Travel: వంద ఏళ్ల కంటే ముందు కట్టిన తొలి ఎర్రకోట

26 Jun, 2021 10:24 IST|Sakshi
 ఎర్రకోటలోని షా బుర్జ్‌ నుంచి తాజ్‌మహల్‌ వ్యూ

రెడ్‌ఫోర్ట్‌... అనగానే స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రధానమంత్రి జాతీయపతాకాన్ని ఆవిష్కరించే ఢిల్లీలో ఉన్న ఎర్రకోట గుర్తుకు వస్తుంది. మన మెదడు అలా ట్యూన్‌ అయిపోయింది. కానీ ఆ ఎర్రకోట కట్టడానికి వంద ఏళ్ల కంటే ముందు కట్టిన తొలి ఎర్రకోట ఆగ్రాలో ఉంది. మొఘల్‌ పాలకుల ఉత్థానపతనాలకు ఈ కోట ప్రత్యక్షసాక్షి. 

యమునాతటి
ఆగ్రా లాల్‌ఖిలాలోకి పర్యాటకులను అమర్‌సింగ్‌ గేట్‌ నుంచి అనుమతిస్తారు. దాదాపుగా వంద ఎకరాల విస్తీర్ణంలో కట్టిన కోట ఇది. తాజ్‌మహల్, లాల్‌ఖిలా రెండూ యమునానది తీరాన ఉన్నాయి. ఈ కోటలోని అనేక ప్యాలెస్‌ల నుంచి తాజ్‌మహల్‌ కనిపిస్తుంది. తాజ్‌మహల్‌ దగ్గర యమునానది కొద్దిపాటి వంపు తిరుగుతుంది. ఆ వంపుకు అనుగుణంగానే ఈ కోట నిర్మాణం జరిగింది.

షాజహాన్‌ నుంచి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబు తండ్రిని జైల్‌లో పెట్టడం, తాజ్‌మహల్‌ కనిపించేటట్లు ఖైదు చేయమన్న షాజహాన్‌ కోరిక కళ్లకు కడతాయి. షాజహాన్‌ పట్ల జాలిపడిన క్షణాలు గుర్తుకు వస్తాయి. అయితే షాజహాన్‌ అంత్యకాలంలో నివసించిన, మనం చెరసాల అని చెప్పుకున్న షా బుర్జ్‌ను చూస్తే... చిన్నప్పుడు అనవసరంగా జాలిపడ్డామేమో అనిపించకమానదు. షాజహాన్‌ జైలు జీవితం కోటలోని అందమైన ప్యాలెస్‌లోనే గడిచింది. 

గోడకు చెక్కిన తీగలు
ఆగ్రాఫోర్ట్‌లో అందమైన కట్టడాలు, రాజ ప్రాసాదాలు లెక్కకు మించి ఉన్నాయి. పాలకులు సామాన్య ప్రజలకు దర్శనమిచ్చే దివానీ ఆమ్, మంత్రి వర్గ సమావేశాల హాలు దివానీ ఖాస్, రతన్‌సింగ్‌ హవేలీ, బెంగాల్‌మహల్, శీష్‌మహల్, షాజహాన్‌ మహల్, జహంగీర్‌ బాత్‌టబ్‌ ప్రత్యేకం గా చూడాల్సినవి. తాజ్‌మహల్‌లో ఉన్నట్లే పాలరాతిలో ఇన్‌లే వర్క్‌ ఇక్కడి ప్యాలెస్‌లలోనూ కనిపిస్తుంది.

అలాగే పాలరాతి గోడల్లో చెక్కిన డిజైన్‌లలో అష్టభుజి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా... బ్లాక్‌ ప్రింటింగ్‌లో ఉండే ఒకదానితో ఒకటి అల్లుకున్నట్లుండే సన్నని లతలు తీగల డిజైన్‌లు గోడల మీద, పై కప్పు మీద కనిపిస్తాయి. ఇక్కడ ఒక పాలరాతి బల్లను చూపించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఈ కోటకు వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నారని చెబుతారు గైడ్‌లు. అప్పటి వరకు కూర్చోవాలనే ఆలోచన లేని వాళ్లకు కూడా అప్పుడు కూర్చోవాలనిపిస్తుంది. ఆ బల్ల నుంచి ఫోర్ట్‌ వ్యూ బాగుంటుంది.  

కోట నుంచి తాజ్‌ 
ఆగ్రా ఎర్రకోటలో కనిపించే పాలరాతి నిర్మాణాల్లో ఎక్కువ భాగం షాజహాన్‌ కట్టించినవే. అప్పటి వరకు ఈ కోట ఎన్ని చేతులు మారినా ఎవరూ ముందున్న నిర్మాణాలను ధ్వంసం చేయలేదు. కానీ షాజహాన్‌ మాత్రం తాననుకున్న నిర్మాణాల కోసం పాత వాటిని కూల్చేశాడు. ఈ కోటలోపల ఉన్న ఆయుధాగారాన్ని అక్బర్‌ విజయాగారం అనవచ్చు. ఆగ్రా టూర్‌ అంటే ప్రధానంగా తాజ్‌మహల్‌ కోసమే అయి ఉంటుంది. ఆగ్రా కోసం కేటాయించుకున్న టైమ్‌లో తాజ్‌ మహల్‌ ను చూసేసి వెనక్కి రావడమే కాకుండా మరో రెండు–మూడు గంటలు కేటాయించుకోగలిగితే ఈ కోటను కూడా కవర్‌ చేయవచ్చు. తాజ్‌మహల్‌ను మరో కోణంలోనూ వీక్షించవచ్చు.

లాల్‌ఖిలా ప్రధానద్వారం
తాజ్‌మహల్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ రెడ్‌ఫోర్ట్‌ 16వ శతాబ్దం తొలిరోజుల్లోనే ఉంది. బాబర్‌ మొదటి పానిపట్‌ యుద్ధంలో ఇబ్రహీం లోదీని ఓడించి రెడ్‌ఫోర్ట్‌లో అడుగుపెట్టాడు. హుమయూన్‌ కిరీటధారణ ఇక్కడే జరిగింది. పదేళ్ల తర్వాత హుమయూన్‌ ఈ కోటను షేర్‌షా సూరికి వదులుకున్నాడు. మరో పదిహేనేళ్లకు తిరిగి స్వాధీనం చేసుకుని మరో ఏడాదికే మళ్లీ చేజార్చుకున్నాడు.

అక్బర్‌ దాదాపుగా తన హయాం మొత్తం ఈ కోట నుంచే పరిపాలన చేశాడు. కోటకు మరమ్మతులు కూడా చేశాడు. జహంగీర్‌ పాలన కూడా ఇక్కడి నుంచే సాగింది. షాజహాన్‌ ఢిల్లీలో పెద్ద ఎర్రకోటను కట్టి రాజధానిని ఢిల్లీకి మార్చేవరకు అన్ని రికార్డుల్లోనూ లాల్‌ఖిలా అంటే ఆగ్రాలోని ఎర్ర కోట మాత్రమే. ఈ కోట మధ్యలో జాట్‌లు, చౌహాన్‌ల అధీనంలోకి కూడా వెళ్లింది. చివరగా మరాఠాల నుంచి 19వ శతాబ్దంలో బ్రిటిష్‌ వశమైంది.
– వాకా మంజులారెడ్డి

చదవండి: నాగార్జునసాగర్‌లో మొదలైన లాంచీ ప్రయాణం

మరిన్ని వార్తలు