Butter Tea: సువాసన భరిత బటర్‌ టీ.. టింగ్మో, ఖమీరి రోటీ ఇంట్లోనే ఇలా ఈజీగా!

3 Jun, 2022 12:27 IST|Sakshi

Recipes In Telugu: రారమ్మని పిలిచే లద్దాఖ్‌ ప్రకృతి అందాలు.. నీలంరంగు ఆకాశం, మంచు దుప్పట్లు కప్పారా అన్నట్లున్న పర్వతాలతో ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. టిబెట్‌ సంస్కృతీ సంప్రదాయ మూలాలున్న లద్దాఖ్‌ వాసుల వంటకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

ఇక్కడి వంటకాలు టిబెట్, ఇండియన్‌ రుచుల కలబోతతో ఎంతో రుచికరంగా ఉంటాయి. లద్దాఖ్‌ వెళ్లి అక్కడి వంటకాల రుచి చూడాలంటే కాస్త కష్టమే కాబట్టి, అక్కడిదాకా వెళ్లకుండానే లద్దాఖ్‌ పాపులర్‌ వంటకాలను ఎలా వండుకోవచ్చో చూద్దాం...

ఖమీరి రోటీ
కావలసినవి:
►గోధుమపిండి – రెండుంబావు కప్పులు
►నల్ల జీలకర్ర(కలోంజి) – టీస్పూను
►పాలు – కప్పు, పంచదార పొడి – అరటేబుల్‌ స్పూను
►ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
►పొడి ఈస్ట్‌ – ఒకటిన్నర టీస్పూన్లు
►పుచ్చకాయ విత్తనాలు – టీస్పూను
►నువ్వులు – టీస్పూను, కొత్తిమీర – గుప్పెడు, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ..
►ముందుగా గోరువెచ్చని నీటిలో ఈస్ట్‌వేసి నానబెట్టాలి.
►ఒక పెద్దగిన్నెలో గోధుమపిండి, పంచదార వేసి కలపాలి.
►ఈ పిండిలోనే పాలు, ఈస్ట్‌వేసిన నీళ్లు వేసి మెత్తటి ముద్దలా కలపాలి.
►ఈ పిండి ముద్దపై తడివస్త్రాన్ని కప్పి ఇరవై నిమిషాలు పక్కనపెట్టాలి.
►ఇరవై నిమిషాల తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఉండ మధ్యలో చిన్న రంధ్రం చేసి పుచ్చకాయ, నువ్వులు, నల్లజీలకర్ర వేసి మూసేయాలి
►ఇప్పుడు ఉండలను రెండు అంగుళాల మందంలో చిన్నసైజు రోటీల్లా వత్తుకోవాలి.
►ఈ రోటీలను బేకరీ ట్రేలో లేదా పెనం మీద ఆయిల్‌ రాసి దానిపై రోటీని ఉంచాలి.
►ఈ పెనాన్ని సన్నని మంటమీద బోర్లించి రోటీని గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు ఉడికించాలి.
►వేడివేడి రోటీలను కొత్తిమీరతో గార్నిష్‌చేసి, పైన కొద్దిగా నెయ్యి చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి. 

టింగ్మో
కావలసినవి:
► గోధుమపిండి – పావు కేజీ
►ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరగాలి)
►వెల్లుల్లి తరుగు – టీస్పూను
►బేకింగ్‌ పౌడర్‌ – రెండు టీస్పూన్లు
►ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి – రెండు(సన్నగా తరగాలి), నీళ్లు – రెండు కప్పులు, కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు.

తయారీ..


►గోధుమపిండిని ఒక గిన్నెలో వేసి టేబుల్‌ స్పూను ఆయిల్, బేకింగ్‌ పౌడర్‌ వేసి తగినంత నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాలి.
►పిండి ముద్దను చిన్న చిన్న రోల్స్‌ చేయాలి.
►ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుని చక్కగా కలుపుకోవాలి.
►ఈ మిశ్రమాన్ని రోల్స్‌లో నింపి పువ్వులా వత్తుకోవాలి.
►ఈ పువ్వులను ఆవిరి మీద ఇరవై నిమిషాలు ఉడికిస్తే టింగ్మో రెడీ. 

సుజా (బటర్‌ టీ)
కావలసినవి:

►ఎండు టీ ఆకులు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు
►పాలు – ముప్పావు కప్పు
►బటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
►నీళ్లు – రెండున్నర కప్పులు
►ఉప్పు – అరటేబుల్‌ స్పూను.

తయారీ..
►గిన్నెలో నీళ్లు, టీపొడి వేసి మరిగించాలి
►టీపొడి బాగా మరిగి డికాషన్‌ సువాసన వస్తున్నప్పుడు వేరే పాత్రలోకి వడగట్టాలి 
►ఇప్పుడు వడగట్టిన డికాషన్‌లో పాలు, బటర్, ఉప్పువేసి హ్యాండ్‌ బ్లెండర్‌తో ఐదునిమిషాలపాటు చిలకాలి
►చక్కగా చిలికిన తరువాత మరోసారి వేడి చేసి సర్వ్‌ చేసుకోవాలి. 

చదవండి 👇
Nadru Yakhni: చపాతీ, అన్నంలోకి తామర పువ్వు కాడతో రుచికరమైన వంటకం! ఇలా
Mango Vada: పచ్చిమామిడి తురుముతో మ్యాంగో వడ.. 

మరిన్ని వార్తలు