'జింబో' కథలు

4 Dec, 2020 08:46 IST|Sakshi
రిటైర్డ్‌ జడ్జ్‌ మంగారి రాజేందర్‌ జింబో

కరోనా సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు రిటైర్డ్‌ జడ్జి మంగారి రాజేందర్‌ జింబో. వెంటనే ఒక యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించారు. ఆగస్టు చివరి వారం నుంచి మొదలుపెట్టి రోజుకో కథను పోస్తూ చేస్తూ నేటితో 100 కథలను పూర్తి చేశారు. న్యాయరంగంలో తాను చూసిన అనుభవాలే ఈ కథలు. కోర్టులు, పోలీసులు సామాన్యులకు అన్నిసార్లు న్యాయం చేయడం లేదని, ఈ వ్యవస్థలు సవ్యంగా నడవాల్సిన అవసరం ఉందని ఈ కథలు చెబుతున్నాయి. ‘మనుషులందరిలో ఒకే రక్తం ఉంటుంది. అలాగే పోలీసులందరిలోనూ ఒకే రక్తం ఉంటుంది’ అని ఆయన రాస్తారు. రిటైర్డ్‌ జడ్జి మంగారి రాజేందర్‌ తన కలం పేరు ‘జింబో’ ద్వారా ప్రసిద్ధులు. ఆయన రాసిన కథలు ఐదు సంకలనాలుగా వెలువడ్డాయి. ‘రూల్‌ ఆఫ్‌ లా’, ‘జింబో కథలు’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్నమాట’, ‘వేములవాడ కథలు’ అనే పేర్లతో విడుదలైన ఆ సంకలనాలు పాఠకాదరణ పొందాయి.

సుప్రసిద్ధ న్యాయమూర్తులు వాటికి ముందుమాటలు రాశారు. న్యాయరంగం లో ఉన్నవారు గతంలో చాలామంది రచయితలుగా రాణించినా వాటి లోతుపాతులను తెర తీసి చూపినవారు తక్కువ. జింబో ఆ పని ధైర్యంగా, ధర్మాగ్రహంతో చేశారు. తీర్పరి స్థానంలో కూచున్నా నియమ నిబంధనలు, సాక్ష్యాలు ఆధారాలు, విధి విధానాలు.. ఇవన్నీ ఒక్కోసారి కళ్లెదుట సత్యం కనపడుతున్నా న్యాయం చేయలేని పరిస్థితిని కల్పిస్తాయి. ఆ ప్రతిబంధకాలు రచయితకు ఉండవు. అందుకే తన కథల ద్వారా సరిౖయెన న్యాయం ఎలా జరిగి ఉండాల్సిందో జింబో చూపిస్తారు.‘యజమాని తాను అద్దెకు ఇచ్చిన వ్యక్తి నుంచి ఇల్లు ఖాళీ చేయించాలంటే ఆ కేసు గట్టిగా ప్రయత్నించినా పదేళ్ల లోపు తేలే పరిస్థితి మన దగ్గర లేదు. రూల్‌ ఆఫ్‌ లా పాటించాలని అందరం అనుకుంటాం. కాని రూల్‌ ఆఫ్‌ లా ప్రకారం పోగలుగుతున్నామా’ అంటారు జింబో. మన చట్టాలు, న్యాయశాస్త్రాలు సగటు మనిషి అవగాహనకు దూర విషయాలు. వాటిని చదివి అర్థం చేసుకోవడం కష్టం. అందుకే సామాన్యులకు అర్థమయ్యేలా జింబో కథల రూపంలో వాటి పట్ల చైతన్యం కలిగిస్తారు. వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని లబ్ధిపొందేవారు ఉన్నా వ్యవస్థ చేసిన ఏర్పాట్లను సమర్థంగా ఉపయోగించుకుని న్యాయం పొందినవారినీ చూపిస్తారు.జింబో తన యూట్యూబ్‌ చానల్‌లో 6 నిమిషాల నిడివి నుంచి 20 నిమిషాల నిడివి వరకూ పోస్ట్‌ చేశారు. వీటిని సామాన్యులతో పాటు న్యాయవాదులు, జడ్జిలు, విద్యార్థులు కూడా వింటూ ఉండటం విశేషం. 

కరీంనగర్‌– వేములవాడకు చెందిన జింబో జిల్లా జడ్జి స్థాయిలో పని చేశారు. నాటి ఆంధ్రప్రదేశ్‌ జుడీషియల్‌ అకాడెమీకి డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
‘మొదట ఎవరితోనైనా ఈ కథలు చదివిద్దామనుకున్నాను. కాని రచయితగా నేనే ప్రేక్షకులకు కనిపిస్తే బాగుంటుందని ల్యాప్‌టాప్‌ ముందు కూచుని రికార్డ్‌ చేయడం మొదలెట్టాను. మా అబ్బాయి ఎడిటింగ్‌ యాప్‌ సూచిస్తే ఎడిటింగ్‌ కూడా నేనే చేసి వీడియో పోస్ట్‌ చేస్తున్నాను. నా ప్రయత్నానికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది’ అన్నారు జింబో.కోర్టులు, చట్టాల వర్తమాన పనితీరు తెలుసుకోవాలంటే ఈ కథలు తప్పక వినండి. యూట్యూబ్‌లో మంగరి రాజేందర్‌ జింబో అని టైప్‌ చేసి ఆ కథలు వినొచ్చు. 

మరిన్ని వార్తలు