Rishi Sunak: అక్కడ మొదలైన రిషి- అక్షత ప్రేమకథ.. మామగారి గురించి బ్రిటన్‌ ప్రధాని ఏమన్నారంటే!

26 Oct, 2022 09:41 IST|Sakshi

Rishi Sunak- Akshata Murthy Interesting Facts: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు అక్షతామూర్తి భార్య మాత్రమే కాదు. తన మనోప్రపంచం తెలిసిన క్లోజ్‌ఫ్రెండ్, గైడ్‌. సునాక్‌ ఒత్తిడిని మటుమాయం చేసే మాటల మాంత్రికురాలు. ఐటీ మొదలు ఫ్యాషన్‌ ప్రపంచం వరకు ఎన్నో రంగాలలో తనను తాను నిరూపించుకున్న ప్రతిభావంతురాలు. కుటుంబ జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని తేలికగా ఎలా సమన్వయం చేసుకోవాలో తన చేతల ద్వారా చూపించిన తెలివైన మహిళ.... 

తన మామగారు నారాయణమూర్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రిషి సునాక్‌ కళ్లలో ఒక మెరుపు కనిపిస్తుంది. మూర్తిపై అభిమానం ఆయన మాటల్లో వ్యక్తం అవుతుంది. అది ఒక మామ గురించి అల్లుడి అభిమానం కాదు. గొప్ప వ్యాపారవేత్త  గురించి ఒక ఆలోచనపరుడి అభిమానం.

మామగారి గురించి..
‘ఆయన సంపన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. అయితే అదేమీ తన ప్రతికూలత కాలేదు. ఎందుకంటే ఆయనకు ఆశయాలు ఉన్నాయి. తన మీద తనకు నమ్మకం ఉంది. డబ్బులు లేని పరిస్థితులలో నారాయణమూర్తికి సుధామూర్తి తాను దాచుకున్న డబ్బులు ఇచ్చారు. ఇక అప్పటినుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుధామూర్తి  ఇచ్చింది డబ్బులు మాత్రమే కాదు అంతులేని ఆత్మస్థైర్యం’ అని ఒకానొక సందర్భంలో తన మామగారు నారాయణమూర్తి గురించి చెప్పారు సునాక్‌.

ఒక స్త్రీ పురుషుడిని ఎలా ముందుకు నడిపించగలదు, విజేతగా నిలపగలదో సునాక్‌ తన మాటలతో చెప్పకనే చెప్పారు. మరి తన విషయంలో భార్య అక్షతామూర్తి పాత్ర ఏమిటి?

సునాక్‌ మాటల్లో చెప్పాలంటే...
‘కుటుంబానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నాను అనే బాధను ఆమె తీరుస్తుంది. అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉంటుంది. సమయస్ఫూర్తి ఎక్కువగా ఉన్న మహిళ’ అంటాడు సునాక్‌.

ఎవరీ అక్షతామూర్తి?
కర్ణాటకలోని హుబ్లీలో జన్మించిన అక్షతామూర్తి బెంగళూరు శివారులోని జయనగర్‌లో ఎలాంటి ఆడంబరాలు, అట్టహాసాలు లేకుండా మధ్యతరగతి జీవిత విలువలతో పెరిగింది. ఖరీదైన బర్త్‌డే పార్టీలు ఉండేవి కాదు. పరిమితమైన పాకెట్‌మనీ మాత్రమే ఉండేది.

అలా అని అక్షతా ఎప్పుడూ తల్లిదండ్రుల మీద అలక పూనలేదు. దీనికి కారణం వారు తనకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు, నిరాడంబర జీవన విధానం గురించి చెబుతూ వచ్చారు.

పరిచయం... ప్రేమగా మారి
బెంగళూరులోని బాల్డ్‌విన్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో చదువుకుంది అక్షతామూర్తి. స్కూల్లో ఎప్పుడూ ఆడంబరం ప్రదర్శించేది కాదు. కాలిఫోర్నియాలో ఎకనామిక్స్, ఫ్రెంచ్‌ చదువుకున్న అక్షత లాస్‌ ఏంజెల్స్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీఎ చేసింది.

ఆ సమయంలోనే సునాక్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. 2009లో వీరి వివాహం బెంగళూరులో జరిగింది. సునాక్‌–అక్షతామూర్తి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు... కృష్ణ, అనౌష్క.

తనదైన ముద్ర
క్లీన్‌టెక్‌ సంస్థ ‘టెండ్రీస్‌’లో మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా చేరిన అక్షతామూర్తి రెండు సంవత్సరాల తరువాత ‘అక్షత డిజైన్స్‌’ పేరుతో  సొంతంగా ఫ్యాషన్‌ కంపెనీ ప్రారంభించింది. ఆ తరువాత భర్తతో కలిసి మొదలుపెట్టిన ఒక వెంచర్‌ క్యాపిటల్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించింది. 
ఐటీ బిజినెస్‌ నుంచి బ్యూటీ డిజైన్స్‌ వరకు ప్రతి వ్యాపారంలో తనదైన ముద్ర వేసింది అక్షతామూర్తి.

తల్లిదండ్రుల వల్లే
‘అక్షతామూర్తి ఒక ఇంట్లో పెరిగింది అనడం కంటే ఒక విశ్వవిద్యాలయంలో పెరిగింది అనడం సబబు’ అంటారు కొందరు ఆమె తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ. నిజమే మరి...

ఆ కుటుంబ విశ్వవిద్యాలయంలో వైజ్ఞానిక విషయాల నుంచి  వ్యాపార విజయాల వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంది. అవి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
‘నాన్న వ్యాపార నైపుణ్యం, అమ్మ సామాజిక సేవ అనే రెండు ప్రపంచాలను చూస్తూ పెరిగాను. అవి రెండు విడి ప్రపంచాలు కాదు. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ప్రపంచాలు. వ్యాపారవేత్తగా సామాజిక సేవ ఎంత బాగా చేయవచ్చో తెలుసుకున్నాను’ అంటుంది అక్షతామూర్తి.

నీ రుణం తీర్చుకోలేనిది
‘ఆమె నా వెంట ఉంటే చాలు’ అని ఎన్నో ఇంటర్వ్యూలలో అక్షరతామూర్తి గురించి చెప్పకనే చెప్పాడు సునాక్‌. లండన్‌లోని వెంబ్లీలో జరిగిన మొన్నటి ఎన్నికల ప్రచార సభలో ప్రేక్షకుల్లో కూర్చున్న భార్యను చూస్తూ... ‘నా జీవితంలో నువ్వెంత ముఖ్యమో నాకే కాదు. నీకు కూడా తెలుసు. నీ రుణం తీర్చుకోలేనిది’ అన్నాడు సునాక్‌.

రాజకీయాలు అంటే మాటలు కాదు... ఏ సవాలు ఎటు నుంచి దూసుకువస్తుందో తెలియదు. ఏ అడుగులో ఏ ప్రమాదం దాగి ఉందో తెలియదు. క్షణం తీరిక లేని పనుల్లో ఏది మంచో, ఏది చెడో విశ్లేషించుకునే విచక్షణ అవసరం. ఇలాంటి సమయంలోనే ఆత్మీయులు అత్యవసరం.

స్నేహితురాలు, భార్యగా సునాక్‌ మనోప్రపంచం అక్షతామూర్తికి తెలుసు. అతని పరిమితులు, బలం ఏమిటో అందరికంటే బాగా తెలుసు. అందుకే ఇప్పుడు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు అక్షతామూర్తి బలమైన తోడు ఎంతో అవసరం.

చదవండి: రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రధాని.. చరిత్రలో ఒకేఒక్కడు రిషి..!
బ్రిటన్‌లో అమర్‌ అక్బర్‌ ఆంటోనీ..! మూడు పదవుల్లో ఆ ముగ్గురు
  

మరిన్ని వార్తలు