రేణు ది గ్రేట్‌

8 Dec, 2022 04:43 IST|Sakshi
రేణు పాసవాన్‌

స్త్రీ హక్కుల గొంతుక

భయంతో కూడిన మౌనం కంటే నిర్భయమైన నిరసన ఆయుధం అవుతుంది. రేణు పాసవాన్‌ విషయంలో ఇదే జరిగింది. చిన్న వయసులోనే తనకు పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. ‘నేను చదువుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకొని తండ్రి ఆగ్రహానికి గురైంది. బిడ్డ మనసును అర్థం చేసుకున్న ఆ తండ్రి ‘సరే నీ ఇష్టం’ అనక తప్పలేదు. ఆరోజు భయపడి బాల్యవివాహానికి సిద్ధమై ఉంటే రేణు పాసవాన్‌ స్పీకర్, లైఫ్‌కోచ్, రైటర్, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేది కాదు. తాజాగా ఫాక్స్‌ స్టోరి ఇండియా ‘ఇండియాస్‌ 50 ఇన్‌స్పైరింగ్‌ వుమెన్‌ –2022’ జాబితాకు ఎంపికైంది రేణు...

బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌ జిల్లాలోని మిథాన్‌పుర అనే చిన్న గ్రామంలో పుట్టింది రేణు. ఆ ప్రాంతంలో బాల్యవివాహాలు సహజం. తనకు కూడా పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తే ఇంటి నుంచి పారిపోయింది. ఎక్కడో ఉన్న రేణును ఇంటికి తీసుకువచ్చిన తండ్రి ‘పెళ్లి అంటూ నిన్ను బాధ పెట్టను’ అన్నాడు. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది రేణు. బయెటెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది. పుణెలో ఎంబీఏ చేసింది.

బెంగళూరులో బయోటెక్నాలజీ చదువుకునే రోజుల్లో హస్టల్లో అమ్మాయిలు రేణుకు దూరంగా ఉండేవారు. నిరక్ష్యం చేసేవారు. దీనికి కారణం తాను బిహారి కావడం! ఇక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు బిహారీల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు అమానుషంగా ఉండేది. ఇవన్నీ చూసిన తరువాత తనకు బాధగా అనిపించేది.

‘ఇన్పోసిస్‌’లో కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసింది  రేణు. తాను నడిచొచ్చిన దారిపై ఒకసారి పుణె క్యాంపస్‌లో ప్రసంగించింది. ఇది ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘మీ జీవితానుభవాలకు ఎందుకు అక్షర రూపం ఇవ్వకూడదు! చాలా మందికి స్ఫూర్తి ఇస్తాయి’ అని చెప్పడంతో ‘లివ్‌ టూ ఇన్‌స్పైర్‌’ పేరుతో తొలి పుస్తకం రాసింది రేణు. బిహార్‌లోని మారుమూల గ్రామం నుంచి బెంగళూరులో ఉద్యోగం వరకు తన ప్రయాణానికి అక్షరరూపం ఇచ్చింది. ఈ పుస్తకం బాగా పాపులర్‌ అయింది.

 ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముడుతుండగా ‘నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది’ అనుకుంది రేణు. ‘లివ్‌ టూ ఇన్‌స్పైర్‌’ అనే సంస్థను స్థాపించి గ్రామాలలోని మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడానికి అవసరమైన సహకారం అందిస్తోంది. కళాకృతుల తయారీలో మహిళలకు  శిక్షణ ఇప్పిస్తోంది.

దీంతో పాటు మహిళల హక్కుల కోసం పనిచేయడం మొదలుపెట్టింది. అలా ‘జి–100’ గ్రూప్‌లో చేరింది. బిహార్‌ నుంచి ఈ గ్రూప్‌లో చేరిన తొలి మహిళ రేణు. జి–100 అనేది ప్రపంచ వ్యాప్తంగా మహిళల హక్కుల కోసం గొంతు విప్పుతున్న  మహిళా ఉద్యమకారుల పోరాట వేదిక. జి–100 గ్రూప్‌ ఛైర్మన్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రేణు పాసవాన్‌ లివ్‌ టూ ఇన్‌స్పైర్‌ తరువాత ది న్యూ, సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌ అనే రెండు పుస్తకాలు రాసింది. ఇవి తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాయి.

ఐక్యరాజ్యసమితి ‘జెండర్‌ ఈక్వాలిటీ’కి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే రేణు ‘షి ది చేంజ్‌’ టైటిల్‌కు ఎంపికైంది. ‘ఆ ఇంట్లో వ్యక్తులు కాదు సమస్యలు ఉంటాయి’ అని ఊరివాళ్లు అనుకునేవారు. ఎందుకంటే రేణు సోదరులు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవాళ్లు. తల్లికి మానసిక సమస్యలు. వంట వండడం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్నీ తన బాధ్యతలే అయ్యేవి.

ఇలాంటి ఇంట్లో నుంచి వచ్చిన రేణు పాసవాన్‌ మోటివేషనల్‌ స్పీకర్‌గా, స్త్రీ హక్కుల ఉద్యమకార్యకర్తగా ప్రపంచవ్యాప్తగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం పైకి ఎదిగినా పరాయికరణకు లోను కాకపోవడం. తన మూలాలు ఏమిటో మరవకపోవడం.                        

మరిన్ని వార్తలు