Chana Madra Recipe: హిమాచల్‌ వంటకం.. చనా మద్రా ఎప్పుడైనా తిన్నారా!

14 Jun, 2022 16:26 IST|Sakshi

కావలసినవి: కాబూలి చనా – రెండు కప్పులు(రాత్రంతా నానబెట్టుకుని ఉడికించినవి తీసుకోవాలి), ఆవనూనె – మూడు టేబుల్‌ స్పూన్లు, ఇంగువ –పావు టీస్పూను, లవంగాలు – మూడు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, నల్ల యాలుక్కాయ – ఒకటి, మిరియాలు – నాలుగు, జీలకర్ర – ఒకటిన్నర టీస్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి(ముక్కలు తరగాలి), గరం మసాలా పొడి –  ముప్పావు టీస్పూను, ధనియాల పొడి – టేబుల్‌ స్పూను, పసుపు – అరటేబుల్‌ స్పూను, కారం, ఉప్పు – రుచికి సరిపడా, పచ్చిమిర్చి – మూడు, పెరుగు – రెండు కప్పులు, బియ్యప్పిండి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – టేబుల్‌ స్పూను.

తయారీ విధానం:
ముందుగా మిరియాలు, యాలుక్కాయ, లవంగాలను బరకగా గ్రైండ్‌ చేసి పక్కనపెట్టుకోవాలి
►బియ్యప్పిండిలో కొద్దిగా నీళ్లుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి
►స్టవ్‌ మీద బాణలి పెట్టి ఆవనూనె వేయాలి. ఇది వేడెక్కిన తరువాత దాల్చిన చెక్క, ఇంగువ, జీలకర్ర వేసి వేయించాలి.
►ఇవి వేగాక గ్రైండ్‌ చేసి పెట్టుకున్న లవంగాల మిశ్రమాన్ని వేయాలి ∙రెండు నిమిషాలు వేగాక, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి ∙
►ఇప్పుడు ఉడికించిపెట్టుకున్న కాబూలి చనా, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలపాలి.
►పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
►పెరుగుని గడ్డలు లేకుండా చిలికి కూర మిశ్రమంలో వేసి సన్నని మంట మీద ఉడికించాలి ∙ ఐదు నిమిషాల తరువాత బియ్యపు పిండి మిశ్రమం, నెయ్యివేసి మరో పదినిమిషాలు ఉడికించాలి – ఆయిల్‌ పైకి తేలిన తరువాత దించేయాలి. ఇది అన్నంలోకి చాలా బావుంటుంది.

మరిన్ని వార్తలు