అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. . మెట్ట రైతుకు అండ..

16 Mar, 2023 14:44 IST|Sakshi

అశ్వగంధ.. మెట్ట రైతుకు అండ..

అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట..

ఎరువులు, పురుగుమందులు అక్కర్లేదు

పశువులు, పక్షులు, అడవి జంతువుల బాధ లేదు 30 ఏళ్లుగా..

30 ఎకరాల్లో జీవీ కొండయ్య అశ్వగంధ సాగు కింగ్‌ ఆఫ్‌ ఆయుర్వేదగా పేరొందిన ఔషధ పంట అశ్వగంధ మెట్ట రైతులకు లాభాల సిరులను కురిపిస్తోంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో సంప్రదాయ పంటలను నమ్ముకొని ఏటా పంట నష్టంతో కుదేలైన జీవీ కొండయ్య అనే రైతు వినూత్నంగా ఆలోచించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం జీ.కొట్టాల గ్రామంలోని తన పొలంలో 30 ఏళ్ల క్రితం అశ్వగంధ సాగుకు శ్రీకారం చుట్టి లాభాలు గడిస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచారు.

కొండయ్యను ఆదర్శంగా తీసుకొని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎందరో రైతులు అశ్వగంధ సాగు చేపట్టారు. ఆయన సలహాలు, సూచనలు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. అశ్వగంధ పంటపై హైదరాబాదు బోడుప్పల్‌లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రం (సీమాప్‌)లో జరిగిన అవగాహన సదస్సు పాల్గొన్నారు.

శాస్త్రవేత్తలు చెప్పింది శ్రద్ధగా విన్న కొండయ్య ఆ సీజన్‌లోనే ఎకరాకు రూ.6 వేల ఖర్చుతో 5 ఎకరాల్లో అశ్వగంధను సాగు చేశారు. అతి తక్కువ వర్షపాతంలోనే పండే పంట ఇది. ఎటువంటి క్రిమి సంహారక మందులుగానీ, ఎరువులు గానీ వాడాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి సాధించారు. ఎకరాకు 3 క్వింటాళ్ల అశ్వగంధ వేర్ల దిగుబడి రావడంతో క్వింటాకు రూ.40 వేల వరకూ ఆదాయం పొందారు.

నాటి నుంచి కొండయ్య వెనుతిరిగి చూడలేదు. 5 ఎకరాలతో ప్రారంభించి 30 ఎకరాలకు విస్తరించారు. తనకున్న 8 ఎకరాలతో పాటు ఇతర రైతుల భూమిని కౌలుకు తీసుకొని, ప్రతి ఏడాదీ భూమి మారుస్తూ. అశ్వగంధను సాగు చేస్తున్నారు. అశ్వగంధ సాగులో మంచి దిగుబడి సాధించడంతోపాటు, నాణ్యమైన దిగుబడితో ప్రశంశలు అందుకుంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మెడిషినల్‌ బోర్డు నుంచి, లక్నోలోని ‘సీమాప్‌’తో పాటు ఢిల్లీ, జైపూర్‌లలో కూడా అవార్డులు సొంతం చేసుకున్నారు. 2 ఎకరాల్లో ఫారం పాడ్లు నిర్మించి, వర్షాభావ పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తూ వచ్చారు. కొండయ్యను చూసి సొంత గ్రామంతోపాటు రాయలసీమ జిల్లాల రైతులు పలువురు అశ్వగంధ సాగు చేస్తూ లాభాలు గడిస్తుండటం విశేషం.

మార్కెటింగ్‌ సమస్య లేదు అశ్వగంధ పంటను జూలైలో విత్తితే జనవరిలో పంట చేతికి వస్తుంది. వర్షపాతం అతితక్కువ ఉన్న ప్రాంతాలకే ఈ పంట అనుకూలం. వర్షాలు ఎకువైతే వేరు కుళ్లిపోయి పంట పాడైపోతుంది. పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. కిలో రూ.200 చొపున ఎకరాకు 3 కేజీల విత్తనం వేస్తే సరిపోతుంది. పంటకు చీడపురుగుల బెడదగానీ, తెగుళ్ల బెడద గానీ ఏమీ ఉండవు.

పశువులు, పక్షులు, జింకల నుంచి కూడా ముప్పు ఉండదు. పశువుల పేడను ఎరువుగా వేస్తే సరిపోతుంది. విత్తిన నెల తరువాత ఒకసారి, 3 నెలల తరువాత మరోసారి కలుపు తీయాలి. పంట పీకిన రోజే వేరును, కాండాన్ని, కాయలను వేరు చేసి ఆరబెడతాం. వేరు నాణ్యతను బట్టి 6 భాగాలుగా విభజించి ప్యాకింగ్‌ చేసి పెడతాం. కాయను నూర్పిడి చేసి విత్తనాలు తీస్తాం. ఎకరాకు 50 నుండి 100 కేజీల వరకూ విత్తనం వస్తుంది.

అదే విత్తనాన్నే తిరిగి పంట సాగుకు ఉపయోగిస్తాం. మిగిలిన విత్తనాన్ని కావాల్సిన రైతులకు కిలో రూ.200 చొప్పున విక్రయిస్తాం. అశ్వగంధ విత్తనం వేశాక తరువాత నెలరోజుల పాటు వర్షం రాకపోయినా విత్తనం ఏమీ కాదు. అశ్వగంధ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం కూడా అందుతుంది. పంటను నిల్వ చేసేందుకు స్టోరేజీ రూముల నిర్మాణానికి డబ్బు కూడా ఇస్తుంది. వ్యాపారులు పొలం వద్దకే వచ్చి కొంటున్నారు. మార్కెటింగ్‌ సమస్య లేదు.
– జీవీ కొండయ్య (94415 35325), అశ్వగంధ రైతు, జీ.కొట్టాల, గుంతకల్లు మం., అనంతపురం జిల్లా
– యం.మనోహర్, సాక్షి, గుంతకల్లు రూరల్, అనంతపురం జిల్లా

మరిన్ని వార్తలు