Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్‌ హల్వా తయారీ ఇలా..

7 Oct, 2022 12:17 IST|Sakshi
కొర్రల ఇడ్లీ, మిల్లెట్‌ హల్వా

Millet Recipes In Telugu: ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునేందుకు ఈ మధ్యకాలంలో  చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. పండగ సందడిలో  క్యాలరీలను పట్టించుకోకుండా నోటికి రుచించిన ప్రతివంటకాన్ని లాగించేశాం. ఇప్పుడు ఒక్కసారిగా చప్పగా ఉండే మిల్లెట్స్‌ తినాలంటే కష్టమే. అయినా కూడా క్యాలరీలు తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే ‘సిరి’ ధాన్యాలను నోటికి రుచించేలా ఎలా వండుకోవాలో చూద్దాం.... 

కొర్రల ఇడ్లీ
కావలసినవి:
కొర్రలు – మూడు కప్పులు
మినపగుళ్లు – కప్పు
మెంతులు – రెండు టీస్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ:
కొర్రలు, మినపగుళ్లు, మెంతులను శుభ్రంగా కడిగి కొర్రలను విడిగా, మినపగుళ్లు, మెంతులను కలిపి ఐదుగంటలు నానబెట్టాలి
కొర్రలు, మినపగుళ్లు చక్కగా నానాక కొద్దిగా నీళ్లు పోసుకుని విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి
ఈ రెండిటినీ కలిపి కొద్దిగా ఉప్పు వేసి పులియనియ్యాలి
పులిసిన పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఆవిరి మీద ఉడికించాలి.
వేడివేడి కొర్రల ఇడ్లీలు సాంబార్, చట్నీతో చాలా బావుంటాయి.  

మిల్లెట్‌ హల్వా
కావలసినవి:
కొర్రలు – కప్పు
బెల్లం – కప్పు
జీడిపప్పు పలుకులు – టేబుల్‌ స్పూను
కిస్‌మిస్‌లు – టేబుల్‌ స్పూను
నెయ్యి – పావు కప్పు
యాలకులపొడి – పావు టీస్పూను.

తయారీ:
ముందుగా కొర్రలను మరీ మెత్తగా కాకుండా బరకగా పొడిచేసుకుని పక్కన పెట్టుకోవాలి
మందపాటి బాణలిలో బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు మరిగించి పొయ్యిమీద నుంచి దించేయాలి
మరో బాణలిలో నెయ్యివేసి వేడెక్కనివ్వాలి.
నెయ్యి కాగాక జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్‌లు వేసి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పక్కనపెట్టుకోవాలి

ఇదే బాణలిలో కొర్రల పొడి వేసి ఐదు నిమిషాలు వేయించాలి
వేగిన పొడిలో నాలుగు కప్పులు నీళ్లుపోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి
నీళ్లన్నీ ఇగిరాక బెల్లం నీళ్లను వడగట్టి పోయాలి  కొర్రలు, బెల్లం నీళ్లు దగ్గర పడేంత వరకు ఉడికించాలి.
నెయ్యి పైకి తేలుతున్నప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి కలిపి దించేయాలి.  

ఇవి కూడా ట్రై చేయండి: Dussehra 2022 Sweet Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్‌.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్‌ జిలేబీ! తయారీ ఇలా
Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా!

మరిన్ని వార్తలు