Romita Mazumdar: లాయర్ల కుటుంబం నుంచి వచ్చి.. కాస్మోటిక్‌ బేస్డ్‌ స్టార్టప్‌ మొదలుపెట్టి..

20 Jan, 2023 14:00 IST|Sakshi

జార్ఖండ్‌లోని రాంచిలో పుట్టి పెరిగింది రోమిత. తండ్రి న్యాయవాది. తల్లిదండ్రులు తన పట్ల ఎప్పుడూ వివక్ష ప్రదర్శించలేదు. సోదరుడితో సమానంగా పెంచారు. యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో బిజినెస్‌ ఎకనామిక్స్‌ చదువుకునే రోజుల్లో కూడా తనకు వివక్ష ఎదురు కాలేదు.

హార్బర్‌ రిడ్జ్‌ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది రోమిత. ఆ తరువాత వెంచర్‌ క్యాపిటలిస్ట్‌(వీసి)గా కూడా తనను తాను నిరూపించుకుంది. ఒకానొకరోజు...తనకు వ్యాపారరంగంలోకి ప్రవేశించాలని ఆలోచన వచ్చింది. లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన రోమితకు ఎలాంటి వ్యాపార అనుభవం లేదు.

 ‘ఎందుకొచ్చిన రిస్క్‌’ అని అనుకొని ఉంటే తన కలను నెరవేర్చుకునేది కాదు. కాస్మోటిక్స్‌ బేస్డ్‌  స్టార్టప్‌ గురించి ఆలోచనతో నిధుల సమీకరణకు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు తనను బాధ పెట్టే ఎన్నో అనుభవాలు, ప్రశ్నలు ఎదురయ్యాయి.

‘మీరు మాత్రమేనా?’  ‘మేల్‌ కో–ఫౌండర్‌ ఎవరూ లేరా?
‘మీకు పెళ్లి అయిందా? అయితే పూర్తి సమయం కంపెనీ కోసం ఎలా కేటాయించగలరు?’
‘మీరు సీరియస్‌గా వ్యాపారరంగంలోకి వచ్చినట్లుగా అనిపించడం లేదు. ఏదో సరదాగా వచ్చినట్లు అనిపిస్తుంది’... ఇవి మనసులోకి తీసుకునే ఉంటే రోమిత మజుందార్‌ తిరిగి వెనక్కి వెళ్లేదే తప్ప ముందుకు అడుగు వేసేది కాదు.

ఎన్నో రకాల అనుమానాలు, అవమానాలను ఎదుర్కొని ఎట్టకేలకు కాస్మోటిక్‌ బేస్డ్‌ స్టార్టప్‌ ‘ఫాక్స్‌టేల్‌’తో తన కలను నిజం చేసుకుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ నాలుగు రకాల ఉత్పత్తులతో మార్కెట్‌లోకి ప్రవేశించి కొద్దికాలంలోనే విజయకేతనం ఎగరేసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రోమిత మజుందార్‌ మంచి పేరు తెచ్చుకుంది.

చదవండి: Viral: 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా! ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. వీడియో వైరల్‌                  

మరిన్ని వార్తలు