Sabita Mahato and Shruti Rawat: కూతురి కోసం సందేశం..

24 Nov, 2021 01:03 IST|Sakshi
శ్రుతి రావత్‌తో కలిసి సబిత

సైకిల్‌ తొక్కుతూ దేశమంతా తిరుగుతూ ‘కూతుళ్లను రక్షించండి, వారిని చదివించండి’ అనే సందేశం ఇవ్వడానికి మూడేళ్ల క్రితమే ఈ సోలో సైకిలిస్ట్‌ దేశమంతా పర్యటించింది. 173 రోజుల్లో 12,500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి 29 రాష్ట్రాలను చుట్టి వచ్చింది. రాబోయే సంవత్సరం ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి, తన సందేశాన్ని శిఖరాగ్రాన ఉంచాలనుకుంది 24 ఏళ్ల సబితా మహతో.

బీహార్‌ వాసి అయిన సబిత మూడేళ్ల క్రితం తన మొదటి యాత్రను జమ్మూ కాశ్మీర్‌ నుండి ప్రారంభించి, దక్షిణాన కేరళ, తమిళనాడులను చేరుకుని, అటు తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లింది. చివరకు సిక్కిం మీదుగా పాట్నా చేరుకుంది. దారిలో అన్ని ప్రదేశాలలోనూ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటూ సైకిల్‌పై 12 వేల 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. గత ఫిబ్రవరిలో మరో సైకిలిస్ట్‌ శ్రుతి రావత్‌తో కలిసి 85 రోజుల్లో 5,800 కిలోమీటర్లు నేపాల్‌ మీదుగా హిమాలయన్‌ సైక్లింగ్‌ టూర్‌ను ప్రారంభించిన సబిత ఈ పర్యటననూ దిగ్విజయంగా పూర్తిచేసింది. లింగ సమానత్వం, పర్యావరణం గురించి పాఠశాల విద్యార్థులతో చర్చించాలనే ఆశయంతో ఇప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది.

అడగడుగునా ఆహ్వానాలు..
సబిత తన ప్రయాణ అనుభవాల గురించి వివరిస్తూ ‘అడవి గుండా వెళుతున్నప్పుడు కూడా నా నినాదాన్ని వదిలిపెట్టలేదు. ‘కూతురుని రక్షించండి. చదివించండి.’ అనే సందేశాన్ని ప్రజలకు ఇస్తూ ఉన్నాను. వెళ్లిన ప్రతి చోటా ఆ ప్రాంతవాసుల ఆదరాభిమానాలు పొందాను. సైకిల్‌ ప్రయాణంలో నేను బీహార్‌ వాసినని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోయారు. శ్రుతి రావత్‌తో కలిసి చేసిన పర్యటనలో ఇవే అనుభవాలను చవిచూశాను. ఎక్కడకెళ్లినా, అక్కడి ప్రజలు నన్ను ఆదరించిన తీరు మాత్రం మర్చిపోలేను.’ అని తన పర్యటన విశేషాలు సంతోషంగా తెలియజేస్తుంది.

పేదరికంలో పెరిగినా..
సబిత మత్స్యకారుల కుటుంబంలో పుట్టింది. పేదరికంలోనూ పెద్ద కలలు కనేది. తనకు చిన్నతనంలోనే పెళ్లి చేయబోతే నిరోధించింది, షార్ట్స్‌ వేసుకొని సైకిల్‌ తొక్కుతూ తిరిగేది. దీంతో తండ్రి ఆమెను ఎప్పుడూ ‘జనం ఏమనుకుంటారు’ అని అంటూ వెనకడుగు వేసేలా చేసేశాడు. కానీ, అవేమీ పట్టించుకోలేదు సబిత. స్కూల్లో ఉన్న ఇతర అమ్మాయిల బాల్యవివాహాలనూ అడ్డుకుంది. ‘కూతుళ్లను చదివించండి..’ అనే నినాదంతో సబిత మొదలుపెట్టిన సైకిల్‌ ప్రయాణానికి పాఠశాల యాజమాన్యం కూడా సాయం చేసింది. భూమికి ఏడున్నరవేల మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని సంతోపత్‌ పర్వతంపై సబిత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ‘నిరంతరం నా ప్రయాణం అమ్మాయిల్లో అవగాహన పెంచడం కోసమే’ అంటుంది సబిత.

శ్రుతి రావత్‌తో కలిసి..
డార్జిలింగ్‌లో ఉండే శ్రుతి రావత్‌ ఈ యేడాదే డిగ్రీ పూర్తి చేసింది. సైకిల్‌ రైడింగ్‌ అంటే తనకు చాలా ఇష్టం. సైకిల్‌ రైడర్స్‌ గురించి తెలుసుకున్నప్పుడు సబిత పరిచయమై, ఆమె తన యాత్ర గురించి చెప్పినప్పుడు ఈ పర్యటనలో పాల్గొనాలన్న ఆలోచన తనకూ కలిగింది.

‘‘మొదట్లో నేను ఎక్కువ దూరం సోలోగా ప్రయాణించలేదు. క్రీడాకారిణిని కూడా కాదు. రోజూ ఏడు గంటలు సైకిల్‌పై ప్రయాణం చేయడం అప్పట్లో కష్టంగా అనిపించేది. కానీ, సబిత ఇచ్చిన శిక్షణ నాలో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించే సైకిల్‌ యాత్ర చీకటి పడటంతో ముగుస్తుంది. బీహార్‌ నుంచి ఇతర రాష్ట్రాల మీదుగా ఉత్తరాఖండ్‌ అటు నుంచి ట్రాన్స్‌ హిమాలయాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. మా ప్రయాణంలో ముందే భోజన, వసతి సదుపాయాల ప్లానింగ్‌ కూడా ఉండేది. దాంతో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇంట్లో కూర్చుంటే బయటి ప్రపంచం అంతా అమ్మాయిలకు రక్షణ లేనిదిగానే ఉంటుంది. కానీ, బయటకు వచ్చి చూస్తే ఎంతో అద్భుత ప్రపంచం కనిపిస్తుంది’’ అని తమ యాత్రానుభవాలను పంచుకుంది శ్రుతి.            

మరిన్ని వార్తలు