Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా

19 May, 2022 11:16 IST|Sakshi

అమ్మను, ఆవకాయను ఎప్పటికీ మర్చిపోలేమని తెలుగువారి నోటి నుంచి కామన్‌గా వినిపించే మాట. వంటల్లో ఏది బోర్‌ కొట్టినా ఆవకాయ మాత్రం ఎన్నిసార్లు తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అన్నంలో పప్పు, నెయ్యి ఆవకాయ కలుపుకుని తింటే స్వర్గానికి బెత్తెడు దూరమే అన్నట్టు ఉంటుంది.

పెరుగన్నంలో ఆవకాయ ముక్కను నంచుకుంటే అమృతంలా అనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లన్నీ నోరూరించే మామిడి కాయలు కళ కళలాడిపోతున్నాయి. మరోవైపు మహిళలంతా జాడీలను సిద్ధం చేసుకుని ఆవకాయ పెట్టడానికి హడావుడి పడుతున్నారు. ఏడాదిపాటు నిల్వ ఉండేలా వివిధ రకాల ఆవకాయలను ఎలా పడతారో చూద్దాం....

నువ్వుల ఆవకాయ
కావలసినవి

పచ్చిమామిడికాయ ముక్కలు – రెండు కేజీలు, నువ్వుపప్పు నూనె  – కేజీ, జీలకర్ర – టేబుల్‌ స్పూను, మెంతులు – టేబుల్‌ స్పూను, ఆవాలు – టేబుల్‌ స్పూను, అల్లం – పావు కేజీ, వెల్లుల్లి – పావుకేజీ, కల్లుప్పు – అరకేజీ, ఆవపిండి – 200 గ్రాములు, నువ్వుపిండి – ఆరకేజీ, జీలకర్ర పొడి – వందగ్రాములు, మెంతిపిండి – రెండు టీస్పూన్లు, పసుపు – రెండు టీస్పూన్లు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – అరకప్పు.

తయారీ..

  • ముందుగా మామిడికాయ ముక్కల టెంక మీద ఉన్న సన్నని పొరను తీసేసి పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి.
  • అల్లం వెల్లుల్లిని తొక్క తీసి శుభ్రంగా కడిగి పేస్టుచేసి పక్కనపెట్టుకోవాలి.
  • బాణలిని స్టవ్‌ మీద పెట్టి వేడెక్కిన తరువాత కేజీ నూనె పోయాలి.
  • ఆయిల్‌ వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించి బాణలిని స్టవ్‌ మీద నుంచి దించేసి పక్కనపెట్టుకోవాలి
  • ఆయిల్‌ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి తిప్పి చల్లారనివ్వాలి.
  • కల్లుప్పుని గంటపాటు ఎండబెట్టి మిక్సీపట్టి మామిడికాయ ముక్కల్లో వేయాలి, దీనిలో ఆవపిండి, నువ్వుపిండి, జీలకర్రపొడి, మెంతిపిండి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో చక్కగా కలుపుకోవాలి.
  • పొడులన్నీ కలిపాక పూర్తిగా చల్లారిన ఆయిల్‌ మిశ్రమం వేసి చక్కగా కలుపుకోవాలి.
  • పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్‌ సరిపోనట్లు కనిపిస్తుంది కానీ, మూడు రోజులకు ఆయిల్‌ పైకి తేలుతుంది.
  • మూడోరోజు మూత తీసి పచ్చడిని మరోమారు కిందినుంచి పైదాకా బాగా కలుపుకోవాలి.
  • ఉప్పు, ఆయిల్‌ సరిపోకపోతే ఇప్పుడు కలుపుకుని, గాజు లేదా పింగాణీ జాడీలో నిల్వ చేసుకోవాలి.

తొక్కుడు పచ్చడి
కావలసినవి
పచ్చిమామిడికాయలు – నాలుగు, ఉప్పు – అరకప్పు, పసుపు – టీస్పూను, ఆవపిండి – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవపిండి – టీస్పూను, కారం – ముప్పావు కప్పు, పప్పునూనె – ఒకటిన్నర కప్పులు, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, ఆవాలు– పావు టీస్పూను , ఇంగువ – టీస్పూను.

తయారీ..

  • మామిడికాయలను తొక్కతీసి ముక్కలుగా తరిగి మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
  • తురుముని కప్పుతో కొలుచుకోవాలి. ఇది మూడు కప్పులు అవుతుంది.
  • ఈ తురుములో పసుపు, ఉప్పు వేసి కలిపి ఒకరోజంతా పక్కన పెట్టుకోవాలి. 
  • మరుసటిరోజు ఊరిన ఊటను వడగట్టి ఊటను వేరు వేరుగా, తురుముని విడివిడిగా ఎండబెట్టాలి.
  • ఎండిన తురుముని ఊటలో వేసి బాగా కలపాలి.
  • నూనెను వేడెక్కిన తరువాత ఆవాలు, వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకుని వేయాలి.
  • ఇంగువ వేసి స్టవ్‌ ఆపేయాలి. నూనెను చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు ఎండిన తురుములో కారం, ఆవపిండి, మెంతిపొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇవన్నీ బాగా కలిసాక చల్లారిన నూనె వేసి కలపాలి.
  • ఉప్పు, నూనె తగ్గితే, కలుపుకొని, జాడీలో నిల్వ చేసుకోవాలి. 

చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్‌ బ్రెడ్‌ మంచూరియా తయారీ ఇలా!

మరిన్ని వార్తలు