మెక్సికో సెక్యూరిటీకి తొలి మహిళా మంత్రి!

3 Nov, 2020 08:32 IST|Sakshi

డ్రగ్స్‌ మాఫియాను కంట్రోల్‌ చెయ్యాలి. కరడుగట్టిన నేరస్థులను అదుపులో పెట్టాలి. ముఠాలను ఏరిపారేయాలి. రోసా ఇంకా చార్జే తీసుకోలేదు. ప్రెసిడెంట్‌ రిలాక్స్‌ అయ్యారు!  అంతే మరి. ‘నేను నా దేశమును..’ అని.. రోడ్రిగ్స్‌ ప్రమాణం చేశారంటే... కాపాడతాను అని భరోసా ఇచ్చినట్లే! ఏమిటి రోడ్రిగ్స్‌ ప్రత్యేకత? మెక్సికో సెక్యూరిటీ మినిస్టర్‌ ‘హాట్‌ సీట్‌’ ఖాళీ. ఒక్క క్షణమైనా అది ఖాళీగా ఉండేందుకు లేదు. అందులో కూర్చోడానికి తగిన వ్యక్తి కూడా ఉండాలి. ఎవరున్నారా అని చూశారు మెక్సికన్‌ ప్రెసిడెంట్‌ ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌. ఎవరూ కనిపించ లేదు. ఎవరూ చెయ్యి కూడా ఎత్తలేదు. చివరికి ఆయన దృష్టి రోసా ఐస్‌లా రోడ్రిగ్స్‌ పైన ఆగింది. మెక్సికో ‘సెక్యూరిటీ మినిస్టర్‌’కు తలకు మించిన పనులే ఉంటాయి. మిగతా మంత్రిత్వ శాఖల్లా కేవలం ప్రజా సంక్షేమ వ్యవహారాలు మాత్రమే కాదు. ఆ దేశంలో ప్రభుత్వానికి సమాంతరంగా పాలనా వ్యవహారాలను నడిపిస్తున్న డీలర్‌లను అదుపు చేయాలి.

నేరాలను నియంత్రించాలి. ఎన్ని నిఘా నేత్రాలను వేసి ఉంచినా కొత్త దారుల్లో మాదక ద్రవ్యాల మాఫియా తలెత్తుతూనే ఉంటుంది. ఇప్పుడున్న సెక్యూరిటీ మినిస్టర్‌ ఆల్ఫాన్యో డ్యురాజో.. సొనొరా రాష్ట్ర గవర్నరుగా పోటీ చేయడం కోసం పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడా ‘హాట్‌ సీట్‌’ ఖాళీ. ఒక్క క్షణమైనా అది ఖాళీగా ఉండేందుకు లేదు. అందులో కూర్చోడానికి తగిన వ్యక్తి కూడా ఉండాలి. ఎవరున్నారా అని చూశారు మెక్సికన్‌ ప్రెసిడెంట్‌ ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌. ఎవరూ కనిపించలేదు. ఎవరూ చెయ్యి కూడా ఎత్తలేదు. చివరికి ఆయన దృష్టి రోసా ఐస్‌లా రోడ్రిగ్స్‌ పైన ఆగింది. ఆమెను ఎంపిక చేసుకున్నారు ఆండ్రస్‌. రోసా ఓడ రేవుల మంత్రి. మాఫియా కార్యకలాపాలకు రేవులు కూడా కీలకమైన దారులే. అందుకు మాత్రమే కాకున్నా, దేశ రక్షణ శాఖను (సెక్యూరిటీ మినిస్ట్రీ)  చేపట్టడానికి అవసరమైన సామర్థ్యాలతో పెద్ద ప్రొఫైలే ఉంది రోసా ఐస్‌లా రోడ్రిగ్స్‌కి. అధ్యక్షుడు అడగగానే మరో మాట లేకుండా ‘ఎస్‌.. సర్‌’ అన్నారు ఆమె. ఆమెకు ముందు ఆ పోస్టులో మహిళలు లేరు. దేశానికి తొలి మహిళా సెక్యూరిటీ మినిస్టర్‌ రోసానే!  

రోసా రోడ్రిగ్స్‌ను రేవుల మంత్రిగా మెక్సికో అధ్యక్షుడు నియమించుకోడానికి కూడా ప్రధాన కారణం డ్రగ్‌ ట్రాఫికింగ్‌ను, అక్రమ రవాణాను, కస్టమ్స్‌ శాఖలో అవినీతిని నిర్మూలించడానికే. గత జులైలోనే రోసా ఆ బాధ్యతల్లోకి వచ్చారు. వాటిని నిర్వర్తిస్తున్న క్రమంలోనే ఇటీవల కరోనా బారిన పడి, ప్రస్తుతం తేరుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే మళ్లీ దేశానికి అత్యవసరంగా అమె సేవలు అవసరం అయ్యాయి. రోసా ఇప్పుడు నిర్వహించవలసిన శాఖ ‘సెక్యూరిటీ అండ్‌ సిటిజెన్‌ ప్రొటెక్షన్‌. (ఎస్‌.ఎస్‌.పి.సి.). ఎప్పటిలా క్యాబినెట్‌లో నామినేటెడ్‌ మంత్రి హోదాలో ఉంటూనే ఆమె ఎస్‌.ఎస్‌.పి.సి. సచివాలయానికి కార్యదర్శిగా ఉంటారు. జూలై 25 వరకు ఆమె నిర్వహించింది సమాచార, రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ‘పోర్ట్స్, మర్చంట్‌ మెరైన్‌’ విభాగానికి ప్రధాన పర్యవేక్షకురాలిగా.

మెక్సికోలోని శాన్‌ లూయీస్‌ పొటోసీ నగరపు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇంత ఎత్తుకు ఎదగడం అన్నది సాధారణమైన విషయం అయితే కాదు. మొదట ఆమె జర్నలిజంలోకి వచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కార్లోస్‌ సెప్టియన్‌ గార్షియా స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం’ నుంచి పట్టభద్రురాలు అయ్యారు. ఆ వెంటనే టెలీవీసా రేడియోకు, ఎల్‌ యూనివర్సల్‌ అండ్‌ లా జోర్నాడా మీడియా హౌస్‌కు రిపోర్టర్‌గా పని చేశారు. నిజానికి అప్పట్నుంచే ఆమె తన పరిశోధన్మాతక జర్నలిజంతో డ్రగ్‌ మాఫియా పని పట్టడం మొదలైంది. తర్వాత మెక్సికో సిటీ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్య సమన్వయ అధికారిగా 1997 నుంచి 2000 వరకు పౌరసేవలు అందించారు. కొనసాగింపుగా 2018 వరకు ప్రభుత్వంలోని వివిధ శాఖలలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. రెండేళ్ల క్రితమే రేవుల పర్యవేక్షణ విభాగానికి వచ్చారు.

మరిన్ని వార్తలు