పన్నుల శాఖలో సాహిత్యం

5 Nov, 2022 18:03 IST|Sakshi

కమర్షియల్‌ టాక్స్‌ అనగానే.. ముందుగా గుర్తొచ్చేది లెక్కల చిక్కులు, పన్నుల కోసం సోదాలు, సీరియస్‌గా పని చేసుకునే వ్యక్తులు. వీటికి భిన్నంగా సాహిత్యంతో ముందుకొచ్చారు వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌ హర్షవర్ధన్‌ . ఆయన రచించిన "వాణిజ్య ఫన్నులు" పుస్తకాన్ని హైదరాబాద్‌ రెడ్‌ హిల్స్‌లోని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ భవనంలో ఆవిష్కరించారు. 

మేమూ రచయితలమే
వాణిజ్య పన్నుల శాఖ గురించి ఇలాంటి పుస్తకం రావడం బహుశా ఇదే మొదటిదని, పన్నుల వసూలే కాదు, అక్షర సేద్యంలోని తమ అధికారులు ఉండడం సంతోషకరమని సభాధ్యక్షులు రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌ పి.వి.సుబ్బారావు అన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అడిషనల్‌ కమిషనర్‌ సాయికిషోర్‌ తొలి ప్రతిని తెలంగాణ సేల్స్‌ టాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ అధ్యక్షుడు నగేష్‌ రంగికి అందించారు. 

పన్నులు కాదు హాస్యం
"వాణిజ్య ఫన్నులు" పుస్తకాన్ని పరిచయం చేసిన ఉస్మానియా తెలుగు విశ్వవిద్యాలయ తెలుగు విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రఘు.. వ్యంగ, హాస్యాలతో పాటు వారి ఉద్యోగానుభవాలను అందమైన శైలిలో, ఆకట్టుకునే రీతిలో రాశారని ప్రశంసించారు. "వాణిజ్య ఫన్నులు" అనగానే ఇదేదో కమర్షియల్‌ టాక్స్‌ వాళ్లు మాత్రమే చదవాలని అనుకోవద్దని, నిజానికి ఇది సగటు పాఠకులందరూ చదువదగిందని, అందరూ ఎంజాయ్‌ చేసేలా వేర్వేరు అంశాలను, జీవిత పాఠాలను, అనుభవాలను చేకూర్చారన్నారు. సమావేశంలో పలువురు రిటైర్డ్‌ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కమర్షియల్‌ టాక్స్‌కు సంబంధించిన అధికారులు చాలా మంది పాల్గొనడంతో... అదొక విశిష్ట వేదికగా మారింది. వయస్సును లెక్క చేయకుండా.. కార్యక్రమానికి 93 ఏళ్ల వయో వృద్ధులు రిటైర్డ్‌ డిప్యూటీ కమిషనర్‌ పతివాడ సూర్యనారాయణ రావడం అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసింది.

మరిన్ని వార్తలు