Kalakand Laddu Recipe: రాఖీ స్పెషల్‌.. దాల్‌ బనానా ఖీర్‌, కలాకండ్‌ లడ్డూ తయారీ ఇలా!

12 Aug, 2022 11:58 IST|Sakshi
దాల్‌ బనానా ఖీర్‌- కలాకండ్‌ లడ్డు

సోదరీ సోదరుల మధ్య ఉన్న ఆత్మీయత, అనురాగ బంధాలకు గుర్తుగా జరుపుకునే పండుగే రాఖీ. ఈ రోజు అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి స్వీట్స్‌ తినిపించడం మన సంప్రదాయం. ఈ సందర్భంగా బయట నుంచి కొనితెచ్చే స్వీట్లు కాకుండా.. నోరూరించే స్వీట్లను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు 
చేసుకోవచ్చో చూద్దాం... 

కలాకండ్‌ లడ్డు
కావలసినవి:
పనీర్‌ తరుగు – వందగ్రాములు
పాలు – లీటరు
పంచదార – కప్పు
నెయ్యిలో వేయించిన డ్రైఫ్రూట్స్‌ – గార్నిష్‌కు సరిపడా.

తయారీ:
మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నని మంట మీద పాలు సగమయ్యేంత వరకు మరిగించాలి.
పాలు మరిగాక పనీర్‌ తరుగు, నెయ్యి, పంచదార వేసి తిప్పుతూ మరికొద్దిసేపు మరిగించాలి
పనీర్‌ నుంచి నీరు వస్తుంది.
ఈ నీరంతా ఆవిరైపోయి పాల మిశ్రమం మొత్తం దగ్గరపడిన తరువాత స్టవ్‌ ఆపేసేయాలి.
మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత లడ్డులా చుట్టుకుని డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

దాల్‌ బనానా ఖీర్‌
కావలసినవి:
పచ్చిశనగపప్పు – కప్పు
అరటిపళ్లు – రెండు!
కుంకుమ పువ్వు – చిటికడు
యాలకులపొడి – టేబుల్‌ స్పూను
పంచదార – రెండు కప్పులు
కండెన్స్‌డ్‌ మిల్క్‌ – రెండు కప్పులు
పాలు – మూడు కప్పులు
ఎండుకొబ్బరి ముక్కలు – రెండు టేబుల్‌ స్పూన్లు
కిస్‌మిస్,జీడిపప్పు పలుకులు – కప్పు
నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
కిస్‌మిస్‌ జీడిపప్పు,ఎండుకొబ్బరి ముక్కలను నెయ్యిలో గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి
జీడిపప్పు వేయించిన బాణలిలో శనగపప్పు వేయాలి.
దీనిలో పాలుకూడా పోసి పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి
ఉడికిన పప్పును మెత్తగా చిదుముకోవాలి.
ఇప్పుడు దీనిలో కండెన్స్‌డ్‌ మిల్క్, కుంకుమపువ్వు, పంచదార, యాలకులపొడి వేసి సన్నని మంట మీద తిప్పుతూ ఉడికించాలి
చివరిగా అరటిపళ్ల తొక్కతీసి సన్నని ముక్కలు తరిగి వేయాలి
అరటిపండు ముక్కలు కూడా మగ్గిన తరువాత, వేయించిన కిస్‌మిస్, జీడిపలుకులు కొబ్బరి ముక్కలతో గార్నిష్‌ చేసి సర్వ్‌చేసుకోవాలి.
వేడిగానైనా, చల్లగానైనా ఈ ఖీర్‌ చాలా బావుంటుంది.  

మరిన్ని వార్తలు