పల్లెకు పోదాం చలో చలో.. రివర్స్‌ మైగ్రేషన్‌కు మోడల్‌గా నిలిచిన మన్‌దీప్‌ కౌర్‌

14 May, 2022 15:07 IST|Sakshi

కొత్త దారి

పట్టణాల్లో ఉపాధి వెదుక్కుంటూ చాలామంది పట్నం బాట పడుతుంటే, పల్లెకళ మాయమవుతోంది. ఏ మూల చూసినా నిరుపేద నిశ్శబ్దం. అలాంటి పల్లెల్లో పంజాబ్‌లోని తంగ్రా కూడా ఒకటి. ఒకప్పుడు ఈ మారుమూల గ్రామం గురించి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు తెలుసో తెలియదుగానీ మన్‌దీప్‌కౌర్‌ పుణ్యమా అని ఇప్పుడు చాలా ప్రసిద్ధి పొందింది. ‘రివర్స్‌ మైగ్రేషన్‌’కు మోడల్‌గా నిలిచింది. ‘రూరల్‌ ఐటి మోడల్‌’ కాన్సెప్ట్‌కు అపారమైన బలాన్ని ఇచ్చింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మన్‌దీప్‌ చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది. ‘మన జీవితాలు మారాలంటే చదువు తప్ప మరోదారి లేదు’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు.

జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన మన్‌దీప్‌కు రహేజా గ్రూప్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం పాతికవేలు. ఆ తరువాత... బ్యాంకాక్‌కు చెందిన ప్రసిద్ధనగల కంపెనీలో ఉద్యోగం చేసింది. అక్కడ మార్కెటింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది. వివాహం తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో పాటు అమెరికా వెళ్లింది కౌర్‌. భర్త  ఐటీ ప్రొఫెషనల్‌. అక్కడ ఉన్నప్పుడు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేసింది.

తన ఆలోచనను భర్తతో పంచుకుంటే ఆయన సానుకూలంగా స్పందించారు. అలా ‘శింబాక్వార్జ్‌’  రూపంలో తొలి అడుగుపడింది. ఈ ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ సక్సెస్‌ అయింది. కొన్ని సంవత్సరాల తరువాత స్వదేశానికి తిరిగివచ్చిన కౌర్‌ తన స్వగ్రామం తంగ్రాలో ‘శింబాక్వార్జ్‌’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. పల్లెటూరిలో ఐటీ కంపెనీ ఏమిటి! అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకురాలేదు. మౌలిక వసతుల లేమి అనేది మరో సమస్య. అయితే ఆమె సంకల్పబలానికి ఇవేమీ అడ్డుకాలేదు. తన సేవింగ్స్‌తో కంపెనీ మొదలుపెట్టింది. ప్రారంభంలో ముగ్గురు ఉద్యోగులు ఉండేవారు. 

ఐఐటీ, ఐఐఎంఎస్‌ క్యాంపస్‌లలో నుంచి చురుకైన స్టూడెంట్స్‌ను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్నారు. తంగ్రా గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువతీ,యువకులు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తమ ఊళ్లోనే, తమ దగ్గరి ఊళ్లోనే ఐటీ కంపెనీ మొదలైందని తెలిసి కొద్దిమంది చేరారు. అలా కంపెనీ ప్రస్థానం మొదలైంది. కొద్దికాలంలోనే మొబైల్‌ అండ్‌ వెబ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, గ్రాఫిక్‌ డిజైన్, వీడియో ఎడిటింగ్, కన్సల్టేషన్, డిజిటల్‌ మార్కెటింగ్‌ సర్వీస్‌...మొదలైన విభాగాల్లో ‘శింబాక్వార్జ్‌’ దూసుకుపోయింది. ఉద్యోగుల సంఖ్య వందకు పెరిగింది. కంపెనీ పుణ్యమా అని ఊళ్లో సందడి పెరిగింది. కొత్త కళ వచ్చింది. అయితే కరోనా కఠోర సమయంలో పెద్ద సవాలు ఎదురైంది.

పెద్ద పెద్ద కంపెనీలే ఉద్యోగులను తొలిగిస్తూనో, జీతాలు బాగా తగ్గిస్తూనో ఉన్న కాలం అది. ‘శింబా’ కంపెనీ సంక్షోభంలోకి వెళ్లింది. ‘అలాంటి కఠిన సమయంలోనూ ఏ ఒక్క ఉద్యోగిని కంపెనీ నుంచి తీసివేయాలని, జీతం తగ్గించాలనుకోలేదు. ఎందుకంటే నన్ను నమ్మి ఎన్నో కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. అవసరం అయితే జీరో నుంచి మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్‌.

గడ్డుకాలం పూర్తయిన తరువాత... కంపెనీ మళ్లీ ఊపందుకుంది.  ‘స్మైల్స్‌ కేర్‌’ అనే స్వచ్చంద సంస్థను నెలకొల్పి గ్రామాలలోని అట్టడుగువర్గాల ప్రజలకు సేవ చేస్తుంది కౌర్‌. మరోవైపు మోటివేషనల్‌ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖాముఖీ సమావేశం అయిన మన్‌దీప్‌కౌర్, ఆయన నుంచి ప్రశంసలు అందుకుంది.
 

మరిన్ని వార్తలు