Rihanna: ఫోర్బ్స్‌ సంపన్న గాయని

14 Aug, 2021 02:56 IST|Sakshi
రిహాన్నా

ప్రతిభ ఉండాలేగానీ ఏ రంగంలోనైనా ఎదగవచ్చు అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పాప్‌ సింగర్‌ రిహాన్నా. అమెరికన్‌ పాప్‌ సింగర్‌గా ప్రపంచానికి తెలిసిన రిహాన్నా ‘బ్యూటీ ప్రోడక్ట్స్‌’ వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తూ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఓ నివేదికలో ఫోర్బ్స్‌ ‘రిచెస్ట్‌ లేడీ మ్యూజీషియన్‌’గా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఎప్పడూ హాట్‌ హాట్‌ డ్రెస్సులతో హాట్‌ ఐకాన్‌గా నిలిచే రిహాన్నా తన ప్రతిభతో సింగర్‌గానేగాక, మంచి వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ ఏకంగా ప్రపంచంలోనే ‘అత్యంత సంపన్న సంగీత విద్వాంసురాలిగా’ నిలిచింది. కేవలంసం గీతంతోనే ఆమెకు వందల కోట్ల ఆదాయం రాలేదు. ఆమె ఎంత చక్కగా పాడగలదో అంతే సమర్థవంతంగా వ్యాపారం చేస్తూ.. రిచెస్ట్‌ మ్యూజీషియన్‌గా నిలిచింది

సంగీత ప్రపంచంలో బాగా పాపులర్‌ అయిన రాబిన్‌ రిహాన్నా ఫెంటీ 1988లో బార్బడాస్‌లోని మోనికా ఫేంటీ, రోనాల్డ్‌ దంపతులకు  మూడో సంతానంగా పుట్టింది. ఆమెకు పద్నాలుగేళ్లున్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే రిహన్నా అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ పుట్టుకతో వచ్చిన మధురమైన గొంతుతో ఈ స్థాయికి ఎదిగింది. రిహాన్నా స్కూల్లో చదివేటప్పుడు తన స్నేహితులతో కలిసి సరదాగా పాటలు పాడేది. 2003లో క్రిస్టమస్‌ వెకేషన్‌లో భాగంగా ప్రముఖ మ్యూజిక్‌ నిర్మాత ఇవాన్‌ రోజర్స్‌ కుటుంబంతో బార్బడోస్‌ సందర్శించారు. ఆ సమయంలో రిహాన్నా గొంతు విన్న ఆయన ఆమెతో కలిసి కొన్ని పాటలు రికార్డు చేద్దామని న్యూయార్క్‌ ఆహ్వానించాడు.

అప్పుడు న్యూయార్క్‌ వెళ్లి రోజర్స్‌తో కలిసి డజన్ల సంఖ్యలో పాటలను కంపోజ్‌ చేసింది. తరువాత తన పాటలను ఎవరు కొనుగోలు చేస్తారా అని ఎదురుచూస్తున్న సమయంలో ఈ రిహాన్నా పాటలు, పనితీరు నచ్చడంతో బాగా పేరొందిన జేజడ్‌ రికార్డింగ్స్‌ కంపెనీవారు ..  ‘పొన్‌డి రిప్లే’ పేరిట డెబ్యూ ఆల్బమ్‌ను 2005లో విడుదల చేశారు. అది బాగా హిట్‌ అవడంతో.. మరిన్ని పాటలను పాడి ఆల్బమ్స్‌ రూపంలో విడుదల చేసింది. ఈ క్రమంలో రిçహాన్నా పాడిన 50 మిలియన్ల ఆల్బమ్స్, 190 మిలియన్ల సింగిల్‌ ఆల్బమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది. రిహాన్నా పాటలు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్‌ సెల్లింగ్‌ సింగిల్స్‌గా నిలిచాయి. వీటిలో ‘అంబ్రెల్లా’, ‘టేక్‌ ఏ బౌ’, ‘డిస్టర్బియా’, ‘లవ్‌ ద వే యూ లై’ లు చాలా పాపులర్‌ అయ్యాయి.

డిజిటెక్‌ సాంగ్స్‌ ఆర్టిస్ట్‌
రిహాన్నా పాటలకు ఆడియెన్స్‌ ఆదరణతోపాటు అనేక అవార్డులు వరించాయి. వీటిలో గ్రామీ, అమెరికన్‌ మ్యూజిక్, బిల్‌బోర్డ్‌ మ్యూజిక్, బీఆర్‌ఐటీ వంటి అవార్డులను పదుల సంఖ్యలో అందుకుంది. బిల్‌బోర్డ్‌ రిహాన్నాకు 2000 దశాబ్దపు ‘డిజిటెక్‌ సాంగ్స్‌ ఆర్టిస్ట్‌’ అనే బిరుదును ప్రదానం చేసింది. 

ఫెంటీ బ్యూటీ...
ప్రముఖ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న రాబిన్‌ రిహాన్నా ఫెంటీ 2017లో ‘ఫెంటీæ బ్యూటీ’ పేరిట కంపెనీని ప్రారంభించింది. మహిళలు ఎక్కడకు వెళ్లినా వాడుకోగల బ్యూటీ ఉత్పత్తులను విక్రయించడంతో ఈ కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు 1.7 బిలియన్‌ డాలర్లుగా ఉండడంతో, ఫోర్బ్స్‌ జాబితాలో ఓప్రా విన్‌ఫ్రే తరువాత రిహాన్నా రెండో స్థానంలో నిలిచింది. ఫెంటీ బ్యూటీలో ఆమెకు యాభై శాతం వాటా ఉంది. అదే 1.4 బిలియన్‌ డాలర్లకు సమానం అని ఫోర్బ్స్‌ అంచనా. మిగతా విలువంతా ‘సావెజ్‌ ఎక్స్‌ ఫెంటీ’ అనే లోదుస్తుల బ్రాండ్‌ వల్ల వస్తోంది. సావెజ్‌ కంపెనీ మార్కెట్‌ అంచనా విలువ 270 మిలియన్‌ డాలర్లుగా ఉంది. వివిధ రకాల బ్యూటీ ఉత్పత్తులు, లోదుస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ స్టోర్లల్లో విక్రయిస్తూ సక్సెస్‌పుల్‌ బ్యూటీ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 101 మిలియన్‌ ఫాలోవర్స్, ట్విటర్‌లో 102.5 మిలియన్‌ ఫాలోవర్స్‌తో దూసుకుపోతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.  

మరిన్ని వార్తలు