నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి?

8 Aug, 2021 15:25 IST|Sakshi

 సందేహం

నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 6వ నెల. స్కానింగ్‌ రిపోర్ట్‌లో మాయ కిందకు ఉందని, సర్విక్స్‌ ఇంటర్నల్‌ ఆస్‌ 2.7 సెం.మీ దూరంలో ఉందని, అలాగే, ఉమ్మనీరు కొద్దిగా ఎక్కువగా ఉందని, బిడ్డ అవయవాలు సరిగానే ఉన్నాయని చెప్పారు. ఇలాంటప్పుడు నేను పూర్తిగా బెడ్‌రెస్ట్‌లోనే ఉండాలా? ఇంట్లో నుంచే ఆఫీస్‌ వర్క్‌ చేసుకోవచ్చా? దయచేసి సలహా ఇవ్వండి?
– సౌజన్య, తాడికొండ

గర్భాశయంలో గర్భం మొదలయ్యేటప్పుడు పిండం అందులో గర్భాశయం పొరను అతుక్కుని, దాని నుంచి రక్తసరఫరా దక్కించుకునే ప్రయత్నంలో జెస్టేషనల్‌ స్యాక్, అందులో ఉమ్మనీరు, మాయ ఏర్పడుతుంది. మొదటి మూడు నెలల్లో మాయ మొత్తం పిండాన్ని కప్పి ఉంచి, తర్వాత కుదించుకుని ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. ఇలా జరిగే క్రమంలో మొదట గర్భాశయంలో కిందకు ఉండి, బిడ్డ పెరిగే కొద్ది మాయ మెల్లగా పైకి జరుగుతుంది. కొందరిలో పిండం గర్భాశయం కిందభాగం అంటే గర్భాశయ ముఖద్వారం అయిన సర్విక్స్‌కు పైన లేదా దానికి దగ్గరలో ఉండిపోతుంది. దీనినే ‘ప్లాసెంటా ప్రీవియా’ అంటారు.

అది సర్విక్స్‌ గర్భాశయంలోకి మొదలయ్యే ప్రాంతం అయిన ఇంటర్నల్‌ ఆస్‌కు ఎంత దగ్గరలో ఉంది అనే కొలతను బట్టి కంప్లీట్‌ ప్లాసెంటా ప్రీవియా, మార్జినల్‌ ప్లాసెంటా ప్రీవియా, లో లైయింగ్‌ ప్లాసెంటా వంటివిగా స్కానింగ్‌ రిపోర్టులో పేర్కొనడం జరుగుతుంది. సాధారణంగా సెకండ్‌ ట్రెమిస్టర్‌లో చాలామందికి మాయ కిందనే ఉన్నా, థర్డ్‌ ట్రెమిస్టర్‌లోకి వచ్చేటప్పటికి అది పైకి జరిగిపోతుంది. కొందరిలో మాత్రం కాన్పు సమయం వరకు కిందకే ఉండిపోతుంది. అది కిందకు ఉన్నంత వరకు ఎక్కువ శారీర ఒత్తిడి వంటి వాటి వల్ల అప్పుడప్పుడు కొద్దికొద్దిగా బ్లీడింగ్‌ అవడం, కొందరిలో ఆగకుండా అయ్యి తల్లికి బిడ్డకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి.

మీ రిపోర్టులో మాయ సర్విక్స్‌ ఇంటర్నల్‌ ఆస్‌ నుంచి 2.7 సెం.మీ. దూరంలో ఉంది. కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్మనీరు కొద్దిగా ఎక్కువగా ఉంది. మీ పరిస్థితికి మొత్తం బెడ్‌రెస్ట్‌ అవసరం లేదు. కొందరిలో సుగర్‌ లెవల్స్‌ పెరిగే ముందు ఉమ్మనీరు ఎక్కువగా ఉండవచ్చు. ఒకసారి జీటీటీ సుగర్‌ టెస్ట్‌ చేయించుకోండి. ఇంట్లో నుంచి ఆఫీసు పని చేసుకోవచ్చు. దానికేమీ ఇబ్బంది లేదు.

మా అమ్మాయి వయసు 20 ఏళ్లు. ఎత్తు 5.1 అడుగులు, బరువు 65 కిలోలు. ఆరునెలలుగా నెలసరి రావడం లేదు. ఇదివరకు నెలసరి సక్రమంగానే వచ్చేది. డాక్టర్‌కు చూపిస్తే పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉందని చెప్పారు. మా అమ్మాయికి నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి?
– సరిత, గజపతినగరం

ఎత్తు 5.1 అడుగులు ఉన్నప్పుడు బరువు గరిష్టంగా 55 కిలోల వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే దానిని అధిక బరువు కింద పరిగణించాల్సి ఉంటుంది. మీ అమ్మాయి 65 కిలోల బరువు ఉంది. అంటే 10 కిలోల అధిక బరువు ఉంది. అమ్మాయిలకు బరువు పెరిగే కొద్ది మొదట కొవ్వు పొట్ట చుట్టూ చేరి, పొట్ట లావు పెరగడం జరుగుతుంది. తర్వాత పిరుదుల దగ్గర, తర్వాత చేతులు లావు కావడం జరుగుతుంది. అధిక బరువు వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం జరగవచ్చు. కొందరిలో అధిక బరువు వల్ల అండాశయంలో నీటిబుడగల సమస్య (పీసీఓడీ) వంటివి ఏర్పడటం వల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవచ్చు.

కొందరిలో థైరాయిడ్‌ సమస్య వల్ల కూడా బరువు పెరగడం, దానివల్ల పీరియడ్స్‌ సరిగా రాకపోవచ్చు. కాబట్టి మీ అమ్మాయికి పీరియడ్స్‌ సక్రమంగా రావాలంటే బరువు తగ్గడం ఒక్కటే మార్గం. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే తర్వాతికాలంలో వివాహం అయిన తర్వాత పిల్లలు కనడానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువ. బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఆహారంలో జంక్‌ఫుడ్, నూనె వస్తువులు, తీపి పదార్థాలు, బేకరీ ఐటమ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోకుండా, ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటివి తీసుకోవడం మంచిది. వాకింగ్, యోగా, స్కిప్పింగ్, ఏరోబిక్స్, డ్యాన్స్‌ వంటి వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి. 
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు