష్టం. ఉద్యోగం చూసుకోక’ అన్నారు. బ్యాంకులను సంప్రదిస్తే లోన్‌ ఇవ్వలేదు. మహువా లడ్డూలను రుచిగా తయారు చేయడంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. చాలా మంది ‘ఎందుకు ఇదంతా వృథా... ఇది ఫెయిల్యూర్‌ బిజినెస్‌’ అన్నారు. దీనికి కారణం లేకపోలేదు. చాలాకాలంగా మన దేశంలో ఇప్పపూలను మద్యం తయారీలోనే వాడతారని తెలుసు. ఆదివాసీలే వీటిని ఉపయోగిస్తారు మనకెందుకు అనే అభిప్రాయమే ఉంది. వీటిలోని సానుకూల కోణాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. అనుమతి కోసం చాలా మంది అధికారులను సంప్రదించాను. 2018లో ఒక ఐఎఎస్‌ ఆఫీసర్‌ రెండు నెలల ప్రోగ్రామ్‌కు అనుమతి ఇచ్చారు. లడ్డూల నాణ్యత పెంచడానికి చాలా ప్రయోగాలు చేశాం. మహువా లడ్డూల తయారీ మార్కెటింగ్‌ చేస్తే రెండు లక్షల రూపాయల లాభం వచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్‌ పెరిగింది.

నేర్చుకునేవారికి శిక్షణాలయం
బస్తర్‌ ఫుడ్‌ ఫర్మ్‌ని ఇన్‌స్టిట్యూట్‌లా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆదివాసీల ఆహారాలు ఏవున్నాయో వాటిని బయటి ప్రపంచానికి చూపించాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతం లండన్‌ కంపెనీతో కలిసి పని చేయబోతున్నాం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెటింగ్‌ కూడా బాగా పెరుగుతుంది. ఈ బిజినెస్‌ మోడల్‌గా రాబోయే తరానికి తెలియాలి. ఈ ఆలోచనతోనే ఆసక్తి గలవారు ఒక ఏడాది పాటు ఈ కోర్సు ప్రత్యక్షంగా నేర్చుకునేలా రూపొందించాను.  నేర్చుకోవాలంటే ఇక్కడ చాలా పని ఉంది. మరో రెండేళ్లలో ఇన్‌స్టిట్యూట్‌ సిద్ధం అవుతుంది. ఇప్పటికే స్టూడెంట్స్‌ గ్రూప్స్‌గా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆసక్తిగలవారు నేర్చుకోవడానికి మా సంస్థను సంప్రదిస్తున్నారు’’ అని ఆనందంగా వివరించారు రజియా.
పల్లెవాసుల మధ్య పని చేయాలని, కొత్త మార్గాలను అన్వేషించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ, అనుకున్నంతగా ఆచరణలో పెట్టలేరు. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ పల్లెకు–పట్టణానికి వారధిగా నిలుస్తున్న రజియా లాంటివారు యువతరానికి ప్రతీకగా నిలుస్తున్నారు.

సమస్యలను అధిగమిస్తూ!
‘ఈ కన్సల్టెన్సీ మీద కొంత ఆదాయం వస్తుంది. దానిని పని చేస్తున్న మహిళలకే పంచుతాం. ఇక్కడి మహిళలకు పని వచ్చు కానీ మార్కెటింగ్‌ తెలియదు. ఊరు దాటి బయటకు వెళ్లలేరు. చదువుకున్న వారికి పట్టణ వాతావరణం గురించి తెలియదు. వారి ప్రతిభకు మేం సపోర్ట్‌గా ఉన్నాం. నక్సలైట్స్‌ సమస్యలూ వస్తుంటాయి. అడవుల్లోని మారుమూల పల్లెలకు వెళ్లినప్పుడు ఒక్కోసారి ఫుడ్‌ దొరకదు. అక్కడి ఆదివాసీలు త్వరగా అర్థం చేసుకోరు. వారి భాష మనకు రాదు. వాళ్ల భాషల్లోనే విషయం చెప్పాలన్నా కొంచెం సమస్యే. కానీ, వాటిని అధిగమిస్తేనే ఏదైనా చేయగలం. ఒక్కసారి వారికి అర్థమైతే మాత్రం మనమంటే ప్రాణం పెట్టేస్తారు. అంతబాగా చూసుకుంటారు. వాళ్లదగ్గర ఉన్న ప్రతిభను పట్టణానికి పంచే పనిని చేస్తున్నాను.’

పల్లెకు–పట్టణానికి వారధి
‘ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్‌కి అనుకూలంగా ఉందనుకుంటే అక్కడకు మా యూనిట్‌ కూడా మారుతూ ఉంటుంది. నా టీమ్‌ మెంబర్స్‌ పది మంది ఎప్పుడూ నాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మెట్రో సిటీస్‌లో ప్రమోషన్స్‌ కోసం చురుగ్గా ఉండాలి. అందరికీ పల్లె ఉత్పత్తులు ఇష్టమే. కానీ, అందరికీ అవి లభించేదెలా?
 అందుకే, నేను పల్లెకు–పట్టణానికి వారధిగా మారాను. నేను చేసే ఈ ప్రాజెక్ట్‌ వల్ల యుఎస్‌ వెళ్లడానికి ఫెలోషిప్‌ కూడా వచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో కలిసి పని చేశాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఉత్పత్తులకు మరింత ఎక్స్‌పోజర్‌ పెరిగింది. మంచి పేరు వచ్చింది.’

– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు