Arikelu Cultivation: ఆరిక అన్నం అత్యంత బలవర్ధకమైన, ఔషధ గుణాలున్న ఆహారం.. మరి పండించడం ఎలా? ఎప్పుడు విత్తాలి?

28 Jun, 2022 09:55 IST|Sakshi

ఆరికెలు.. ఈ కార్తెలోనే విత్తాలి 

ఆరిక అన్నం ఇంటిల్లపాదికీ అత్యంత బలవర్ధకమైన, ఔషధ గుణాలున్న ఆహారం. ఖరీఫ్‌లో మాత్రమే సాగయ్యే చిరుధాన్య పంట ఆరిక మాత్రమే. ఆరిక 160–170 రోజుల పంట. విత్తిన తర్వాత దాదాపు 6 నెలలకు పంట చేతికి వస్తుంది. ఆరికలు విత్తుకోవడానికి ఆరుద్ర కార్తె (జూలై 5 వరకు) అత్యంత అనువైన కాలం.

మొలిచిన తర్వాత 40–50 రోజులు వర్షం లేకపోయినా ఆరిక పంట నిలుస్తుంది. ఇతర పంటలు అంతగా నిలవ్వు. చిరుధాన్యాల్లో చిన్న గింజ పంటలు (స్మాల్‌ మిల్లెట్స్‌).. ఆరిక, కొర్ర, సామ, ఊద, అండుకొర్ర. ఆరిక మినహా మిగతా నాలుగు పంటలూ 90–100 రోజుల్లో పూర్తయ్యేవే.

చిరుధాన్యాల సేంద్రియ సాగులో అనుభవజ్ఞుడు, వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్‌ ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో ఆరికల సాగులో మెలకువలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం...

ఆరిక విత్తనాలు ఒక్క వర్షం పడి తేమ తగలగానే మొలుస్తాయి. ఒక్కసారి మొలిస్తే చాలు. గొర్రెలు తిన్నా మళ్లీ పెరుగుతుంది ఆరికె మొక్క. మొలిచిన తర్వాత దీర్ఘకాలం వర్షం లేకపోయినా తట్టుకొని బతకటం ఆరిక ప్రత్యేకత. మళ్లీ చినుకులు పడగానే తిప్పుకుంటుంది. అందువల్ల సాధారణ వర్షపాతం కురిసే ప్రాంతాలతో పాటు అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతాలకూ ఇది అత్యంత అనువైన పంట. నల్ల కంకి సమస్యే ఉండదు. 

ఆరిక పంటకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు అవసరం లేదు. పొలాన్ని దుక్కి చేసుకొని మాగిన పశువుల దిబ్బ ఎరువు ఎకరానికి 4–5 ట్రాక్టర్లు(12 టన్నులు) వెదజల్లాలి. లేదా గొర్రెలు, మేకలతో మందగట్టడం మంచిది. గొర్రెలు, మేకలు మూత్రం పోసిన చోట ఆరిక అద్భుతంగా దుబ్బు కడుతుంది. శ్రీవరి సాగులో మాదిరిగా 30–40 పిలకలు వస్తాయి. 

పొలాన్ని దుక్కి చేసి పెట్టుకొని.. మంచి వర్షం పడిన తర్వాత ఆరికెలను విత్తుకోవాలి. వెదజల్లటం కన్నా గొర్రుతో సాళ్లుగా విత్తుకోవడం మంచిది. గొర్రుతో విత్తితే విత్తనం సమాన లోతులో పడుతుంది. ఒకరోజు అటూ ఇటుగా మొలుస్తాయి. ఒకేసారి పంటంతా కోతకు వస్తుంది. 

8 సాళ్లు ఆరికలు విత్తుకొని, 1 సాలు కందులు, మళ్లీ 8 సాళ్లు ఆరికలు, ఒక సాలు ఆముదాలు విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆరిక విత్తనం కావాలి. కంది విత్తనాలు ఎకరానికి ఒకటిన్నర కిలోలు కావాలి. కిలోన్నర కందుల్లో వంద గ్రాములు సీతమ్మ జొన్నలు, 50 గ్రాములు తెల్ల / చేను గోగులు కలిపి విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆముదం విత్తనాలు కావాలి. ఎకరానికి పావు కిలో నాటు అలసందలు /బొబ్బర్లు, అర కిలో అనుములు, వంద గ్రా. చేను చిక్కుళ్లు ఆముదాలలో కలిపి చల్లుకోవాలి. 

ఆరికలు విత్తుకునేటప్పుడు కిలో విత్తనానికి 4 కిలోల గండ్ర ఇసుక కలిపి విత్తుకోవాలి. ఆరికల విత్తనాలు ఎంత సైజులో ఉంటాయో అదే సైజులో ఉండే ఇసుక కలిపి గొర్రుతో విత్తుకోవాలి. కందులు, ఆముదం తదితర విత్తనాలను అక్కిలి / అక్కిడి కట్టెలతో విత్తుకోవాలి. ఆరికలను మిశ్రమ సాగు చేసినప్పుడు పెద్దగా చీడపీడలేమీ రావు. కషాయాలు పిచికారీ చేయాల్సిన అవసరం రాదు.

ఐదారు రకాల పంటలు కలిపి సాగు చేయడం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. రైతు కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల పంటలూ చేతికి వస్తాయి. ఆహార భద్రత కలుగుతుంది. కంది, సీతమ్మ జొన్న తదితర పంట మొక్కల పిలకలు తుంచేకొద్దీ మళ్లీ చిగుర్లు వేస్తూ పెరుగుతాయి. పక్షి స్థావరాలుగా కూడా ఇవి ఉపయోగపడతాయి. 

ఆరికలు ఎకరానికి ఎంత లేదన్నా 6–8 క్వింటాళ్లు,  కందులు 3 క్వింటాళ్లు, ఆముదాలు 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సందేహాలుంటే విజయకుమార్‌ (98496 48498)ను ఆంధ్రప్రదేశ్‌ రైతులు ఉ. 6–9 గం. మధ్యలో, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య సంప్రదించవచ్చు.  
చదవండి: ఏనుగుల నుంచి రక్షించే నిమ్మ చెట్ల కంచె!

మరిన్ని వార్తలు