ఆమెకు సముద్రమే అన్నం ముద్ద

18 Jun, 2021 04:52 IST|Sakshi
వల విసురుతున్న రేఖ

భారతదేశంలో చేపలు పట్టే లైసెన్సు ఉన్న ఏకైక మహిళ రేఖ కోవిడ్‌ విసిరిన మృత్యుకెరటాలకు ఏమాత్రం చలించలేదు. లాక్‌డౌన్‌ వల్ల, తుఫాన్ల వల్ల, గుండె ఆపరేషన్‌ కోసం ఎదురు చూస్తూ వేటకు రాలేని నిస్సహాయ భర్త వల్ల ఆమె ఓడిపోదలుచుకోలేదు. ఇంత పెద్ద సముద్రం అమ్మలా ఉంది నాకేం భయం అనుకుంది. రోజూ తీరంలో దొరికే సముద్రపు చిప్పలను ఏరి బతుకు వెళ్లమారుస్తుంది. నలుగురు ఆడపిల్లలు ఉన్నారామెకు. భర్తతో కలిపి ఐదుగురు పిల్లలు అనుకుంటూ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటోందామె.

కేరళ త్రిచూర్‌ జిల్లాలోని ఎత్తాయి సముద్రతీరం లో రోజూ తెల్లవారు జామున ఆమె కనిపిస్తుంది. ఒక నీలిరంగు ప్లాస్టిక్‌ బాస్కెట్‌ను పట్టుకుని కెరటాల వెంట సాగుతూ దేనినో అన్వేషిస్తూ ఉంటుంది. దేనిని? సముద్రపు చిప్పల్ని (సాధారణ ఆల్చిప్పలు/అయిస్టర్‌ షెల్స్‌). ఆమె వాటిని ఏరుకుంటూ ఆ బుట్ట నిండేవరకూ అక్కడే తిరుగుతుంది. బుట్ట నిండితే 60 రూపాయలు వస్తాయి. ‘ఒక్కోసారి సగం బాస్కెట్‌ కూడా దొరకవు. అమ్మ ముఖం చాటేస్తుంది’ అని నవ్వుతుంది. ఆమె పేరు రేఖ. ఆమె అమ్మ అంటున్నది సముద్రాన్ని. నిజానికి ఆమె సముద్రంలో చేపలు పట్టాలి. కాని సముద్రపు చిప్పల్ని ఏరాల్సి వస్తోంది. ‘సముద్రంలో కెరటాలకు నేను ఎప్పుడూ భయపడలేదు. కాని జీవితంలో కెరటాలకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది’ అంటుంది నలభై ఏళ్ల రేఖ.

సముద్రంలో రేఖ

తొలి డీప్‌ ఫిషింగ్‌ లైసెన్స్‌ హోల్డర్‌
డీప్‌ ఫిషింగ్‌ లైసెన్స్‌ను పొందడం చాలా కష్టం. దానికి యోగ్యత సాధించాలంటే అనుభవం, అర్హత ఉండాలి. దానిని పొందడం మగవారికే సొంతం. కాని దేశంలో మొదటిసారి ఆ లైసెన్స్‌ను పొందిన ఏకైక మహిళ రేఖ. ‘సముద్రంలో నేను 50 కిలోమీటర్లు వెళ్లి చేపలు పట్టేదాన్ని’ అంటుంది రేఖ. ఇంటర్‌ వరకూ చదువుకున్న రేఖ 2016లో త్రిచూర్‌ నుంచి దేశంలో తొలి మహిళగా డీప్‌ ఫిషింగ్‌ లైసెన్స్‌ పొందినప్పుడు మీడియాలో చాలా కవరేజీ వచ్చింది. ఒక స్త్రీ చేపల వేటకు వెళ్లడం విశేషం అని అందరూ మెచ్చుకున్నారు. ‘పడవలో నా భర్త చేపల వేటకు వెళ్లే ప్రతిసారీ సహాయకులు వస్తారా రారా అని టెన్షన్‌ పడేవాడు.

సముద్రంలో చేపల వేటలో...

చేపలు పట్టడానికి పడవలో కనీసం ముగ్గురు ఉండాలి. నిజానికి వాళ్లకు కూలి ఇచ్చే స్థితి కూడా కాదు మాది. ఈ టెన్షన్‌ అంతా ఎందుకు.. నేను వస్తాను కదా అని తోడు బయలుదేరేదాన్ని. అలా భార్యను తీసుకుని వేటకు వెళ్లడానికి మగవాళ్లు ఇష్టపడరు. కాని నా భర్త సమ్మతించాడు. తోడు తీసుకుని వెళ్లి వేట చేయడం నేర్పాడు. నేను బాగా నేర్చుకున్నాను. నాకు సముద్రంలో ప్రతి అల ఆనుపానులు తెలుసు.’ అంటుంది రేఖ.
కేరళలో చాలామంది స్త్రీలు బ్యాక్‌వాటర్స్‌లో చేపలు పడతారు. కాని సముద్రం మీదకు వెళ్లరు. ఇంకా చెప్పాలంటే సముద్రం మీదకు వెళ్లేందుకు వారిని ఎవరూ ప్రోత్సహించరు. రేఖ ఆ ధైర్యం చేయడం వారికి పెద్ద స్ఫూర్తిగా మారింది. ‘మా దగ్గర సాంకేతిక పరికరాలు, ఆధునిక జాకెట్లు ఏమీ ఉండవు. మాకు తెలిసిందల్లా సముద్ర దేవత కడలమ్మే. ఆమె మమ్మల్ని చూసుకుంటుంది’ అంటుంది రేఖ.

కుటుంబ సభ్యులతో...
‘సముద్రంలో వేటకు వెళ్లాలంటే వలను నిర్వహించడం తెలియాలి. చాలాసార్లు చేపలు పడకపోగా వలల్ని సముద్రపు పందులు (స్కాటోప్లేన్స్‌) కొరికేస్తాయి. నిరాశ పడక ఆ వలను రిపేరు చేసుకొని మళ్లీ వెళ్లాలి. సముద్రంలో వేట చావు–బతుకు, ఆశ నిరాశల మధ్య సాగుతుంది’ అంటుంది రేఖ.

సెకండ్‌ వేవ్‌ సవాలు
రేఖ జీవితం సజావుగా సాగుతుండేది. భర్త కార్తికేయన్‌తో వేటకు వెళ్లేది. ‘రాత్రంతా వేట చేసి తిరిగి వచ్చి పడ్డ చేపలను హార్బర్‌కు తీసుకెళ్లి అమ్మితే రోజుకు ఎంత లేదన్నా రెండు మూడు వేలు వచ్చేవి’ అంటుంది రేఖ. అయితే ఇలా రోజూ చేపలు పడలేదు. అయినా సగటున ముప్పయి వేల ఆదాయం అయితే వచ్చేది. రేఖకు నలుగురు ఆడపిల్లలు. సముద్ర తీరంలోనే ఆమెకో కచ్చా ఇల్లు ఉంది. పిల్లలను చదివించుకుంటూ జీవితం లాక్కువస్తుంటే హటాత్తుగా భర్త గుండెజబ్బు బయటపడింది. దానికి సర్జరీ అవసరం అని డాక్టర్లు అన్నారు. ఈలోపు సెకండ్‌ వేవ్‌ వచ్చి ఆ సర్జరీ కాస్త పోస్ట్‌పోన్‌ అయ్యింది. భర్త వేటకు వచ్చేలా లేడు. లాక్‌డౌన్‌ వల్ల సరుకు లావాదేవీలు స్తంభించి వేట సాగడం లేదు. తుఫాన్లు, భారీ వానలు కూడా పనికి అంతరాయం. ఏం చేయాలి? ఇల్లైతే గడవాలి. ‘సముద్రాన్నే నమ్ముకున్నాను. ధైర్యంగా ఉన్నాను’ అంటుంది రేఖ. తీరంలో దొరికే సాధారణ అయిస్టర్‌ షెల్స్‌ను కాల్షియం ముడిసరుకుగా కొంటారు. ఆ సముద్రపు చిప్పల్ని ఏరి అమ్మే పనిలోకి దిగింది రేఖ. ఒకోసారి రెండు మూడు డబ్బాలు దొరుకుతాయి. ఒక్కోసారి దొరకవు. కాని ధైర్యంగా జీవితం గడుపుతోందామె.

కొత్త సముద్రం
‘సముద్రం కూడా రంగు మార్చుకుంటుంది. పాత చేపలు వెళ్లి కొత్త చేపలు వస్తాయి. ఈ కష్టాలు కూడా పోతాయి. మళ్లీ మాకు మంచి జీవితం వస్తుంది’ అంటుంది రేఖ. ఆమె దగ్గర ఇప్పుడున్నదల్లా ఒక పాత పడవ. ఆ పడవతో సముద్రంలో వెళ్లాలంటే భర్త కోలుకోవాలి. ‘కొట్టాయం ఆస్పత్రిలో డాక్టర్లు డేట్‌ ఇచ్చారు. పోస్ట్‌పోన్‌ అయ్యింది కరోనా వల్ల’ అందామె.

చాలామంది కష్టాలు వస్తే ‘ఏ సముద్రంలో దూకి చావను’ అంటుంటారు. రేఖ సముద్రం దగ్గరే ఉంది. సముద్రంతోనే ఉంది. కాని ఆమె సముద్రంలో దూకి చావదల్చుకోవడం లేదు. సముద్రాన్నే ఆధారం చేసుకుని అనుక్షణం బతకాలనిపిస్తోంది. ‘కెరటం ఆదర్శం నాకు. పడినందుకు కాదు. పడినా లేచినందుకు’ అన్న కవి వాక్కు రేఖ జీవితాన్ని ఒక సజీవ వ్యాఖ్యానంలా ఉంది.

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు