Ashok Shrivastav: తగినవారు.. టిట్‌ ఫర్‌ ట్వీట్‌

16 May, 2021 05:28 IST|Sakshi
స్వరా భాస్కర్‌, అశోక్‌ శ్రీవాత్సవ్‌, రిచా చద్దా, సన్నీ లియోన్‌

‘ఫైండ్‌ ఎ బెడ్‌’ అనే యూఎన్‌ కోవిడ్‌ సహాయ కార్యక్రమానికి ఇండియా నుంచి బాలీవుడ్‌ నటీమణులు రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్‌ అంబాసిడర్‌లుగా ఉన్నారు. అయితే.. అందుకు వారు తగినవారు కాదు అని దూరదర్శన్‌ టీవీ జర్నలిస్ట్‌ అశోక్‌ శ్రీవాత్సవ్‌ ట్వీట్‌ చేయడం వివాదం అయింది. ‘తగని’ ఆ ముగ్గురూ శ్రీవాత్సవ్‌ కు తగిన సమాధానమే ఇవ్వబోతున్నారు. రిచా అయితే ఇప్పటికే టిట్‌ ఫర్‌ ట్వీట్‌ ఇచ్చేశారు.

రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్‌.. ఈ ముగ్గురూ.. ‘బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ అని ఒక ఇమేజ్‌ ఉంది. కేవలం వాళ్లు నటించిన సినిమాల వల్ల మాత్రమే వచ్చిన ఇమేజ్‌ కాదు అది. విలక్షణమైన వాళ్ల వ్యక్తిత్వం కూడా ఆ ఇమేజ్‌కి కొంత కారణం. 34 ఏళ్ల రిచా సామాజిక కార్యకర్త. విద్యార్థి ఉద్యమాలకు మద్దతు ఇస్తుంటారు. అందువల్ల తనకు సినిమా ఛాన్స్‌లు పోతాయనేం భయపడరు. ఇక నాలుగు పదుల సన్నీ లియోన్‌. ఒకప్పుడు ఆమె పోర్న్‌ స్టార్‌. తర్వాత హాలీవుడ్‌కి, అక్కణ్ణుంచి బాలీవుడ్‌కి వచ్చారు.

రాజకీయ స్పృహ, చైతన్యం రెండూ ఎక్కువే. మూగజీవుల సంరక్షణ సంస్థ ‘పెటా’కు బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా పని చేశారు. 33 ఏళ్ళ స్వరా భాస్కర్‌ డేర్‌ అండ్‌ డెవిలిష్‌! ప్రజావ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై జరిగే ప్రదర్శనలకు తన గళాన్ని ఇస్తుంటారు. సినిమాల్లో, ఓటీటీల్లో ఆమె వేసే పాత్రలు కూడా ఆమెకు దీటైనవే. అంటే దాపరికాలు ఉండనివి. ఈ ముగ్గురూ ప్రస్తుతం ‘ఫైండ్‌ ఎ బెడ్‌’ అనే ప్రచారోద్యమానికి మద్దతిస్తున్నారు. అయితే.. ‘ఫైండ్‌ ఎ బెడ్‌కు వీరు తగని వ్యక్తులు’ అని అశోక్‌ శ్రీవాత్సవ్‌ అనే జర్నలిస్టు విమర్శించడంతో రిచా, సన్నీ, స్వరా స్పందించవలసి వచ్చింది.

బాధ్యత గల ఉద్యోగంలో ఉండి మహిళల్ని కించపరిచేలా రిచా, సన్నీ, స్వరాలను అంత మాట అన్న శ్రీవాత్సవ్‌ గురించి తర్వాత తెలుసుకోవచ్చు. ముందైతే ‘ఫైండ్‌ ఎ బెడ్‌’ ఏమిటో చూద్దాం. ఇదొక యూత్‌ ప్రోగ్రామ్‌. కోవిడ్‌ ఉద్ధృతితో ఆసుపత్రులలో బెడ్‌లు దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో ముంబైలోని ‘ఇండియాస్‌ ఇంటర్నేషనల్‌ మూమెంట్‌ టు యునైటెడ్‌ నేషన్స్‌’ (ఐఐఎంయుఎన్‌) అనే సంస్థ తాజాగా ‘ఫైండ్‌ ఎ బెడ్‌’ అనే కార్యాచరణను భుజానికెత్తుకుంది. దేశంలోని 160 నగరాలను కలుపుతూ 26 వేల మంది విద్యార్థులతో ఒక వ్యవస్థను నిర్మించి, వారి ద్వారా అవసరమైన వారికి కోవిడ్‌ ఆసుపత్రులలో బెడ్‌లను సమకూర్చేందుకు చక్కటి ప్రణాళికను సిద్ధం చేసింది. ఏయే ఆసుపత్రులలో ఎన్ని బెడ్‌లు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని ఈ యువ సైన్యం ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన వారికి ఆ ప్రాంతంలో బెడ్‌ దొరికేలా ‘ఫైండ్‌ ఎ బెడ్‌’ ఏర్పాట్లు చేస్తుంది.

యువతరంలో బాలీవుడ్‌ నటీనటులకు, అందులోనూ సామాజిక కార్యక్రమాల్లో కాస్త చురుగ్గా ఉండేవాళ్లకు క్రేజ్‌ ఉంటుంది కాబట్టి ఐ.ఐ.ఎం.యు.ఎన్‌. రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్‌లను తమ ప్రచారోద్యమ గౌరవ సార థులుగా నియమించుకుంది. అది చూసే మన శ్రీవాత్సవ్‌ భ్రుకుటి ముడివేసి, ‘తగని వ్యక్తులు’ అని వీళ్ల మీద ఒక ట్వీట్‌ ముద్ర వేశారు.
∙∙
అశోక్‌ శ్రీవాత్సవ్‌ దూరదర్శన్‌లో సీనియర్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌. అంతటి మనిషి ఇప్పుడిలా ఈ ముగ్గురిపై నోరు పారేసుకుని డీడీ ప్రతిష్టకే భంగం కలిగేలా చేశారని విమర్శలు వస్తున్నాయి. ‘ఫౌండ్‌ ఎ బెడ్‌’కు తమని తగని వ్యక్తులుగా పేర్కొంటూ ఆ ముగ్గురి ఫొటోలు పెట్టి ట్విట్టర్‌లో కామెంట్‌ను పోస్ట్‌ చేసిన శ్రీవాత్సవ్‌కు ఏ మాత్రం కనికరం లభించే అవకాశం కనిపించడం లేదు. గతంలో ఇలాంటివే కొన్ని అనవసర వ్యాఖ్యల్ని చేసిన చరిత్ర అతడికి ఉంది. ఇప్పుడిక భవిష్యత్తునూ లేకుండా చేసుకునేలా ఉన్నారు.

‘‘అతడి ట్వీట్‌ను చూసి షాక్‌ తిన్నాను. దూరదర్శన్‌ ఇలాంటి స్త్రీ ద్వేషినీ, దుష్ట మానవుడినా ఉద్యోగంలోకి తీసుకుంది!’’ అని రిచా ట్వీట్‌ చేశారు. ఆపత్సమయాలలో ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తారు. ఇతడు సహాయం చేయకపోగా, ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు’’ అని అన్నారు. వెంటనే నటి పన్ను తాప్సీ.. రిచాకు మద్దతుగా స్పందించారు. ‘‘అతడు నా గురించి కూడా గతంలా ఇలాగే కామెంట్‌ చేశాడు. ముఖ్యమైన ట్వీట్‌లకు సమాధానం ఇవ్వవలసిన తొందరలో ఉండి అతడిని వదిలేశాను. తన అధికారాన్ని ఆ వ్యక్తి ఇలా వాడుకుంటున్నాడు’’ అని తాప్సీ అన్నారు. ‘‘ఇలాంటి వాళ్లను ఊరికే వదలిపెట్టకూడదు’’ అని తాప్సీ ట్వీట్‌కి రిచా రిప్లయ్‌ ఇచ్చారు. ముగ్గురిలో మిగతా ఇద్దరు.. సన్నీ లియోన్, స్వరా భాస్కర్‌ వెంటనే ఏమీ స్పందించలేదు. శ్రీవాత్సవ్‌పై వారు దూరదర్శన్‌కు ఫిర్యాదు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. రిచా అయితే నేటికీ ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నారు!

‘‘ఇలాంటి ఒక వ్యక్తి జాతీయ మీడియాలో ఎలా పని చేస్తున్నట్లు!! అతడి ఇంట్లోని, ఆఫీసులోని మహిళల మీద జాలి కలుగుతోంది’’ అని అంటున్నారు.

మరిన్ని వార్తలు