అప్పుడు నేను మాత్రమే ముస్లిం అమ్మాయిని

9 Jan, 2021 08:35 IST|Sakshi

‘లెడ్‌ బై’ భారతీయ ఇస్లాం మహిళల సాధికారత కోసం ఏర్పాటైన వేదిక. సంప్రదాయాల ముసుగు మాటున అణగారిపోతున్న మహిళల మేధకు పదును పెట్టి సాధికారత దిశగా అడుగులు వేయిస్తోంది డాక్టర్‌ రుహా షాబాద్‌. ముప్పై ఏళ్ల రుహా షాబాద్‌ పుట్టింది మనదేశంలోనే. పెరిగింది మాత్రం సౌదీ అరేబియాలో. మహిళలకు శిక్షణనివ్వడానికి, అభివృద్ధి వైపు నడిపించడానికి గత ఏడాది ‘లెడ్‌ బై’ సంస్థను స్థాపించిందామె. 

ఆలోచించాల్సిన విషయం
జీవితంలో తాను అనుకున్నది సాధించిన మహిళ డాక్టర్‌ రుహ. కొన్నేళ్లపాటు డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసిన తర్వాత ప్రజావైద్య విభాగంలో పని చేయాలనే ఉద్దేశంతో క్లింటన్‌ హెల్త్‌ యాక్సెస్‌ ఇనిషియేటివ్, నీతి ఆయోగ్‌లో పని చేసింది. ఆ తర్వాత పబ్లిక్‌ హెల్త్‌లో మాస్టర్స్‌ డిగ్రీ కోసం హార్వర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లింది. ఆమెలో రేకెత్తిన ఆలోచనలకు కార్యరూపమే లెడ్‌బై సంస్థ. తనలో ఈ ఆలోచనలు రూపుదిద్దుకోవడానికి దారి తీసిన అనేక సంఘటనలను గుర్తు చేసుకున్నారామె. ‘‘చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు నేను మాత్రమే ముస్లిం అమ్మాయిని. కోట్లాది ముస్లిం కుటుంబాలు ఉండగా, ఒక్క ముస్లిం మహిళ కూడా నాకు చదువులో, ఉద్యోగంలో తారసపడలేదెందుకని, వారంతా ఏం చేస్తున్నారు... అని కూడా అనిపించేది. అలాగే డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసిన రోజుల్లో నేను గమనించిన విషయం ఒకటుంది. నా దగ్గరకు వైద్యం కోసం వచ్చిన ముస్లిం యువతుల్లో చాలా మందికి చిన్న వయసులోనే ఎంతోమంది పిల్లలుండేవాళ్లు. ఇది తప్పని కానీ, ఒప్పని కానీ చెప్పలేను.

ఇది ఆలోచించాల్సిన విషయం అని మాత్రం అనిపించింది. మహిళలకు ఆలోచించే అవకాశం కల్పించాలి. వారి ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగిన వేదిక కల్పించాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచనలకు హార్వర్డ్‌లో ఉన్నప్పుడు ఒక రూపు వచ్చింది. లెడ్‌బై సంస్థను స్థాపించాను. మహిళలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించడంతోపాటు వారిలో నాయకత్వ లక్షణాలను ప్రోదిగొల్పడానికి వర్క్‌ షాపులు నిర్వహిస్తున్నాను. అడ్వైజరీ ఫ్రేమ్‌వర్క్‌తోపాటు పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాను. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన 24 మందితో నాలుగు నెలల తొలి విడత కోర్సు పూర్తయింది. కోవిడ్‌ కారణంగా సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాల్సి వచ్చింది. భారతీయ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ లెడ్‌బై సంస్థను ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు. ఇండియాలో ఇలాంటి ప్రయత్నం ఇంతకు మునుపు జరగలేదు, ఇదే తొలి ప్రయత్నం’’ అని చెప్పింది డాక్టర్‌ రుహా షాదాబ్‌.

మరిన్ని వార్తలు