Royal Ascot 2022: ఒకేచోట... వెయ్యి ఇంద్రధనుస్సుల పాట!

18 Jun, 2022 14:03 IST|Sakshi

పట్టుచీర కట్టుబడికి పట్టుపురుగు జన్మ ధన్యమైందో లేదోగానీ... ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ ఉత్సవంలో చీరలు ధరించి వచ్చిన మహిళల మనోహర దృశ్యం ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. భారతీయ నేతకళలలోని గొప్పతనాన్ని ఘనంగా, సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పింది...

ఇంగ్లాండ్‌లో ‘రాయల్‌ ఎస్కాట్‌’ అనేది చారిత్రకంగా ప్రసిద్ధిపొందిన అయిదురోజుల ఉత్సవం. ఈ ఉత్సవానికి రాజకుటుంబీకులు హాజరవుతారు. ‘రాయల్‌ ఎస్కాట్‌ 2022’ (బెర్క్‌షైర్‌)లో లేడిస్‌ డే కార్యక్రమం ఈసారి చరిత్రను సృష్టించింది. దీనికి కారణం... ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ మూలాలు ఉన్న వెయ్యిమంది మహిళలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చీరలను ధరించి వచ్చారు. భారతీయ సంస్కృతిని ఘనంగా, సగౌరవంగా ప్రతిబింబించారు.

కోల్‌కత్తా నుంచి వచ్చి లండన్‌లో స్థిరపడిన దీప్తి జైన్‌ మొదట ఈ చీరల ప్రతిపాదన చేశారు. ఆమె ప్రతిపాదనకు అందరూ సంతోషంగా ఓకే చెప్పి, భారత్‌లోని తమ ప్రాంత ప్రసిద్ధ చీరలతో ఉత్సవానికి వచ్చారు.

దీప్తి జైన్‌ పశ్చిమబెంగాల్‌లో ప్రసిద్ధమైన ‘కాంతా వర్క్‌’ చీర ధరించి వచ్చారు. ఆకట్టుకునే ఎంబ్రాయిడరీతో కూడిన సిల్క్‌ చీర అది. ఈ చీరను వినూత్నంగా డిజైన్‌ చేసిన రూపా ఖాతున్‌కు ‘రాయల్‌ ఎస్కాట్‌’ గురించి ఏమీ తెలియదు. అయితే ఆమె ప్రతిభ గురించి మాత్రం ఇక్కడ గొప్పగా మాట్లాడుకున్నారు.

మీడియా ప్రొఫెషన్‌లో ఉన్న సంచిత భట్టాచార్య మధుబని చీర ధరించి వచ్చారు. ఈ పెయింటింగ్‌ చీర ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇంజనీర్‌ చీనూ కిశోర్‌ అస్సామీ సంప్రదాయ చీర ‘మెఖల చాదర్‌’తో వచ్చారు.తాను డిజైన్‌ చేసిన ‘కాంతా వర్క్‌’ చీరకు మంచి పేరు రావడంతో ఆనందంలో మునిగిపోయింది పశ్చిమబెంగాల్‌లోని ననూర్‌ గ్రామానికి చెందిన రూప ఖాతున్‌. ఈ చీరల డిజైనింగ్, తయారీల గురించి ఆమె ప్రత్యేకంగా ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. అమ్మమ్మ, అమ్మల దగ్గర నుంచి ఆ విద్యను నేర్చుకుంది.

‘ఈ చీర తయారీ కోసం నాలుగు నెలల పాటు కష్టపడ్డాను. ఇతర మహిళల సహాయం తీసుకున్నాను. మా పనికి అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడం గర్వంగా అనిపిస్తుంది’ అంటుంది రూప.
మధుబని చీరను డిజైన్‌ చేసిన బిహార్‌లోని దర్భంగ ప్రాంతానికి చెందిన ఛోటీ ఠాకూర్‌పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.

‘ఇందులో నేను కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. ఇదంతా మధుబనీ కళలోని గొప్పతనం’ వినమ్రంగా అంటుంది చోటి. నిజానికి ఈ ఉత్సవంలో ప్రతి చీర ఒక కథను చెప్పింది. ఆ కథలో రూప, ఛోటీలాంటి అసాధారణమైన ప్రతిభ ఉన్న సామాన్య కళాకారులు ఎందరో ఉన్నారు. వారి సృజన ఉంది. స్థూలంగా చెప్పాలంటే విభిన్నమైన అందాలతో వెలిగిపోయే భారతీయ సంస్కృతి ఉంది. ఈ ఉత్సావానికి హాజరైన ఒకరు కవితాత్మకంగా అన్నారు ఇలా:  ‘వెయ్యి ఇంద్రధనుసులు మధురమైన సంగీత కచేరి చేసినట్లుగా ఉంది’ వాహ్‌! 

మరిన్ని వార్తలు