Rehana Shah Jahan: కేరళ అమ్మాయి ప్రపంచ రికార్డ్‌! 24 గంటల్లో ఏకంగా..

30 Aug, 2022 11:55 IST|Sakshi
PC: Rehna Shajahan

ఆన్‌లైన్‌ పాఠాల నుంచి ఉద్యమ బాటల వరకు..

‘నేనింతే’ అనుకుంటే.. ‘అవును. అంతే’ అంటుంది విధి. అప్పుడు కాళ్లకు బంధనాలు పడతాయి. కలలు మసకబారిపోతాయి. ‘యస్‌. నేను సాధించగలను.  ఆ శక్తి నాలో ఉంది అనుకుంటే మాత్రం కొత్త అడుగులు పడతాయి. మన విజయాలు సగర్వంగా మాట్లాడుతాయి...’  అని చెప్పడానికి  నిలువెత్తు నిదర్శనం రెహన షాజహాన్‌...

ఒక్క మార్కుతో దిల్లీలోని ప్రసిద్ధ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఎంకాం సీటు మిస్‌ అయిన సందర్భంలో కేరళలోని కొట్టాయంకు చెందిన రెహన షాజహాన్‌ ముందు ప్రశ్న రూపంలో చీకటి నిల్చుని ఉంది.

ఆ చీకట్లోనే, అక్కడే ఉండి ఉంటే రెహన ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచేది కాదు.
సీటు మిస్‌ అయిన నిరాశలో నుంచి వేగంగా తేరుకొని, ఒకేసారి ఆన్‌లైన్‌లో సోషల్‌వర్క్, గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చేసింది. జామియా మిలియా ఇస్లామియాలో ఎంబీఏలో సీటు సంపాదించింది.

‘ఎంబీఏ  సీటు సంపాదించడం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నేను సాధించగలను అనే బలాన్ని ఇచ్చింది’ అంటుంది రెహన.
‘మహిళలలో ఉన్న  శక్తిసామర్థ్యాలు అపారం. వాటిని వారికి ఎరుకపరచడమే మా ధ్వేయం’ అనే నినాదంతో దిల్లీ కేంద్రంగా ‘వుమెన్స్‌ మ్యానిఫెస్టో’ అనే స్వచ్ఛంద సంస్థ మొదలైంది. ఈ సంస్థలో భాగం కావడం ద్వారా తన మానసిక దృక్పథాన్ని విశాలం చేసుకునే అవకాశం ఏర్పడింది.

నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, గృహహింస బాధితులకు అండగా నిలవడం, వారికి కావాల్సిన న్యాయసహాయాన్ని అందించడం, ఆరోగ్యం, శుభ్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్డడం...ఇలా కెరీర్‌ గైడెన్స్‌ నుంచి బాధితుల కన్నీరు తుడవడం వరకు ‘వుమెన్స్‌ మ్యానిఫెస్టో’ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహించింది.

పాఠ్యపుస్తకాలు చదువుకున్న రెహనకు ‘ఉమెన్స్‌ మ్యానిఫెస్టో’ ప్రభావంతో సమాజాన్ని లోతుగా చదువుకునే అవకాశం లభించింది. వెబినార్‌ స్పీకర్, జోష్‌ టాక్స్‌ స్పీకర్‌గా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసింది.

జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడానికి అవకాశం ఇచ్చే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ సంస్థల ఉచిత ఆన్‌లైన్‌ కోర్సుల గురించి తెలుసుకుంది. 24 గంటలలో 81 ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌లను సొంతం చేసుకొని ప్రపంచ రికార్డ్‌ సృష్టించింది. అంతకుముందు ఉన్న రికార్డ్‌ను బ్రేక్‌ చేసింది.

‘నీలో ఉన్న ధైర్యాన్ని నువ్వు కనిపెట్టేంత వరకు నువ్వు ఎంత ధైర్యవంతురాలివో నీకు తెలియదు. నీలోని శక్తి,సామర్థ్యాలను తెలుసుకునేంత వరకు నువ్వు ఎంత శక్తిమంతురాలిలో నీకు తెలియదు’ అంటున్న రెహన యూట్యూబ్‌ ఛానల్‌ మొదలుపెట్టింది.

రెహన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంలోని నుంచి కొంత... ‘మన కోసం ఒక అవకాశం ఎక్కడో ఒకచోట ఎదురుచూస్తుంటుంది. అది ఎక్కడ ఉందో తెలుసుకోవడమే మన పని. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా తక్కువ చేసి చూశారా? ఏమీ సాధించలేరనే వెక్కిరింపులు మీకు ఎదురయ్యాయా! అయితే  మీరు నా గురించి తెలుసుకోవాల్సిందే. చిన్నప్పుడు అక్కయ్యతో పోల్చుతూ నన్ను చిన్నబుచ్చేవారు.

మనకు ఏ సబ్జెక్ట్‌లో ఆసక్తి ఉందో ఆ సబ్జెక్ట్‌లోనే రాణిస్తాం. మంచి విజయాలు సాధిస్తాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సైన్స్‌ నుంచి కామర్స్‌కు మారాను. ఇక వెనక్కి చూసుకోవాల్సిన పనిలేదు. అయితే జామియా యూనివర్శిటీలో పీజీ సిట్‌ మిస్‌ అయిన క్షణం మాత్రం కొంచెం నిరాశకు గురయ్యాను. దీని నుంచి నేను గుణపాఠం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసం మంచిది, అతి ఆత్మవిశ్వాసం మాత్రం చెడ్డది’

‘మీ ప్రసంగం విన్న తరువాత నన్ను నేను చాలా మార్చుకున్నాను’ అని యూట్యూట్‌ కామెంట్‌ సెక్షన్‌లో ఒకే వాక్యంలో తనలోని మార్పు గురించి రాసింది ఒక అమ్మాయి.
రెహన షాజహాన్‌ స్ఫూర్తిదాయకమైన విజేత అని చెప్పడానికి ఆ అమ్మాయి కామెంట్‌ చాలు కదా!
చదవండి: Divya Mittal: ఐ.ఏ.ఎస్‌ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి

మరిన్ని వార్తలు