Anapa Ginjala Charu: పాలకూర.. పచ్చిమామిడి ముక్కలతో రుచికరమైన అనపగింజల చారు!

24 May, 2022 12:44 IST|Sakshi

అనపకాయ చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఐరన్‌లు, పీచుపదార్థం పుష్కలం. కూర లేదంటే జ్యూస్‌.. దీనిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఇక వేసవిలో లభించే పచ్చిమామిడికాయ ముక్కలతో అనప గింజల చారు పెడితే టేస్ట్‌ అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇంట్లోనే ఈ వంటకాన్ని తయారు చేసుకోండి.

కావలసినవి:
►లేత పాలకూర – రెండు కట్టలు
►అనపగింజలు – కప్పు
►కొత్తి మీర – చిన్న కట్ట
►ఉల్లిపాయ – ఒకటి
►టొమాటోలు – రెండు
►పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు
►పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు
►పసుపు – అరటీస్పూను, ధనియాల పొడి – టేబుల్‌ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్‌ స్పూన్లు
►ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను
►ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ..
►పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి.
►కుకర్‌ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం,  పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి.
►దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్‌ రానివ్వాలి
►మూడు విజిల్‌ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్‌ రానివ్వాలి
►ఇప్పుడు కుకర్‌ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి
►స్టవ్‌ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్‌ వేయాలి
►ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ.  

చదవండి👉🏾Sorakaya Juice: సొరకాయ జ్యూస్‌ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే!
చదవండి👉🏾Juicy Chicken: జ్యూసీ చికెన్‌.. మటన్‌ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి!

మరిన్ని వార్తలు