సులువులైన చిట్కాలతో చాక్లెట్‌ సమోసా-అంజీర్‌ హల్వా

11 Apr, 2022 14:52 IST|Sakshi

చాక్లెట్‌ సమోసా
కావలసినవి: మైదా పిండి – 1 కప్పు, పంచదార పొడి – 5 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు, డార్క్‌ చాక్లెట్‌ పౌడర్‌ – 1 కప్పు, పిస్తా ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌
పంచదార పాకం – అభిరుచిని బట్టి (అప్పటికప్పుడు కావాల్సినంత పంచదార, నీళ్లు పోసుకుని స్టవ్‌ మీద పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో మైదాపిండి, నెయ్యి, 4 టేబుల్‌ స్పూన్ల పంచదార పొడి, నీళ్లు పోసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని ఓ పావు గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

ఈ సమయంలో ఒక బౌల్‌ తీసుకుని అందులో చాక్లెట్‌ పౌడర్, పంచదార పౌడర్, పిస్తా ముక్కలు వేసుకుని అటు ఇటుగా కలిపి.. పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఫ్రిజ్‌లోంచి మైదా ముద్దను తీసి.. చిన్న చిన్న పూరీల్లా చేసుకుని.. ప్రతి పూరీలో కొంత చాక్లెట్‌ మిశ్రమం పెట్టుకుని సమోసాలా చుట్టుకోవాలి. అనంతరం రెండు స్టవ్‌లు ఆన్‌ చేసుకుని.. ఒకవైపు నూనె కళాయి, మరోవైపు పంచదార పాకం ఉన్న కళాయి పెట్టుకుని సమోసాలను నూనెలో దోరగా వేయించి.. వెంటనే పాకంలో వేసి తీసుకోవాలి. ఒకవేళ పాకంలో వేసుకోవడం ఇష్టం లేకుంటే చాక్లెట్‌ సాస్‌ని పైన గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

అంజీర్‌ హల్వా
కావలసినవి: డ్రై అంజీర్‌ – 400 గ్రా.(నానబెట్టి, ముక్కలు చేసుకోవాలి)
బియ్యప్పిండి/మొక్కజొన్న పిండి – 5 టేబుల్‌ స్పూన్లు(5 టేబుల్‌ స్పూన్ల నీళ్లనూ జతచేసి బాగా కలుపుకోవాలి), నెయ్యి – 9 టేబుల్‌ స్పూన్లు లేదా అంతకు మించి, పచ్చిపాలు – అర కప్పు, పంచదార – అభిరుచిని బట్టి, ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (గ్రీన్‌ కలర్‌), యాలకుల పొడి – కొద్దిగా, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా పాన్‌ లో 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకుని, వేడి కాగానే.. అందులో బియ్యప్పిండి/మొక్కజొన్నపిండి మిశ్రమం వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి.  

పాలు పోసుకుని చిన్న మంటపైన గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుని కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో అంజీర్‌ ముక్కలు, ఫుడ్‌ కలర్‌ వేసుకుని మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొద్దిగా పంచదార వేసుకుని, మిగిలిన నెయ్యి కూడా వేసుకుని గరిటెతో కలుపుతూ దగ్గర పడే సమయంలో యాలకుల పొడి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. అభిరుచిని బట్టి నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ ముక్కలతో గార్నిష్‌ చేసుకోవచ్చు లేదా.. నచ్చిన ఫ్లేవర్‌ ఐస్‌ క్రీమ్‌తో కలిసి తింటే భలే రుచిగా ఉంటుంది ఈ హల్వా.

మరిన్ని వార్తలు