ఆర్‌. కె. నారయణ్‌: అక్కరకు ఆదుకున్న మిత్రుడు.. కథ!

14 Nov, 2021 13:37 IST|Sakshi

ఆ గదిలోని ముగ్గురు శత్రువులు తలపునకు వచ్చినపుడు తప్ప తక్కిన సమయంలో వారిసంతోషానికి హద్దులేదు. 
వాళ్లు ఇలాంటి స్థితిలో ఉండగా రాజం స్నేహం మీద ఉపన్యాసం దంచనారంభించాడు. ‘ఐకమత్యమే బలం’ అనే నీతిని గరిపే ‘ముసలివాడు– కట్టెల మోపు’ అనే కథను ఉదాహరణగా తీసుకుని, అందరికీ నచ్చేట్టు స్నేహాన్ని గురించి మాటాడాడు.

మూడువారాల తరువాత ఒకనాటి మధ్యాహ్నం స్వామినాథన్‌ మణి ఇంటి ముందు నుంచుని సన్నగా ఈలవేశాడు. మణి వచ్చి అతనిని కలుసుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం గనుక వచ్చి తనను కలుసుకుంటే అద్భుతం చూపిస్తానన్నాడు. ఏమిటయి ఉంటుందా అని ఆలోచిస్తూ వాళ్లిద్దరూ రాజం ఇంటికి బయలు దేరారు. 
‘‘ ఆ..యేంలేదు’’ అన్నాడు స్వామినాథన్‌ ‘‘రాజం యేదో యెగతాళికి అని వుంటాడు. వాళ్లయింటికి మనిద్దర్నీ రప్పించుకోవడాని కిదో యెత్తు’’ ఇలా అనుమానం వెలిబుచ్చినందుకు మురికికాలవలోకి తోసేద్దామనుకున్నాడు మణి. 
‘‘బహుశా యేకోతినో కొనివుండవచ్చు’’ అని తిరిగీ అన్నాడు స్వామినా«థన్‌ ధైర్యంగా. మణి అతనిమీద మహాదయ చూపుతున్నట్టు ‘అయి ఉండవచ్చు’ అన్నాడు. వాళ్లకి ఆశ్చర్యంగొలిపే విషయాలు ఒకొకటే ఊహించుకుని చివరకు లాభంలేదని ఊహించడమే మానుకున్నారు. 

ఆలోచనలు శత్రువులమీదికి మళ్లాయి. ‘‘నే నేం చెయ్యబోతున్నానో తెలుసా?’’ అని అడిగాడు మణి. ‘‘ సోము నడుం విరగొట్టేస్తాను. వాడు యెక్కడ వుంటున్నదీ నాకు తెలుసు. బజారు వెనుక కబీర్‌వీధిలో వుంటున్నాడు. తమలపాకులు కొనక్కోవడానికి తరచుగా బజార్లో ఒక కొట్టుకు రావడం చూశాను. ముందుగా మునిసిపాలిటీ దీపం మీద రాయి విసిరి దాన్ని ఆర్పేస్తాను. కబీర్‌ వీధిలో యెంత చీకటో నీకేం తెలుసు?.. దుడ్డుకర్ర పుచ్చుకుని చీకట్లో నుంచుంటాను. వాడు వచ్చీ రావడంతోనే యెముకలు విరగ్గొట్టిపడేస్తాను...’’ ఈ మాటలు వింటూంటే స్వామినాథన్‌కి వణుకు పుట్టింది. ‘‘ అంతటితో అయిందీ’’ అంటూ మళ్లీ మొదలుపెట్టాడు మణి. ‘‘బఠాణీగింజ’’ను కాలికింద నలిపేస్తాను. యిక శంకర్‌ని సరయూనది ఒడ్డుమీది రావి చెట్టుమీద వేలాడగట్టివురేస్తాను.’’ 
రాజం ఇంటికి చేరుకోగానే మాటాడుకోవడం ఆపేశారు. గేటువేసి ఉంది. గోడఎక్కి లోపలకు దూకారు. ఒక నౌకరు వారివైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘గోడ యెందుకు యెక్కారు?’’అని అడిగాడు. 

‘‘యీ గోడ నీ అబ్బసొమ్మా యేం?’’ అని మణి విరగబడి నవ్వసాగాడు. 
‘‘నడుములు విరిగితే’’– అంటూ మొదలుపెట్టాడు నౌకరు. 
‘‘నీకెం? నీ నడుం విరగదుగా’’అని దయాదాక్షిణ్యాలు లేనివాడిలా నవ్వాడు స్వామినాథన్‌. 
‘‘యింకొక్కమాట నువేం పోలీసు సూరెంటు కొడుకువా?’’ అన్నాడు మణి. ‘‘ఉహు.. కాను’’ అని నౌకరు జవాబిచ్చాడు. 
‘‘అలాయితే, విను’’ అన్నాడు మణి. ‘‘మేము పోలీసు సూపరెంటుగారి కొడుకుతో మాటాడాలని వచ్చాం.’’ దాంతో నౌకరు వెనక్కి తగ్గాడు. 
రాజం గది తలుపు మీద దబదబా బాదాడు. గడియ చప్పుడుకాగానే వెళ్లి స్తంభం చాటున దాక్కున్నాడు. రాజం తొంగిచూసి ఎవరూ కనిపించకపోయేసరికి మళ్లీ తలుపు వేసుకున్నాడు. 

మణి, స్వామినాథన్‌∙స్తంభం చాటునుంచి ఇవతలకి వచ్చి ఏమిచేయడానికీ తోచక గుమ్మం ముందు నిలబడ్డారు. స్వామినాథన్‌ తలుపు సందున నోరుపెట్టి పిల్లిలాగా మ్యావ్‌ అన్నాడు. మణి.. స్వామినాథన్‌ని ఇవతలికి లాగి తాను తలుపుసందున నోరు పెట్టి కుక్కలాగా మొరిగాడు. మళ్లీ గడియచప్పుడయి తలుపు కొద్దిగా తెరుచుకుంది. మణి.. స్వామినాథన్‌ చెవిలో ‘‘నువు గుడ్డిపిల్లి పిల్లవి, నేను గుడ్డికుక్క పిల్లను’’ అన్నాడు. 

మణి వంగి చేతులు నేలకు ఆనించి, కళ్లు గట్టిగా మూసుకుని, తలతో తలుపుతోసి గుడ్డికుక్క పిల్లలాగా నటిస్తూ రాజం గదిలో ప్రవేశించాడు. స్వామినాథన్‌ కళ్లుమూసుకుని మణి వెనకాలే పాక్కుంటూ వెళుతూ మ్యావ్‌ అని అరవసాగాడు. ఈవిధంగా గది నాలుగుమూలలా తిరగసాగారు. రాజం వాళ్ల కూతలకు జవాబుగా తానూ నిమిషనిమిషానికీ మొరుగుతూ, మ్యావ్‌ అంటూ ఆ ఆటకు రక్తి కట్టించాడు. గుడ్డికుక్క పిల్లకు మనిషికాలు రాసుకుంది. ఆ కాలు రాజందే అనుకొని మెల్లిగా పిక్క మీద కరిచింది. కాని, కళ్లు తెరిచి చూసేసరికి ఆశ్చర్యం! ఆ కాలు అతని శత్రువు సోముది. గుడ్డిపిల్లి పిల్ల ఒక కాలు దగ్గరికి చల్లగా వెళ్లి పంజాతో గోకసాగింది. కళ్లు తెరిచి చూసేసరికి ఆశ్చర్యం! అది శత్రువు శంకర్‌ కాలు! 

మణి అలాగే ఒక్క నిమిషం కొయ్యబారిపోయి, లేచి నుంచున్నాడు. సిగ్గుతో కోపంతో చుట్టూ చూశాడు. ‘బఠాణీగింజ’ ఒకమూల అల్లరికి కళ్లు మిణకరిస్తూ కూర్చున్నాడు. గొంతు పిసికేయాలన్నంత కోపంవచ్చింది మణికి. వెనుకకుతిరిగి చూశాడు. రాజం నవ్వు అణచుకుంటూ అతనికేసి రెప్పలార్పకుండా చూస్తున్నాడు. 
ఇక స్వామినాథన్‌ ఏ కుర్చీకిందో బల్లకిందో ఎవరికంటా పడకుండా చీకట్లో దాక్కోవడం ఉత్తమమని తలచాడు. 

‘‘రాజం! యేమిటి నీవుద్దేశం?’’ అని అడిగాడు మణి. 
‘‘యెందుకలా మండిపడతావ్‌?’’
‘‘యిదంతా నీ తప్పు’’ అన్నాడు మణి కఠినంగా. ‘‘నాకు తెలవదు..’’ చుట్టూ చూశాడు. 
‘‘బలేబాగుంది! నిన్ను కుక్కలాగా నడుస్తూ మొరగమన్నానా? మొరగమన్నానా?’’
సోము, అతనిజట్టు ఫక్కున నవ్వారు. మణి చుట్టూ తేరిపారజూచి, ‘‘రాజం, నేను వెళ్లిపోతున్నా. యిది నేను వుండదగిన స్థలం కాదు’’ అన్నాడు. 
‘‘నువు వెళ్లిపోతే యిక నీతో నేనూ మాటాడను’’ అన్నాడు రాజం. 

ఏంచేయడానికి మణికి పాలుపోలేదు. రాజం అతనిని పక్కకు తీసుకువెళ్లి శాంతపరచాడు. అంతులేని కష్టంలో చిక్కుకుని ఉన్న స్వామినాథన్‌ వైపు తిరిగి, తన జీవితంలో కుక్కలా,  పిల్లిలా అంత చక్కని నటన ఎన్నడూ చూడలేదని పొగడి, అతనిని కూడా ఓదార్చాడు. ‘కొద్దినిమిషాల వరకు నిజంగానే కుక్కే మొరుగుతోంది, పిల్లే అరుస్తోంది అని భ్రమపడ్డాను. ఏ సంతలోనో ఇలా ప్రదర్శిస్తే మీకు బహుమానాలు వచ్చిపడతాయి.’ అన్నాడు. తిరిగీ అలా నటిస్తే, తానెంతో సంతోషిస్తాననీ, చూడడానికి వాళ్ల నాన్నను కూడా పిలుచుకు వస్తాననీ చెప్పాడు. 
దీంతో స్వామినాథన్, మణి చల్లబడిపోయి, తమను చూచుకుని తామే గర్వించసాగారు. ఆ తరువాత అంతా ఫలహారాలు చేశారు. ఆ గదిలోని ముగ్గురు శత్రువులు తలపునకు వచ్చినపుడు తప్ప తక్కిన సమయంలో వారిసంతోషానికి హద్దులేదు. 

వాళ్లు ఇలాంటి స్థితిలో ఉండగా రాజం స్నేహం మీద ఉపన్యాసం దంచనారంభించాడు. ‘ఐకమత్యమే బలం’ అనే నీతిని గరిపే ‘ముసలివాడు– కట్టెల మోపు’ అనే కథను ఉదాహరణగా తీసుకుని, అందరికీ నచ్చేట్టు స్నేహాన్ని గురించి మాటాడాడు. అక్కరకు ఆదుకున్న స్నేహితుడే నిజానికి స్నేహితుడు. శత్రుత్వాన్ని పెంచుకునేవారు ఎటువంటి నరకయాతనలు పడతారో ఒళ్లు గగుర్పొడిచేటట్లు వర్ణించాడు. శత్రుత్వాన్ని పెంచుకున్న వాడిని చనిపోయిన తరువాత ఒక గదిలో పెట్టి తాళం వేస్తారు. బట్టలు ఊడదీసి ఎర్రగాకాలుతున్న ఇనుప దిమ్మెమీద నిలబెడతారు. చుట్టూ తేనెతుట్లు. వాటిల్లో నిమ్మకాయంత తేనెటీగలు. ఆ పాపి దిమ్మెమీద నుంచి కిందకు అడుగుపెడితే, ‘ఆ గదిలో తిరిగే వందలకొలదీ తేళ్లు, జెర్రులమీద కాలు పెట్టాలి. ఇదంతా వేదాలలో రాసుంది’ అని చెప్పాడు రాజం. అంతా గజగజ వణికిపోయారు. 

నిద్రాహారాలు లేకుండా ఆ పాపి అలా నెల రోజులు నిలబడాలి. ఆపైన అతనిని ఒకవంతెన మీదికి తీసుకువెళతారు. వంతెనె కింద కళపెళకాగే నూనె చెరువు. పైగా వంతెన మహా ఇరుకు. కాలి అడుగు కంటె ఎక్కువ వెడల్పు ఉండదు. ఒకొక్క అడుగు వేసుకుంటూ వెళ్లాలి. ఆ వంతెన మీద కూడా కందిరీగ గూళ్లు, ముండ్లజెముడు పొదలు బోలెడన్ని ఉన్నాయి. వంతెన మీదుగా సాగిపొమ్మని వెనక నుంచి అదమాయిస్తుంటారు. కళపెళకాగే ఆ నూనెలో కాలుజారి పడకుండా ఎల్లకాలం నడవాలంటే ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ వెళ్లాలి.. 

రాజం మాటలు అందరినీ ముగ్ధుల్ని చేశాయి. ముందుకు వచ్చి ‘నేటినుంచీ మాకు శత్రువులంటూ లేరు’ అని చెప్పమని రాజం వారిని ఆహ్వానించాడు. ఆ మాట చెపితే శంకర్‌కి ఒక బైండుబుక్కు, స్వామినాథన్‌కి గడియారంలా పనిచేసే ఇంజను, సోముకి బెల్టు, మణికి చక్కటి చాకూ, ‘బఠాణీగింజ’కు మహాపసందయిన కలం ఇస్తానన్నాడు. 
బీరువా తెరిచి తాను వారికి బహుమానంగా ఇవ్వదలచిన ఆ వస్తువులన్నింటినీ చూపెట్టాడు. గోళ్లుకొరుక్కుంటూ అంతా మాట్లాడకుండా కొంచెంసేపు నిలబడ్డారు. ఈ రాజీ చేయడంలో హైరాన పడ్డాడేమో రాజంకు ముచ్చెమటలు పట్టాయి. 

మొట్టమొదట ‘బఠాణీగింజ’ లేచి బీరువా ముందు నిలబడి, ‘‘ఆ కలం యిలా యివ్వు చూస్తాను’’ అన్నాడు. రాజం కలం ఇచ్చాడు. ఆ కలాన్ని అటూ ఇటూ తిప్పిచూసి, ఏమీ అనకుండా తిరిగి ఇచ్చి వేశాడు. ‘‘యేం నచ్చలేదా?’’ అని అడిగాడు రాజం. బఠాణీగింజ బీరువాలోకి తేరిపార జూస్తూ ‘‘నాకు ఆ పెట్టె కావాలి’’ అన్నాడు ఒక చిన్న పెట్టెను చూపిస్తూ. ఆ పెట్టెమీద పసుపుపచ్చటి నల్లటి నమూనా చిత్రాలు, మూతమీద తాజమహల్‌ బొమ్మ వేసి ఉన్నాయి. ‘‘ఉహూ.. వీల్లేదు. అది నాకు కావాలి’’ అన్నాడు రాజం. ఒక నిమిషం గడిచింది. రాజంకు అలాంటి పెట్టెలు ఇంకా రెండు ఉన్నాయి. మనసు మార్చుకుని ‘‘నా కక్కరలేదులే. కావలిస్తే తీసుకో’’ అన్నాడు. కొద్దిసేపటికి మణి అరచేతితో చాకుకు పదునుపెడుతున్నాడు. సోము బెల్టు పెట్టుకుంటున్నాడు. శంకర్‌ లావుపాటి బైండుబుక్కు అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు. స్వామినాథన్‌ ఆకుపచ్చని ఇంజనును ఆప్యాయంగా గుండెకేసి అదుముకుంటున్నాడు.

సేకరణ:  ‘స్వామి, స్నేహితులు’ అనే పుస్తకంలోంచి.. 
రచన: ఆర్‌. కె. నారయణ్‌
అనువాదం: శ్రీనివాస చక్రవర్తి

చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!!

మరిన్ని వార్తలు