Sagubadi: గాల్లో ఎగురుతూ పండ్లు కోసే రోబోలు! రెండున్నర ఎకరాల్లో పండ్ల కోతకు ఒకటి చాలు!

30 Aug, 2022 09:56 IST|Sakshi
PC: Kubota

పండ్ల కోత కూలీలు సమయానికి దొరక్క రైతులు నానా యాతన పడుతూ ఉంటారు. కూలీల కొరత వల్ల కోత ఆలస్యం కావటం, నాణ్యత కోల్పోవటం.. రైతులు ఆశించిన ధర దక్కకపోవటం చూస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా కోత కూలీలు దొరక్క ఏటా 3 వేల కోట్ల డాలర్ల మేరకు రైతులు నష్టపోతున్నారు.

రెండు వారాలు ఆలస్యంగా కోసిన పండ్ల వెల 80% తగ్గిపోతున్నదట. 2050 నాటికి 50 లక్షల మంది పంట కోత కార్మికుల కొరత నెలకొంటుందని అంచనా. కోసే వాళ్లు లేక 10% పండ్లు కుళ్లిపోతున్నాయట.

ఈ సమస్యకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారాలు చూపుతోంది. ఎత్తయిన చెట్ల నుంచి పక్వానికి వచ్చిన పండ్లను మాత్రమే సుతిమెత్తగా పట్టుకొని కోసి తెచ్చే రోబోలు వచ్చేశాయి. 


PC: Kubota

తోటలో నేల మీద కదులుతూ స్ట్రాబెర్రీలు, కూరగాయలు, పండ్లను కోసే రోబోలు వున్నాయి. అయితే, గాలిలో ఎగురుతూ ఎత్తయిన చెట్ల నుంచి పండ్లు కోసే రోబోలను కూడా తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ విజయవంతంగా రూపొందించింది. ఇజ్రాయిల్‌కు చెందిన టెవెల్‌ ఏరోబోటిక్స్‌ టెక్నాలజీస్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి స్వతంత్రంగా ఎగురుతూ చెట్ల నుంచి పండ్లను కోసే రోబోలను తయారు చేసింది.

ఈ రోబోలకు మీటరు పొడవుండే ఇనుప చెయ్యిని బిగించారు. కోయాల్సిన పండు రకాన్ని బట్టి ఈ చేతిలో తగిన మార్పులు చేస్తారు. అత్యాధునిక కృత్రిమ మేథను కలిగి ఉన్నందున ఏ రంగు, ఏ సైజు పండు కొయ్యాలి? ఏది అక్కర్లేదు? అనే విషయాన్ని ముందుగానే వీటికి ఫీడ్‌ చేస్తారు.

ఆ సమాచారం మేరకు మెషిన్‌ లెర్నింగ్‌ అల్గోరిథమ్స్‌ ద్వారా సెన్సార్లు, కామెరాల సహాయంతో ఈ రోబోలు పనిచేస్తున్నాయి. పక్వానికి వచ్చిన పండ్లనే కచ్చితంగా గుర్తించి కోయగలుగుతున్నాయని టెవెల్‌ ఏరోబోటిక్స్‌ సీఈవో యనివ్‌ మోర్‌ తెలిపారు. ఒక వ్యాన్‌పై నాలుగు పండ్లు కోసే రోబోలను వైర్లతో అనుసంధానం చేస్తారు. అవి చెట్లపై ఎగురుతూ పండ్లను కోసి, వాటిని జాగ్రత్తగా వ్యాన్‌పై పెడతాయి. 

ఈ రోబోలు ఒక ఆప్‌తో అనుసంధానమై ఉండి రైతుకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. ఎంత మొత్తంలో పండ్ల కోత పూర్తయ్యింది? ఏదైనా పురుగుమందు లేదా చీడపీడల ప్రభావం ఉందా? అనే విషయాన్ని కూడా రైతుకు తెలియజేస్తాయి. ఆపిల్స్‌ నుంచి అవకాడో వరకు అనేక రకాల పండ్లను ఈ రోబోలు అవలీలగా రాత్రీ పగలు నిరంతరాయంగా కోస్తున్నాయని కంపెనీ చెప్తోంది. 

ఆపిల్స్, అవకాడో, పియర్స్, నారింజ తదితర పండ్ల కోత పరీక్షల్లో చక్కని ఫలితాలు వచ్చాయి. సాధారణంగా రెండున్నర ఎకరాల్లో పండ్ల కోతకు ఒక ఎగిరే రోబో సరిపోతుందట. అయితే, చెట్ల వయసు, పండ్ల రకం, సైజులను బట్టి ఎంత తోటకు ఎన్ని రోబోలు అవసరమవుతాయన్నది ఆధారపడి ఉంటుంది. 

‘గాలిలో ఎగురుతూ పండ్లను కోసే రోబోలు మావి మాత్రమే. ఈ ఏడాది మార్కెట్లోకి తెస్తున్నాం’ అంటున్నారు ఆ కంపెనీ సీఈవో. సుమారు 3 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఐదేళ్లు పరిశోధించి కంపెనీ ఈ వినూత్న రోబోలను తయారు చేసింది కదా.. ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుందిగా మరి! మన దేశంలో ఎంత ధరకు అమ్ముతారో వేచి చూద్దాం... 

చదవండి: Sagubadi: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఇలా తయారు చేసుకోండి.. కోకోపోనిక్స్‌ సాగులో..

మరిన్ని వార్తలు