Red Rice: ఎర్ర బియ్యం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

21 Jul, 2021 16:27 IST|Sakshi

ఎర్ర బియ్యం.. దివ్యౌషధం!

మధుమేహ రోగులకు వరం 

ఆస్తమా, కీళ్ల నొప్పులు, క్యాన్సర్, గుండె జబ్బులు దూరం

పుష్కలంగా పీచు పదార్థాలు, విటమిన్ల సహా పలు పోషకాలు

మీకు షుగర్‌ ఉందా? అధికంగా పీచు పదార్థాలున్న ఆహారం కావాలా? పుష్కలంగా పోషక విలువలున్న తిండి గింజల కోసం చూస్తున్నారా? ఆస్తమా, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఎర్ర బియ్యంపై ఓ లుక్కేయండి. ఈ బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల షుగర్‌ నియంత్రణలోకి వస్తోందని దాన్ని తింటున్న వాళ్లు చెబుతున్న మాట. ఆస్తమా, కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుందన్నది నిపుణుల మాట. అన్నట్టు.. ఎర్ర బియ్యాన్ని సాంబారు, పెరుగుతో లాగిస్తే ఉంటుంది నా సామిరంగా..! అంతేకాదు.. ఈ బియ్యంతో వండిన అన్నం తిన్నాక అంత త్వరగా ఆకలి వేయదని ఎర్ర బియ్యం ప్రియులు చెబుతున్నారు. 

ఎక్కడ పండిస్తున్నారంటే.. 
ఎర్ర బియ్యంలో దాదాపు 34 రకాలకు పైగా ఉన్నాయి. కెంపు సన్నం, చంద్రకళ, జకియా, బారాగలి, రక్తసాలి, కాల్‌చర్, కలాంకాలి, నవారా.. వీటి రకాల్లో కొన్ని. కెంపు సన్నం, కాల్‌చార్‌లు సన్నాలు. కలాంకాలి రకం అయితే సన్నదనంతో పాటు గింజ పొడవుగా కూడా ఉంటుంది. అయితే వీటన్నింటిలోకెల్లా నవారా రకాన్ని బాగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం కిలో బియ్యం రూ.120 దాకా దాకా పలుకుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 600 మంది రైతుల దాకా ఎర్ర బియ్యాన్ని పండిస్తున్నారు. వీరిలో 80 మంది తెనాలి సమీపంలోని అత్తోటలోనే ఉన్నారు. పాలేకర్‌ వ్యవసాయ విధానంలో దేశవాళీ వరిసాగులో భాగంగా ఒక్కొక్కరూ 10, 20 సెంట్ల విస్తీర్ణంలో పండిస్తున్నారు. వారు తినగా మిగిలినవి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల నుంచి మధుమేహ రోగులు, ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారులు ఎర్ర బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 

తెనాలి: ఎర్ర బియ్యానికి ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోంది. పీచు పదార్థాలతో పాటు అధికంగా పోషకాలుండటంతో క్రమంగా ఈ బియ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. తెల్లని బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే, ఇతర అన్ని రకాల బియ్యంలో కన్నా ఎర్ర బియ్యంలో పీచు అధికంగా ఉంది. జీర్ణ శక్తిని పెంచి, రక్తనాళాల్లో పూడికలను తొలగించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. విటమిన్‌ బి1, బి2, బి6లతో పాటు ఐరన్, జింక్, పోటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటన్నింటికీ మించి మధుమేహ రోగులకు ఈ బియ్యం దివ్యౌషధంలా ఉపకరిస్తున్నాయి. ఇందులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 45 శాతం కన్నా తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర నిల్వను ఎక్కువగా లేకుండా చేస్తాయి. ఎర్ర అన్నాన్ని రోజూ తినడం వల్ల ఐరన్‌ తగినంత లభిస్తుంది. రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరిగి, కణజాలానికి సక్రమంగా అందుతుంది. క్రమం తప్పకుండా తింటుంటే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. ఆస్తమా, కీళ్ల సమస్యలూ తొలగిపోతాయి. 

లాభదాయకం..
సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల ఎర్ర బియ్యం సాగుకు ఎకరానికి పెట్టుబడి రూ.20,000కు మించదు. ఎర్ర బియ్యం రకాలన్నింటికీ పంట కాలం 110 నుంచి 130 రోజులు. ఎకరానికి గరిష్టంగా 13 బస్తాల(బస్తాకు 75 కిలోలు) ధాన్యం దిగుబడి వస్తుంది. వీటి నుంచి 650 కిలోల బియ్యం వస్తాయి. బియ్యం కిలోకు రూ.120 చొప్పున రూ.78,000 దిగుబడి వస్తుంది. ఖర్చులు రూ.20,000 పోగా రూ.58,000 దాకా మిగులుతాయి. కౌలు రైతు అయితే ఇంకో రూ.20,000 కౌలు తీసేస్తే.. రూ.38,000 మిగులుతాయి. 

మరిన్ని వార్తలు