సగ్గు బియ్యం పరాఠా, పొంగనాలు, ఢోక్లా

24 Jul, 2021 20:14 IST|Sakshi

వానలు పడుతుంటే వేడివేడిగా కరకరలాడే పదార్థాలు తినాలనిపిస్తుంది జిహ్వకు.. ఎప్పుడూ నూనెలో వేయించి తినాలంటే  కొంచెం ఇబ్బందే.. తక్కువ నూనెతో కరకరలాడే సగ్గు బియ్యం వంటకాలు చేసుకుని... వాన బిందువులను చూస్తూ, తియ్యటి గుండ్రటి సగ్గు బియ్యం బిందువుల వంటకాలు ఆస్వాదిద్దాం..


పరాఠా
కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పల్లీలు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4; ఉడికించిన బంగాళ దుంపలు – 2; కొత్తిమీర – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఉప్పు – తగినంత; నూనె/నెయ్యి – తగినంత

తయారీ: 
►ఒక పాత్రలో సగ్గు బియ్యం వేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నీరు వంపేయాలి 
►స్టౌ మీద బాణలిలో పల్లీలు వేసి బాగా వేయించి చల్లార్చాలి 
►మిక్సీ జార్‌లో పల్లీలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి వేసి బరకగా మిక్సీ పట్టి, సగ్గు బియ్యానికి జత చేయాలి 
►ఉడికించిన బంగాళ దుంపలను తురుముతూ జత చేయాలి 
►కొత్తిమీర, జీలకర్ర, ఎండు మిర్చి లేదా మిరప కారం, ఉప్పు జత చేసి బాగా కలపాలి 
►పాలిథిన్‌ కవర్‌ మీద కానీ, బటర్‌ పేపర్‌ మీద కానీ కొద్దిగా నూనె పూయాలి 
►తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, గుండ్రంగా రొట్టెలా ఒత్తాలి 
►స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి తయారుచేసి ఉంచుకున్న పరాఠాను వేసి నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీద కాలాక, రెండో వైపు తిప్పి, అటు వైపు కూడా మూడు నాలుగు నిమిషాలు కాల్చాక, ప్లేట్‌లోకి తీసుకోవాలి 
►పెరుగు చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.


ఢోక్లా

కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు (నానబెట్టాలి); సామలు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; మసాలా కారం – ఒక టీ స్పూను; (మిరప కారం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి కలిపితే మసాలా కారం)

తయారీ: 
► మిక్సీలో సగ్గు బియ్యం, సామలు, పెరుగు వేసి మెత్తగా చేయాలి 
► ఉప్పు జత చేసి దోసెల పిండిలా అయ్యేలా కలపాలి 
► స్టౌ మీద కుకర్‌లో నీళ్లు పోసి మరిగించాలి 
► ఈ లోగా ఒక స్టీల్‌ ప్లేట్‌కి నూనె పూసి, మసాలా కారం చిలకరించాలి 
► తయారు చేసి ఉంచుకున్న పిండిని సగం వేసి సమానంగా పరిచి, మరుగుతున్న నీళ్ల మీద ఒక ప్లేట్‌ ఉంచి, ఆ పైన ఈ ప్లేట్‌ ఉంచి, పైన పల్చటి వస్త్రం కప్పి, ఆ పైన మూత ఉంచాలి 
► 20 నిమిషాల తరవాత మంట ఆపి, మూత తీయాలి ∙ఇదే విధంగా మిగతా సగ భాగం కూడా తయారు చేయాలి 
► బాగా చల్లారాక ఒక ప్లేట్‌ లోకి ఆ ప్లేట్‌ను బోర్లించి జాగ్రత్తగా వేరు చేసి, ఆ పైన గ్రీన్‌ చట్నీ వేసి, ఆ పైన రెండో పొర ఉంచాలి 
►స్టౌ మీద బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు, పచ్చి మిర్చి తరుగు, ఇంగువ వేసి వేయించి దింపేయాలి 
►కరివేపాకు జత చేసి, బాగా కలిపి, ఢోక్లా మీద సమానంగా పోసి, నలు చదరంగా కట్‌ చేయాలి. 
(గ్రీన్‌ చట్నీ: మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పు, నల్ల ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి  మెత్తగా చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి 
►నిమ్మ రసం జత చేసి బాగా కలిపితే గ్రీన్‌ చట్నీ సిద్ధమవుతుంది)


పొంగనాలు
కావలసినవి: సగ్గు బియ్యం–ఒక కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – 2; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత

తయారీ: 
►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా సగ్గు బియ్యాన్ని రెండు నిమిషాలు ఆపకుండా కలుపుతూ వేయించాలి (తడి పోయి పొడి చేయడానికి వీలుగా ఉంటుంది) ∙ప్లేట్‌లో పోసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి 
►ఒక పాత్రలో సగ్గు బియ్యం పిండికి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, దోసెల పిండి కంటె కొద్దిగా గట్టిగా కలపాలి 
►ఒక పాత్రలో బంగాళదుంపలు వేసి మెత్తగా చేయాలి 
►సగ్గు బియ్యం పిండి జత చేసి కలపాలి 
►కొత్తిమీర తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు కలపాలి 
►అల్లం తురుము, జీలకర్ర, ఉప్పు జత చేసి మరోమారు బాగా కలపాలి 
►కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా అయ్యేలా కలిపి మూత ఉంచి, సుమారు అర గంట సేపు నానబెట్టాలి 
►స్టౌ మీద పొంగనాల స్టాండ్‌ ఉంచి, నూనె పూసి, ఒక్కో గుంటలోను తగినంత పిండి వేసి, మూత ఉంచాలి 
►మీడియం మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచాక, పొంగనాలను తిరగేసి, మరో ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి.  

మరిన్ని వార్తలు