Rewind 2021: సామాన్యురాలు ఫోర్బ్స్'‌ లిస్టులో.. విశ్వకిరీటం మరోసారి

31 Dec, 2021 00:34 IST|Sakshi

2021 సంవత్సరం ఏం చేసింది?
చెప్పులు లేని ఒక మహిళను పార్లమెంటులో సగౌరవంగా నడిపించింది. భుజానికి మందుల సంచి తగిలించుకుని తిరిగే సామాన్య ఆరోగ్య కార్యకర్తను ‘ఫోర్బ్స్‌’ పత్రిక ఎంచేలా చేసింది. ఈ సంవత్సరం ఒక తెలుగు అమ్మాయిని అంతరిక్షాన్ని చుంబించేలా చేసింది. ఈ సంవత్సరం ఒక దివ్యాంగురాలికి ఒలింపిక్స్‌ పతకాలను మెడ హారాలుగా మలిచింది.

ఈ సంవత్సరం భారత సౌందర్యానికి విశ్వకిరీటపు మెరుపులు అద్దింది. ఈ సంవత్సరం దేశ మహిళ జాతీయంగా అంతర్జాతీయంగా తానొక చెదరని శక్తినని మరోమారు నిరూపించుకునే అవకాశం ఇచ్చింది. 2021 మెరుపులు ఎన్నో. కాని 2022లో ఈ శక్తి మరింత ప్రచండమై స్ఫూర్తిని ఇవ్వాలని.. కీర్తిని పెంచాలని కోరుకుందాం.

కరోనా వారియర్‌!
మెటిల్డా కుల్లు (45)
► అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కోవిడ్‌పైనా, ఆరోగ్య విషయాలపైన విస్తృతంగా అవగాహన కల్పించింది మెటిల్డా కుల్లు. దానికిగాను ఆమెకు ‘‘ఫోర్బ్స్‌ ఇండియా విమెన్‌ పవర్‌–2021’’ గుర్తింపు లభించింది.

► భుజానికో చిన్న చేతి సంచి, కాలి కింద సైకిల్‌ పెడల్, గుండెనిండా సంకల్పం, సంచి నిండా ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రింటింగ్‌ మెటీరియల్‌తో బయలుదేరింది  ఒడిశా సుందర్‌ఘర్‌ జిల్లాలోని గర్గద్‌బహాల్‌ గ్రామానికి చెందిన ఆశా వర్కర్‌ మెటిల్డా కుల్లు. కరోనా మహమ్మారి అంటేనే ప్రపంచమంతా గడగడలాడుతున్న సమయమిది. ఇంతటి క్లిష్టమైన తరుణంలోనూ ఎంతో భరోసా ఇస్తూ కోవిడ్‌ కిట్లూ, ఇతర సామగ్రితో కొండాకోనల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైకిల్‌పై ఇంటింటికీ తిరిగింది. అసలే వెనకబడిన ఖారియా అనే ఓ గిరిజన తెగకు చెందిన మహిళ. చుట్టూ ఆమె మాటలు లెక్కచేయని కులతత్వాలూ, ఆధునిక వైద్యాన్ని నమ్మని చేతబడులూ, మంత్రతంత్రాలను నమ్మే ప్రజలు. ఈ నేపథ్యంలో పడరానిపాట్లు పడుతూ, మూఢనమ్మకాలను నమ్మవద్దంటూ నచ్చజెప్పింది.

► కేవలం కోవిడ్‌పైనేగాక... మలేరియా గురించి, గిరిజన తండాల్లోని మహిళలకు పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్పింది. అంగన్వాడీ మహిళలతో కలిసి కుటుంబనియంత్రణ అవసరాల గురించి బోధించి, ఎరుకపరచింది. అత్యంత దుర్గమ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ కనీసం తినడానికి తిండి లేక మలమలమాడిపోయినా తన లక్ష్యాన్ని విడువలేదు. తాను చికిత్స అందించాల్సిన 250 ఇళ్లలోని 964 మందిలో  ప్రతి ఒక్కరికీ వైద్య సహాయాన్ని అందించింది. ఇలా అత్యంత వెనకబడిన ప్రాంతాల్లోని సమూహాలను ప్రభావితం చేసినందుకు భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన, ప్రభావపూర్వకమైన 21 మంది మహిళల్లో తానూ ఒకరంటూ ‘‘ఫోర్బ్స్‌ ఇండియా విమెన్‌ పవర్‌–2021’’ గుర్తించేలా పేరుతెచ్చుకుంది. మరెందరికో స్ఫూర్తిమంతంగా నిలిచింది.

ఫైటర్‌ అండ్‌ షూటర్‌!
అవనీ లేఖరా (20 )  
► పారా ఒలింపిక్‌ క్రీడల్లో రెండు మెడల్స్‌ సాధించిన తొలి భారతీయ మహిళగా ప్రతిష్ఠ సాధించింది. అంతేకాదు మహిళల పది మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌ 2 క్రీడాకారిణిగా నిలిచింది.

► అవని లేఖరా తన పదకొండవ ఏట ఓ కారు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో ‘పారాప్లీజియా’ అనే మెడికల్‌ కండిషన్‌కు లోనైంది. ఫలితంగా ఓ వైపు దేహమంతా చచ్చుబడిపోయింది. అయినా ఏమాత్రం నిరాశ పడలేదు. ఏదైనా క్రీడను ఎంచుకుని రాణించాలంటూ తండ్రి ప్రోత్సహించారు. దాంతో అభినవ్‌ భింద్రా నుంచి స్ఫూర్తి పొంది తానూ ఓ షూటర్‌గా రాణించాలనుకుంది. సుమా శిశిర్‌ అనే కోచ్‌ నేతృత్వంలో తన 15వ ఏట ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో శిక్షణ పొందడం ప్రారంభించింది. ఈ ఏడాది జరిగిన పారా ఒలింపిక్‌ క్రీడల్లో రెండు మెడల్స్‌ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు... ఒకే పారా ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు పొందిన తొలి మహిళగానూ రికార్డులకెక్కింది. పది మీటర్ల రైఫిల్‌ విభాగంలో బంగారు పతకంతో పాటు 50 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది. దేశ కీర్తిపతాకను సగర్వంగా నిలిపిన అవని ప్రస్తుతం అసిస్టెంట్‌ ఫారెస్ట్‌  కన్‌సర్వేటర్‌  (ఏసీఎఫ్‌)గా పనిచేస్తోంది.

‘బ్యూటీ’ఫుల్‌ విజయం
ఫాల్గుణి నాయర్‌ (58)
► మల్టీ–బ్రాండ్‌ బ్యూటీ రిటైలర్‌ ‘నైకా’ వ్యవస్థాపకురాలు.

► సరైన శిక్షణ, చదువు, మద్దతు ఉంటే మహిళలు ఎంత ఎత్తుకైనా చేరుకోగలరు, దేనినైనా సాధించగలరు అనడానికి నిలువెత్తు నిదర్శనం. అత్యంత తక్కువ మొత్తంతో ప్రారంభించిన సౌందర్య ఉత్పత్తుల సామ్రాజ్యం నైకా ఆమెను దేశంలోని తొలి 20 మంది సంపన్నుల జాబితాలో నిలిపింది.

► తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొని ఎదిగిన మహిళగా పేరున్న ఫాల్గుణి నాయర్‌ గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగిన ముంబయ్‌వాసి. ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. కోటక్‌ మహింద్ర గ్రూప్‌లో 20 ఏళ్లు పనిచేసిన అనుభవం ఆమెది. ఆ తర్వాత సేవింగ్‌ మనీ బిజినెస్‌కు సంబంధించిన కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2012లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ‘నైకా’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించింది. మేకప్‌ పట్ల ఉన్న ప్రేమతో ఆమె ఎంచుకున్న ఈ వ్యాపార మార్గం భారతదేశంలో ఆన్‌లైన్‌ మార్కెట్‌కు కొత్త ఒరవడిని సృష్టించింది.

► ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన ఫాల్గుణి నాయర్‌ వారు ఎదిగి, పైచదువుల కోసం అమెరికా వెళ్లాక ఉన్న ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నారు. ‘నేను మంచి స్విమ్మర్‌ను కాదు. కానీ, ముందు దూకేస్తాను. ఆ సమయంలో కాలో చెయ్యో విరిగితే ఎలా? అనే ఆలోచనే నాకు రాదు’ అంటూ చిరునవ్వులు చిందిస్తారు. ఆమె విజయంతో పోల్చుతూ ఇతర మహిళల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే – ‘మహిళలు సాఫ్ట్‌ స్కిల్స్‌తో పాటు అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, అవసరమైన సమాచారాన్ని పొందడంతో పాటు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యం కూడా పెంచుకోవాలి. అప్పుడు ఎంతటి ఎల్తైన శిఖరాలైనా అవలీలగా అధిరోహిస్తారు’ అంటారు ఫాల్గుణి. కేవలం ఎనిమిదేళ్లలో సాధించిన ఆమె వ్యాపార ఘనత గురించి అంతర్జాతీయంగానూ అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందారు.

‘మిస్‌’ కిరీటం
మానసా వారణాసి (24)
► ఫెమినా నిర్వహించిన అందాల పోటీల్లో గెలిచిన ‘మిస్‌ ఇండియా (వరల్డ్‌) 2020 పెజంట్‌’ కిరీటధారి. రాబోయే ఏడాది ప్యూయెర్టో దీవిలోని సాన్‌ జాన్‌ నగరంలో జరిగే ‘మిస్‌ వరల్డ్‌ 2021 పెజెంట్‌’లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. (కరోనా కారణంగా ఈ పోటీల నిర్వహణ ఆలస్యమైంది).

► ఈ తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టింది, మలేసియాలో పెరిగింది. కాలేజ్‌ చదువుకి తిరిగి హైదరాబాద్‌ వచ్చిన మానస కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ చేసి, ఫైనాన్షియల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఎక్సే్ఛంజ్‌ ఎనలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది. సంగీతం, డాన్స్, యోగా సాధన, మోడలింగ్‌ ఆమె హాబీలు. అందాల పోటీల మీద ఆమెకు కాలేజ్‌ రోజుల్లోనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌లో ‘మిస్‌ ఫ్రెషర్‌’ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఫెమినా ‘మిస్‌ ఇండియా’ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయిలో జరిగిన పోటీల్లో మానసా వారణాసి విజయం సాధించి ‘మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020’ అందాల కిరీటానికి తలవంచింది. ఈ పోటీల్లో జరిగిన అనేక ఈవెంట్‌లలో ఆమె ‘మిస్‌ ర్యాంప్‌వాక్‌’ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

► అందాల పోటీ విజేతలు నిర్వర్తించాల్సిన సామాజిక బాధ్యతల్లో భాగంగా మానసా వారణాసి పిల్లల రక్షణ చట్టాల పటిష్టత కోసం పని చేయనుంది. ఇందులో భాగంగా ‘వియ్‌ కెన్‌’ పేరుతో పిల్లల మీద లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

తొలి తెలుగు వాణిజ్య వ్యోమగామి
బండ్ల శిరీష (34)
► ఇండియన్‌ అమెరికన్‌ ఏరోనాటికల్‌ ఇంజినీర్‌. వాణిజ్య వ్యోమగామి. వర్జిన్‌ గెలాక్టిక్‌ అధినేతతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లిన తెలుగు సంతతి అమ్మాయి. అంతరిక్ష రేఖ దాటిన రాకేష్‌శర్మ, కల్పనా చావ్లా, సునితా విలియమ్స్‌ తర్వాత నాల్గవ భారతీయురాలుగా బండ్ల శిరీష గుర్తింపు పొందారు.

► గుంటూరు జిల్లాలో పుట్టిన శిరీష ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని హ్యూస్టన్‌ వెళ్లి, అక్కడే చదువు పూర్తి చేశారు. అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పొందారు. ఆ తర్వాత బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. నాసా వ్యోమగామి  కావాలనుకున్నా, కంటిచూపులో వైద్యపరమైన కారణాలతో తన ఆశకు దూరమైంది. 2015లో వర్జిన్‌ గెలాక్టిక్‌లో చేరి, అందులో ప్రభుత్వ వ్యవహారాల వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. జూలై 2021 ఆదివారం నాడు బండ్ల శీరిష వర్జిన్‌ గెలాక్టిక్‌ యూనిటీ 22 టెస్ట్‌ ఫై్టట్‌లో ఆరుగురు సభ్యుల బృందంతో కలిసి అంతరిక్షయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. దీనితో శిరీష ‘ఫెడరల్‌ ఏవిషయన్‌ అథారిటీ’ స్పేస్‌ టూరిస్ట్‌ జాబితాలో నిలిచారు.

అంతరిక్షంలో విజయ కేతనం  
స్వాతి మోహన్‌ (38)
► భారత సంతతికి చెందిన అమెరికన్‌ ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ స్వాతి మోహన్‌. నాసా ప్రయోగించిన రోవర్‌ని మార్స్‌పైన విజయవంతంగా ల్యాండ్‌ చేయడంలో మిషన్‌ గైడెన్స్, కంట్రోల్స్‌ ఆపరేషన్స్‌ లీడర్‌గా సమర్థంగా నిర్వహించారు.

► బెంగుళూరులో పుట్టిన స్వాతి ఏడాది వయసులోనే ఆమె తల్లిదండ్రులతో అమెరికా వెళ్లారు. స్వాతి 9వ యేట టీవీలో స్టార్‌ ట్రెక్‌ చూసి, అంతరిక్షంపై ఎనలేని ఆసక్తి చూపించారు. పిల్లల డాక్టర్‌ కావాలనుకుని 16 ఏళ్ల వయసులో ఫిజిక్స్‌ను ఎంచుకున్నా, ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనే వృత్తిగా కొనసాగించడానికి మార్గమైన ఇంజనీరింగ్‌ చదవాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్స్‌ డిగ్రీ, పిహెచ్‌డి పూర్తి చేయడానికి ముందు కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో మెకానికల్, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.

► ప్రొఫెసర్‌ డేవ్‌ మిల్లర్‌తో కలిసి స్పేస్‌ సిస్టమ్స్‌ లాబొరేటరీలో ఆన్‌–ఆర్బిట్‌ కార్యకలాపాలపై  విస్తృత పరిశోధనలు చేశారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో అనేక పరీక్షలను నిర్వహించారు. పూర్వ విద్యార్థుల వ్యోమగాములతోనూ, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం స్పేర్స్‌ జీరో రోబోటిక్స్‌ పోటీలో కూడా పనిచేశారు. కాలిఫోర్నియాలోని పసాదేనాలో నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీలో పనిచేస్తున్నారు స్వాతిమోహన్‌.

2013లో రోవర్‌ను మోసుకెళ్లే అంతరిక్ష నౌక అంగారక గ్రహానికి ప్రయాణించేటప్పుడు, గ్రహం ఉపరితలంపై ల్యాండింగ్‌ చేసేటప్పుడు సరైన దిశలో ఉండేలా చూసుకునే బాధ్యతను పోషించారు. ఫిబ్రవరి 18, 2021న అంగారకుడిపై పెర్‌సెవెరెన్స్‌ రోవర్‌ ల్యాండ్‌ అయినప్పుడు మిషన్‌ను కంట్రోల్‌ నుంచి ల్యాండింగ్‌ ఈవెంట్‌లను వివరించారు. ఆమె ‘టచ్‌ డౌన్‌ కన్ఫర్మ్‌’ అని ప్రకటించగానే జెపిఎల్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సంబరాలు మిన్నంటాయి. చప్పట్ల హోరుతో ఆమెకు అభినందనలు తెలిపారు. గతంలో, స్వాతి మోహన్‌ శని గ్రహానికి సంబంధించిన కాస్సిని మిషన్‌లో పనిచేశారు. అలాగే చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రాన్ని మ్యాప్‌ చేయడంలో అంతరిక్ష నౌక గ్రెయిల్‌కు బాధ్యత వహించారు.

నడిచే వన దేవత
తులసీ గౌడ (72)
► కర్ణాటకలోని హలక్కీ తెగకు చెందిన గిరిజన మహిళ తులసీ గౌడను దేశంలో నాలుగో అత్యున్నత పురస్కారమైన ‘పద్మశీ’ వరించింది. తులసీ గౌడ పెద్ద చదువులు చదువుకోలేదు. ఆ మాటకొస్తే బడి చదువు కూడా పూర్తి చేయలేదు. అయితేనేం, నడిచే వనదేవతగా, ఔషధ మొక్కలు, భిన్నమైన జాతుల గురించి విశేషమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా పేరు పొందారు.

► పేదవాళ్లయిన ఆమె తల్లిదండ్రులు కనీసం పెళ్లి చేసి ఓ అయ్య చే తిలో పెడితే అయినా కడుపునిండా అన్నం తినగలదనే ఉద్దేశంతో పదకొండేళ్ల్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లయిన కొద్దికాలానికే ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు కుంగిపోకుండా ఆమె 12 ఏళ్ల వయస్సున్నప్పటి నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. అటవీశాఖలో టెంపరరీ వాలంటీర్‌గా చేరింది. ప్రకృతిపై ఆమెకున్న అంకితభావమే ఆ తర్వాత అదే డిపార్ట్‌మెంట్‌లో ఆమె ఉద్యోగాన్ని సుస్థిరం చేసింది. ఏకంగా 40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే నెలకొల్పిందామె. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే.. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకునేందుకు తోడ్పడింది.

► ఈ వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటుతారు. నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను మొత్తాన్ని కూడా ఇందుకే ఖర్చు చేస్తున్నారామె. టేకు మొక్కల పెంపకంతో మొదలైన ఆమె ప్రస్థానం పనస, నంది, ఇంకా పెద్ద వృక్షాలు పెంచే వరకూ వెళ్లింది. కేవలం మొక్క నాటితేనే సంతృప్తి రాదు.. అది కొత్త చివుళ్లు పెట్టి శాఖోపశాఖలుగా విస్తరించి మానుగా మారితేనే ఆనందం అని చెప్పే తులసి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం.

‘యూపీఎస్‌సీ’లో రెండో స్థానం
జాగృతి అవస్థి (24)

► యూపీఎస్‌సీ పరీక్షల్లో దేశంలోనే రెండో ర్యాంకర్‌గా నిలిచింది. ఇక మహిళల్లోనైతే ఆమెదే ఫస్ట్‌ ర్యాంక్‌.

► భోపాల్‌కు చెందిన 24 ఏళ్ల జాగృతి అవస్థి ఓ సాధారణ మధ్యతరగతి మహిళ. తండ్రి ప్రభుత్వ హోమియో మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌. తల్లి మధులత సాధారణ గృహిణి.  మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (మానిట్‌) నుంచి 2017లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసింది జాగృతి. ప్రతిష్ఠాత్మకమైన ‘గేట్‌’ పరీక్షలోనూ మంచి ర్యాంక్‌ సాధించింది. తొలుత బీహెచ్‌ఈఎల్‌ (భోపాల్‌)లో ఇంజనీర్‌గా చేరింది. రెండేళ్లపాటు పనిచేశాక యూపీఎస్‌ఈ పరీక్షల కోసం పూర్తికాలం కేటాయించాలకుంది. మొదట్లో ఢిల్లీ వెళ్లి కోచింగ్‌ తీసుకుందామని అనుకుంది. కానీ కరోనా కారణంగా ఇంటి దగ్గరే శ్రద్ధగా చదివింది. తల్లిదండ్రులూ ఎంతగానో ప్రోత్సహించారు. దేశానికి ఎలాంటి సేవలందిస్తావంటూ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... ‘మన దేశం పల్లెపట్టులకు నెలవైన ప్రదేశం. అందుకే గ్రామీణాభివృద్ధే తన లక్ష్యం’ అంటూ వినమ్రంగా చెప్పింది జాగృతి.

గర్జించిన కంఠం  
స్నేహా దూబే (28)
► ఘనత: ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శి. ‘ఐరాస’ వేదికపై ‘పాక్‌’పై నిప్పులు కురిపించి దీటైన జవాబు చెప్పడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

► కొన్నిసార్లు ‘మాటలు’ కూడా తూటాల కంటే శక్తిమంతంగా పేలుతాయని అంతర్జాతీయ వేదికగా నిరూపించింది స్నేహా దూబే.

► ‘ఉగ్రవాద బాధిత దేశం మాది అని చెప్పుకుంటున్న పాకిస్థాన్‌ మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. తన ఇంటికి తానే నిప్పు పెట్టుకొని ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోంది’ అంటూ యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ(యూఎన్‌జీఏ)లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

► ‘పాక్‌’ మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేసిన ఆమె మాటలు సోషల్‌ మీడియాలో బాగా  వైరల్‌ అయ్యాయి. ‘ఎవరీ స్నేహ?’ అని  ఆరా తీసేలా చేశాయి.

► గోవాలో పుట్టిన స్నేహ అక్కడ పాఠశాల విద్య, పుణేలో కాలేజి విద్య పూర్తి చేసింది. దిల్లీ జేఎన్‌యూ, స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీ నుంచి ఎంఫిల్‌ పట్టా తీసుకుంది. 2012 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఆఫీసర్‌ అయిన స్నేహా దూబే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి (యూఎన్‌)లో భారతదేశం మొదటి కార్యదర్శి.

► పన్నెండు సంవత్సరాల వయసులో సివిల్‌ సర్వీస్‌ గురించి గొప్పగా విన్నది స్నేహ. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, ప్రపంచంలోని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే తనకు మొదటి నుంచి ఆసక్తి. ఈ ఆసక్తే తనను ‘ఐఎఫ్‌ఎస్‌’ను ఎంచుకునేలా  చేసింది. ఏ సివిల్స్‌ పరీక్షలు పూరై్త, ఇంటర్వ్యూకు వెళ్లే ముందు, ఇంట్లోని అద్దం ముందు నిల్చొని గట్టిగా మాట్లాడుతూ బాడీలాంగ్వేజ్‌ను పరిశీలించుకుంటూ తనలోని బెరుకును పోగొట్టుకున్నది స్నేహ.

విశ్వ సౌందర్యం
హర్నాజ్‌ కౌర్‌ సంధూ (21)
► రెండు దశాబ్దాల తర్వాత మన దేశానికి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సాధించిన అందాల యువతి.

► ఇజ్రాయెల్‌లోని ఇల్లియాట్‌లో డిసెంబర్‌ 14న జరిగిన 70వ అందాల పోటీల్లో భారత యువతి హర్నాజ్‌ సంధూ మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె కంటే ముందు లారా దత్తా 2000వ సంవత్సరంలో ఈ టైటిల్‌ను అందుకోగా, తిరిగి  21 ఏళ్ల తర్వాత çహర్నాజ్‌ కౌర్‌ సంధూను వరించింది.

► పంజాబ్‌ ప్రాంతానికి చెందిన హర్నాజ్‌ కౌర్‌ సంధూ తనకెంతో ఇష్టమైన మోడలింగ్‌లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ కన్నా ముందు ఆమె మిస్‌ దివా 2021 కిరీటాన్ని గెలుచుకుంది. గతంలో ఫెమినా మిస్‌ ఇండియా పంజాబ్‌ 2019 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫెమినా మిస్‌ ఇండియా 2019లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది.

► మార్చి 3, 2000 చంఢీగఢ్‌లో జన్మించిన సంధూ శివాలిక్‌ పబ్లిక్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది.

► ఐదడుగుల తొమ్మిందంగుళాల పొడవున్న సంధూ, మానసిక సౌందర్యంలోనూ మిన్న అని నిరూపించుకుని ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన విశ్వసుందరి పోటీలో విజయం సాధించింది. 

A post shared by Miss Universe (@missuniverse)

మరిన్ని వార్తలు