మేకప్‌ ఆర్టిస్టు.. నెలకు రూ. 4 లక్షల ఆదాయం

30 Jan, 2021 08:34 IST|Sakshi

చక్కదనానికి మొక్కల ఉత్పత్తులు

ఫుట్‌వేర్‌‌: పాదాలను లాక్‌ చేద్దాం..

ఆభరణం: కలంకారీ కళల హారం

బెంగళూరు: సౌందర్య ఉత్పాదనలు జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేస్తారని తెలుసుకున్న సబ్రినా మొదట ఆశ్చర్యపోయింది. అందాన్ని పెంచే సుగుణాలు గల ఔషద మొక్కలు ఉంటే జంతువులకు హాని కలిగించే అవసరం ఏమిటి అని ఆలోచించింది. దీంతో సౌందర్య ఉత్పాదనల్లో మొక్కల గురించి పరిశోధనలు చేసింది. వేగన్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లోకి తీసుకువచ్చి, నెలకు 4 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. సబ్రినా సుహైల్‌ బెంగళూరు వాసి. మేకప్‌ ఆరిస్ట్‌గా15 ఏళ్ల అనుభవం ఉంది. మేకప్‌లో వాడే ఉత్పాదనల గురించి ఆమెకు ఎప్పుడూ సందేహం రాలేదు.

అయితే, ఏడేళ్ల క్రితం ఓ రోజు సౌందర్య ఉత్పాదనల్లో జంతువుల నుంచి తీసిన కొవ్వులను ఉపయోగిస్తారని తెలుసుకుంది. అందాన్ని పెంచే ఎన్నో రకాల ఔషధ మొక్కలు భూమి మీద ఉండగా జంతువులకు హాని కలిగించడం ఎందుకు అనుకుంది. అందుకు తను చదివి కెమిస్ట్రీ, వృక్షశాస్త్ర అధ్యయనాలు ఆమెకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ పరిశోధనల తర్వాత 2014లో కాస్మెటిక్‌ బ్రాండ్‌ ‘టిన్జ్‌’ పేరుతో బెంగుళూరులో బ్యూటీ ప్రొడక్ట్స్‌ స్టార్టప్‌ ప్రారంభించింది. మొదటి మూడేళ్లలో క్లీన్‌ బ్యూటీ ఉత్పత్తులపై మరింతగా పరిశోధనలు చేసి వ్యాపారం కోసం లైసెన్స్‌ పొందింది.

2018 లో అధికారికంగా నమోదు అయిన తరువాత, కస్టమర్‌ డిమాండ్‌ మేరకు సబ్రినా తన సౌందర్య ఉత్పత్తులలో నచ్చిన రంగు, సువాసనను వారే ఎంచుకునే మార్పులు కూడా తెచ్చింది. ఈ ఉత్పత్తులు కస్టమర్‌ ముందే తయారు చేయడం ప్రారంభించింది. ఒక దానిని అమ్మిన తర్వాత మరొక కస్టమర్‌ కోసం కొత్త ప్రొడక్ట్‌ని తయారుచేస్తుంది. ఈ విధంగా సబ్రినా స్టార్ట్‌ అప్‌ భారీ శ్రేణి వేగన్‌ ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో వేగన్‌ లిప్‌ బామ్, లిప్‌ స్టిక్, ఫౌండేషన్, కన్సీలర్‌ మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు తన బ్యూటీ ప్రొడక్ట్స్‌ ద్వారా ప్రతి నెలా 4 లక్షల రూపాయలను సంపాదిస్తుంది. 2018 – 2020 మధ్య ఆమె బ్యూటీ ప్రొడక్ట్స్‌ వ్యాపారం 40 శాతం పెరిగింది.

పాదాలను లాక్‌ చేద్దాం
ఇంటికి తాళం వేయడం తెలుసు. కానీ, పాదాలకు లాక్‌ వేయడం ఏంటి అనేదేగా మీ సందేహం. ఇక్కడ ఫుట్‌ వేర్‌ చూస్తుంటే ఇట్టే అర్ధమైపోతుంది. చెప్పులకు లాక్‌ మోడల్స్‌ జత చేసి, ఇలా విభిన్నంగా డిజైన్‌ చేశారు. కొంచెం రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉన్నామని చెప్పడానికి అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు లాక్‌ స్టైల్‌ మోడల్‌ ఫుట్‌వేర్‌తో మన చూపుల్ని లాక్‌ చేస్తున్నారు. అమ్మాయిల ఫుట్‌ వేర్‌లో ఎక్కువగా హైహీల్స్, శాండల్స్‌కి లాక్స్‌ ఉంటే అబ్బాయిల ఫుట్‌వేర్‌లో ప్లిప్‌ ఫ్లాప్స్, లెదర్‌ షూస్‌కి ఈ డిజైన్స్‌ కనువిందు చేస్తున్నాయి. 

కళల కలంకారీ
కలంకారీ ఫ్యాబ్రిక్‌ గురించి, ఆ ఆర్ట్‌ వర్క్‌ గురించి మనకు తెలిసిందే. నెమళ్లు, ఏనుగులు, బుద్ధుని రూపాలు, అమ్మవారి కళారూపం.. అన్నీ పెన్‌కలంకారీ కళ సొంతం. కలంకారీ చీరలైనా, డ్రెస్సులైనా ఒంటికి, కంటికి హాయినిస్తాయి. వాటిని ధరించిన వారిని అందంగా, హుందాగా కనిపించేలా చేస్తాయి. అందుకే, ఆభరణాల నిపుణులు ఈ కలంకారీ ఫ్యాబ్రిక్‌ను కూడా పట్టేసుకున్నారు. ఆభరణాలుగా రూపుకట్టేసుకున్నారు. తక్కువ ధరలో ఎక్కువ ఆకర్షణీయంగా డిజైన్‌ చేసి, చూపులను కొల్లగొట్టేస్తున్నారు. ఖాదీ, కాటన్‌ ఫ్యాబ్రిక్‌ డ్రెస్సులైనా, చీరల మీదకైనా ఎంతో అందంగా ప్రత్యేకంగా కనువిందు చేస్తున్న ఈ కలంకారీ ఆభరణాలు చెవి బుట్టలుగా, జూకాలుగా, మెడలో హారాలుగా, చేతి గాజులుగా అమరాయి. మువ్వలు, గవ్వలు, ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌.. ఇలా ఏ లోహంతో కలిసినా కలంకారీ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. వర్క్, డిజైన్‌ బట్టి ఇవి రూ.300/– నుంచి ధర పలుకుతున్నాయి.


 

మరిన్ని వార్తలు