నయీ సోచ్‌

20 Feb, 2022 06:27 IST|Sakshi
పిల్లలతో రీతూసింగ్‌

కాలంతోపాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పటిలా సమాజాభివృద్ధికి జీవితాలను అంకితం చేసేవారు కనుమరుగైతే, కనీసం ఆ దిశగా ఆలోచించేవారు వారు సైతం క్రమంగా తగ్గిపోతున్నారు. ‘‘నేను, నా వాళ్లు, నా కుటుంబం’’ అంటూ స్వార్థంగా మారిపోతున్న ఈ రోజుల్లో కాలుష్యంతో పాడైపోతున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రీతూ సింగ్‌. డ్రెస్‌లు తయారయ్యాక వృథాగా పోతున్న బట్ట ముక్కలతో సరికొత్త డ్రెస్‌లు రూపొందించి వాటిని నిరుపేద పిల్లలకు ఉచితంగా పంచుతోంది.

పంజాబ్‌కు చెందిన రీతూ సింగ్‌ ఎమ్‌బీఏ పూర్తయ్యాక ఏడాదిపాటు ఫ్యాషన్‌  రంగంలో పనిచేసింది. ఆ తర్వాత తనకు సామాజిక సేవచేయాలన్న ఆలోచన వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో.. ఓ రోజు రీతూ తన కుమార్తెని స్కూల్‌ బస్‌ ఎక్కించడానికి బస్‌స్టాప్‌లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఓ టైలర్, బట్టలు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ ముక్కలను దగ్గరలో ఉన్న చెత్త కుండీలో పడవేయడం చూసింది. అది చూసిన రీతూ ‘‘రోజూ ఇన్ని ముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది’’ అని అనుకుని, వృథాగా పోతున్న ఆ బట్ట ముక్కలకు చక్కటి పరిష్కారం చూపాలనుకుంది.

ఏడాది పాటు ఫ్యాషన్‌  రంగంలో అనుభవం ఉన్న రీతూకు ..‘‘ఈ బట్టముక్క లన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్‌ రూపొందుతుంది’’ అన్న ఆలోచన వచ్చింది. వెంటనే బొటిక్‌లు, టైలర్‌ల దగ్గర నుంచి ముక్కలను సేకరించి వాటిని పిల్లలు వేసుకునే విధంగా డ్రెస్‌లు రూపొందించింది. అలా కుట్టిన డ్రెస్‌లను నిరుపేద పిల్లలకు ఇవ్వడంతో వారు వాటిని ధరించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో రీతూకు మరింత ఉత్సాహం వచ్చింది. మరిన్ని గుడ్డ ముక్కలను సేకరించి ఎక్కువమొత్తంలో డ్రెస్‌ల రూపకల్పన చేయసాగింది. ఇలా గత నాలుగేళ్లుగా రీతు వేస్ట్‌ పీసెస్‌తో కుట్టిన డ్రెస్‌లను చాలామందికి పంచిపెట్టింది. డ్రెస్‌లతోపాటు బ్యాగులు, జాకెట్లు, నిత్యావసర వస్తువులను వేసుకోగల సంచులను కూడా తయారు చేస్తోంది.

నయీ సోచ్‌తో అవగాహన
మురికి వాడల్లో నివసిస్తోన్న నిరుపేద పిల్లలకేగాక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లోని పెద్దలు, పిల్లలకు సైతం డ్రెస్‌లు కుట్టి ఇస్తోంది రీతు. స్కూలుకెళ్లే విద్యార్థులు వేసుకోగలిగిన స్టైలిష్‌ డ్రెస్‌లను రూపొందించి యాభైకి పైగా మురికివాడల్లో పంచింది. తన కార్యక్రమానికి వస్తోన్న స్పందనకు సోషల్‌ మీడియాలో ‘నయీ సోచ్‌’ పేరిట పేజ్‌ క్రియేట్‌ చేసి అవగాహన కల్పిస్తోంది.

ఈ పేజీ ఫాలో అయ్యేవారు చాలా మంది తమకు తెలిసిన బొటిక్స్, టైలర్స్, బట్టల తయారీ యూనిట్ల నుంచి మిగిలిపోయిన బట్ట ముక్కలను సేకరించి తీసుకొచ్చి ఇస్తున్నారు. స్కూళ్లకు వెళ్లి వస్త్ర పరిశ్రమల ద్వారా కాలుష్యం ఎలా ఏర్పడుతుందో వివరించి, పర్యావరణంపై పిల్లల్లో అవగాహన కల్పిస్తోంది. నలుగురు మహిళలను తన పనిలో చేర్చుకుని వారికి ఉపాధి కల్పిస్తో్తంది. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకు రీతూ ఉదాహరణగా నిలుస్తోంది.
సమాజాభివృద్ధికి సేవచేసే శక్తి, స్థోమతలు నాకు లేవు అని చేతులు దులుపుకోకుండా, తనకున్న నైపుణ్యంతో గుడ్డముక్కలను చక్కని డ్రెస్‌లుగా తీర్చిదిద్ది ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది రీతు.           

రోజూ ఇన్ని బట్టముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది. ఈ బట్టముక్కలన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్‌ రూపొందుతుంది అన్న ఆలోచన నుంచి పుట్టిందే   నయీ సోచ్‌.

>
మరిన్ని వార్తలు