ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రైతమ్మలు భేష్‌!

12 Oct, 2021 10:46 IST|Sakshi

వ్యవసాయం, ఆహార శుద్ధి, వినియోగం, పంపిణీకి సంబంధిత పనులతోపాటు.. కుటుంబానికి/సమాజానికి ఆహారాన్ని సమకూర్చడంలో గ్రామీణ మహిళల పాత్ర అమోఘమైనది. పంటలు/తోటల సాగు, పశుపోషణ తదితర అనుబంధ పనుల్లో మహిళా రైతులు, కార్మికులు, బాలికల శ్రమ అంతా ఇంతా కాదు. యావత్‌ సమాజానికి ఆహార భద్రత కల్పించడంలో వీరిది కీలకపాత్ర. పురుషుల కన్నా అధిక గంటలు చాకిరీ చేసినా వీరి శ్రమకు తగినంత గుర్తింపు దొరకడంలేదన్నది వాస్తవం. అనుదినం గుర్తుచేసుకోవాల్సిన విశేష సేవలు అందిస్తున్న గ్రామీణ మహిళలు, బాలికలకు చేదోడుగా నిలవడం కోసం అక్టోబర్‌ 15వ తేదీని ‘అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. 

పితృస్వామిక వ్యవస్థలో గ్రామీణ మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అన్యాయాలను రూపుమాపే లక్ష్యంతో ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించే పనికి స్వచ్ఛంద కార్యకర్తలు 1995లో శ్రీకారం చుట్టారు. 2007లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ దీనికి ఆమోద ముద్ర వేసింది. 

పర్యావరణ సంక్షోభానికి కరోనా మహమ్మారి తోడై ప్రాణాలు తోడేస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అర్థాకలితో జీవించే వారి సంఖ్య గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 20% పెరిగింది. 2021లో ‘మన కోసం ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్న గ్రామీణ మహిళల’ శ్రమకు గుర్తింపునివ్వాలని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం పిలుపునిచ్చింది. 

ప్రపంచ జనాభాలో మహిళలు, పిల్లల సంఖ్య 75%. తాము నివశిస్తున్న సమాజంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ వాతావరణాన్ని రూపుదిద్దటంలో తమ ఆలోచనలు, దృష్టికోణం, నైపుణ్యాలు, అనుభవాలకు మరింత న్యాయమైన పాత్ర దక్కాలని వారు ఆశిస్తున్నారు. 

పొలాల్లో, పెరట్లో రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు చేయటంలో ఏపీలో గ్రామీణ మహిళా రైతులు, భూమి లేని మహిళా కార్మికులు ముందంజలో ఉన్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యదాకయమైన ఆహారాన్ని అందించడానికి అహరహం శ్రమిస్తున్న గ్రామీణ మహిళా రైతులకు వందనాలు. మన ఆకలి తీర్చి జవసత్వాలనిచ్చే ప్రతి ముద్దకూ మహిళా రైతులకు అందరం కృతజ్ఞులమై ఉండాలి.  

తొలి ఆర్గానిక్‌ గ్రీన్‌ స్టోర్‌ను నెలకొల్పుతున్న ఎఫ్‌.పి.ఓ.లు  
సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలను పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులతో నిల్వ చేసి, రవాణా చేసి ప్రజలకు అందించే లక్ష్యంతో రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌.పి.ఓ.లు) ప.గో. జిల్లా ఏలూరు నగరం అమీనపేటలో రాష్ట్రంలోనే తొలి హరిత వెజ్జీస్‌ మార్టును నెలకొల్పుతున్నాయి. ‘నాబ్‌కిసాన్‌’ ఎం.డి.– సీఈఓ సుశీల చింతల ఈనెల 18న ప్రారంభించే ఈ ఎకోఫ్రెండ్లీ గ్రీన్‌ స్టోర్‌ ప్రత్యేకత ఏమిటంటే.. 3 స్టార్టప్‌ సంస్థలు రూపొందించిన పర్యావరణ హిత సాంకేతికతలను వినియోగిస్తున్నారు.

రుకార్ట్‌ టెక్నాలజీస్‌ రూపొందించిన (ఏ విద్యుత్తూ అవసరం లేకుండా కొద్దిరోజుల పాటు కూరగాయలు, పండ్లను నిల్వ ఉంచే) ‘సబ్జీ కూలర్‌’ను, టాన్‌ 90 థర్మల్‌ సొల్యూషన్స్‌ వారి కోల్డ్‌స్టోరేజ్‌ సదుపాయాన్ని, ఎకో తేజాస్‌ గ్రీన్‌ ఫ్యూయల్‌ ఆల్టర్నేటివ్స్‌ వారి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను ఉపయోగిస్తున్నారు. పెదవేగికి చెందిన హరిత మిత్ర ఎఫ్‌.పి.సి., ఎం.నాగులపల్లి వెజిటబుల్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ఈ గ్రీన్‌ స్టోర్‌ను ఏర్పాటు చేస్తుండటం విశేషం. 

చదవండి: షుగర్ వ్యాధిగ‍్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్‌ నీరా, బెల్లం!

మరిన్ని వార్తలు