Earth Day: ‘రీస్టోర్‌ అవర్‌ ఎర్త్‌’ ప్రాముఖ్యత ఏంటో తెలుసా​?

22 Apr, 2021 12:54 IST|Sakshi

కరోనా విపత్కర పరిస్థితుల్లో నేడు ‘రీస్టోర్‌ అవర్‌ ఎర్త్‌’ థీమ్‌తో ధరిత్రి దినోత్సవం  

సాక్షి, హైదరాబాద్‌: భూగోళం ఇప్పుడు అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటోంది. కోవిడ్‌ మహమ్మారి రూపంలో విసిరిన పంజాకు యావత్‌ ప్రపంచం ప్రభావితమైంది. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, అడవులపై యథేచ్ఛగా జరుగుతున్న కాలుష్యం, ఇతరత్రా రూపాల్లోని దాడులతో ప్రకృతిలో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో పాటు వేగంగా అడవులు క్షీణతకు గురికావడం ఆందోళనకు కారణమవుతోంది.  

ప్రతీ ఏడాది ఏప్రిల్‌ 22న ప్రపంచవ్యాప్తంగా ‘ధరిత్రి దినోత్సవం’(ఎర్త్‌డే) నిర్వహిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రకృతిపరంగా సహజమైన ప్రక్రియలు, హరిత సాంకేతికతల ఆవిష్కరణలు, ప్రపంచ పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ/పునఃప్రతిష్టకు వినూత్న ఆలోచనలు చేపట్టే దిశగా ఈ సంవత్సరం ‘రీస్టోర్‌ అవర్‌ ఎర్త్‌’ముఖ్యాంశంగా (థీమ్‌గా) ఐరాస నిర్ణయించింది. 1970 ఏప్రిల్‌ 22న అమెరికన్‌ సెనేటర్‌ గేలార్డ్‌ నెల్సన్‌ దీనిని ప్రారంభించారు. ఎర్త్‌ డే నెట్‌వర్క్‌ (ఈడీఎన్‌)సంస్థ ద్వారా దీనిని నిర్వహిస్తున్నారు. 

గురువారం ఎర్త్‌డేను పురస్కరించుకుని తెలంగాణలోని ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ) వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమ కళాశాల విద్యార్థులకు ‘బర్డ్‌ ఫీడర్‌’అనే ఛాలెంజ్‌ను విసిరింది. ఎఫ్‌సీఆర్‌ఐ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనిధితో, ఈ ఏడాది ‘రీస్టోర్‌ అవర్‌ ఎర్త్‌’అంశానికి సంబంధించి రాష్ట్రంలో ఏయే చర్యలను చేపడితే పర్యావరణహితంగా, ప్రకృతికి మేలు చేసే విధంగా ఉంటుందనే దానిపై బయో డైవర్సిటీ ఎక్స్‌పర్ట్‌ గైని సాయిలుతో ‘సాక్షి’సంభాషించింది.  

విద్యార్థులకు ‘బర్డ్‌ ఫీడర్‌’ చాలెంజ్‌... 
‘ఈ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మా కాలేజీ విద్యార్థులతో ‘బర్డ్‌ ఫీడర్‌’అనే చాలెంజ్‌ నిర్వహిస్తున్నాం. ఇంట్లో వృథాగా ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లు, పాత ప్లాస్టిక్, అన్‌బ్రేకబుల్‌ బౌల్స్‌ వంటి వస్తువులను ఉపయోగించి పక్షులకు ఆహారం, నీళ్లు ఏర్పాటు చేసేలా ఫీడర్లు తయారు చేయాలన్నదే ఈ చాలెంజ్‌. విద్యార్థులు తాము తయారుచేసిన వస్తువులను ‘బర్డ్‌ ఫీడర్‌’పోస్టర్‌తో మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఫోటో సెల్ఫీలను పోస్ట్‌ చేసి ఐదుగురు చొప్పున కుటుంబసభ్యులు, మిత్రులకు చాలెంజ్‌ విసరాల్సి ఉంటుంది. దానికి ప్రతిగా చాలెంజ్‌ స్వీకరించినవారు ఇతరులను సవాల్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ వేసవి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నందున పక్షుల ఆకలి, దాహం తీర్చడం ద్వారా వాటిని కాపాడేలా ఈ ఫీడర్లు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీనికి రూపకల్పన చేశారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉన్నా ఈ చాలెంజ్‌తో పాటు ఈ ఏడాది నిర్దేశించిన ‘రీస్టోర్‌ అవర్‌ ఎర్త్‌’థీమ్‌పై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, కవితల పోటీలకు మంచి స్పందన లభించింది. స్టూడెంట్స్‌తో పాటు టీచింగ్‌ ఫ్యాకల్టీ కూడా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. 
– ఎన్‌ఎస్‌ శ్రీనిధి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఎఫ్‌సీఆర్‌ఐ 

స్వాభావిక వృక్ష జాతులను కాపాడుకోవాలి... 
మన జీవనోపాధి, స్థితిగతులు, ప్రకృతికి దగ్గరగా ఉన్న స్వాభావికమైన స్థానిక చెట్లను పెంచేందుకు ఇప్పుడు ప్రత్యేక కృషి అవసరం. ఇందుకు అనుగుణంగా ప్రకృతి, పర్యావరణంతో మమేకమైన వృక్ష జాతులను సంరక్షించుకోవాల్సిన అవసరముంది. దీనిలో భాగంగా అవసరమైన విత్తనాలను అడవుల నుంచి సేకరించి నర్సరీల్లో పెంచాలి. అడవుల్లో ఆయా రకాల చెట్లకు సంబంధించిన విత్తనాల సేకరణకు అనువైన కాలమిది. హరితహారంలో భాగంగా ఎవరి పరిధిలో వారు అటవీశాఖ, పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా పనికి ఆహార పథకంలో డీఆర్‌డీఏ వీటి సేకరణ చేపట్టేలా, నాటేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని ఆయా జిల్లాల వారీగా అరుదైన, అంతరించి పోయే ప్రమాదమున్న మొక్కలు, వృక్షాల వివరాలున్నందున ఈ కార్యక్రమంలో వాటిపై అధిక దృష్టి పెట్టాలి.

‘రీస్టోర్‌ అవర్‌ ఎర్త్‌’లో భాగంగా మన నేటివ్‌ ప్లాంట్స్, ఇండీజీనియస్‌ స్పీషీస్‌ను కాపాడుకోవాలి. వీటి ద్వారా గతంలోని మన స్థానిక స్థితిగతులు, జీవనోపాధి పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. వివిధ అవసరాలకు ఉపయోగించే ప్లాస్టిక్‌ వస్తువులకు బదులు ప్రకృతి సిద్ధంగా, సంప్రదాయ వస్తువులతో తయారయ్యే వాటిని వాడేలా ప్రజలను చైతన్యపరచాలి. పర్యా వరణహితమైన వస్తువులను ప్రోత్సహించి, కాలుష్యాన్ని తగ్గించే దిశలో ప్రకృతి దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవడం ద్వారా ధరిత్రిని పునరుద్ధరించవచ్చు.’ 
– గైని సాయిలు, బయో డైవర్సిటీ నిపుణులు, ఫారెస్ట్‌ 2.0 రీజినల్‌ డైరెక్టర్‌  
 

మరిన్ని వార్తలు