Appadalu Recipe: డబ్బు పొదుపు.. ఆరోగ్యం.. ఇంట్లోనే ఇలా రాగుల అప్పడాలు, లసన్‌ పాపడ్‌ తయారీ!

6 May, 2022 12:54 IST|Sakshi

విందు భోజనమైనా, ఇంటి భోజనమైనా పప్పు,  చారు, రసం, చట్నీ, కూరలు ఎన్ని ఉన్నా అప్పడం లేకపోతే భోజనం బోసిపోతుంది. అందుకే దాదాపు అందరి ఇళ్లల్లో లంచ్, డిన్నర్‌లలోకి అప్పడం తప్పనిసరిగా ఉంటుంది. మార్కెట్లో దొరికే అప్పడాలు కాస్త ఖరీదు, పైగా కొన్నిసార్లు అంత రుచిగా కూడా ఉండవు.  

ఈ వేసవిలో మనమే రుచిగా, శుచిగా అప్పడాలు తయారు చేసుకుంటే, డబ్బు పొదుపు, ఆరోగ్యం, కాలక్షేపం కూడా. భోజనానికే వన్నె తెచ్చే అప్పడాలను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

రాగులతో
కావలసినవి: రాగి పిండి – అరకప్పు, మజ్జిగ –  అరకప్పు, నీళ్లు – అరకప్పు, ఉప్పు – టీస్పూను, పచ్చిమిర్చి – రెండు, జీలకర్ర – అర టీస్పూను, ఇంగువ – పావు టీస్పూను, తెల్లనువ్వులు – రెండు టీస్పూన్లు.

తయారీ..
►ముందుగా ఒక గిన్నెలో రాగిపిండి వేయాలి. దీనిలో మజ్జిగ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి
►పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువలను మిక్సీజార్‌లో వేసుకుని పేస్టుచేయాలి
►రెండు కప్పుల నీటిని బాణలిలో పోసి మరిగించాలి.
►నీళ్లు మరిగాక రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు వేసి ఐదు నిమిషాలు ఉంచాలి.
►ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమం వేసి ఉడికించాలి. రాగి మిశ్రమం దగ్గర పడిన తరువాత నువ్వులు వేసి స్టవ్‌ బీద నుంచి దించేయాలి.
►ఈ మిశ్రమాన్ని పలుచగా నీళ్లు చల్లిన పొడి వస్త్రంపై గుండ్రంగా అప్పడంలా వేసి  ఎండబెట్టాలి.
►ఒకవైపు ఎండిన తరువాత రెండోవైపు కూడా పొడి పొడిగా ఎండాక ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వచేసుకోవాలి. 

లసన్‌  పాపడ్‌
కావలసినవి: శనగపిండి – పావు కేజీ, వెల్లుల్లి తురుము – రెండున్నర టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి – ఐదు (సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, కారం – టీస్పూను, ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు,

తయారీ..
►శనగపిండిలో పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉప్పు, కారం, ఆయిల్‌ వేసి కలపాలి
►మిశ్రమానికి సరిపడా నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాలి.
►►పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, çపల్చగా అప్పడంలా వత్తుకోవాలి
వీటిని నాలుగు రోజులపాటు ఎండబెట్టాలి. చక్కగా ఎండిన తరువాత ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వచేసుకోవాలి.  

పొటాటో పాపడ్‌
కావలసినవి: బంగాళ దుంపలు – కేజీ, బియ్యప్పిండి – రెండు కప్పులు ఉప్పు – టీస్పూను, కారం – టీస్పూను, ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర – రెండు టీస్పూన్లు.

తయారీ..
►ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి కుకర్‌ గిన్నెలో వేయాలి.
►దీనిలో రెండు కప్పుల నీళ్లు పోసి, ఒక విజిల్‌ వచ్చేంత వరకు ఉడికించాలి.
►విజిల్‌ వచ్చాక 5 నిమిషాలపాటు మీడియం మంటమీద మెత్తగా ఉడికించాలి.
►దుంపలు చల్లారాక తొక్క తీసి, మెత్తగా చిదుముకుని, బియ్యప్పిండిలో వేయాలి.
►దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర వేసి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాల.
►చేతులకు కొద్దిగా ఆయిల్‌ రాసుకుని దుంప మిశ్రమాన్ని ఉండలు చేయాలి.
►పాలిథిన్‌  షీట్‌కు రెండు వైపులా ఆయిల్‌ రాసి మధ్యలో ఉండ పెట్టి పలుచగా వత్తుకుని ఎండబెట్టాలి.
►రెండు వైపులా ఎండిన తరువాత గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. 

చదవండి👉🏾Hair Care Tips: వాల్‌నట్స్‌ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ వల్ల
చదవండి👉🏾Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్‌.. ట్యాన్‌, మృతకణాలు ఇట్టే మాయం!

మరిన్ని వార్తలు