Dragon Trees: ‘వంద రకాల’ డ్రాగన్‌ రైతు! ఒక్కో మొక్క రూ. 100 నుంచి 4,000 వరకు అమ్మకం!

13 Sep, 2022 09:56 IST|Sakshi
వండర్‌ బాయ్‌ జేకే 2 రకం, జేకే1 పలోరా 2 రకం మొక్క వద్ద రైతు

100 రకాల డ్రాగన్‌ రైతు!

డ్రాగన్‌ ఫ్రూట్‌ పుష్కలంగా పోషకాలు కలిగి ఉండే పండు. అంతేకాదు, ఖరీదైనది కూడా. ఈ రెండు లక్షణాలూ 72 ఏళ్ల వృద్ధుడు జోసెఫ్‌ను రైతుగా మార్చేశాయి. కేరళకు చెందిన ఆయన అమెరికా వెళ్లినప్పుడు తియ్యని డ్రాగన్‌ ఫ్రూట్‌ రుచి చూసి పరవశుడయ్యారు. ఏడేళ్ల క్రితం ఆ పండును ఏడు డాలర్లకు కొన్నారాయన. ఆ రుచి, కళ్లు చెదిరే ధర ఆయనను డ్రాగన్‌ రైతుగా మార్చేసింది.

హైదరాబాద్‌లో మెషిన్‌ టూల్‌ ఇండస్ట్రీ నిర్వహించి విరామ జీవనం గడుపుతున్న జోసెఫ్‌.. తన స్వస్థలం కొట్టాయం దగ్గర్లోని చెంగనస్సెరీకి తిరిగి వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక దేశ విదేశాల నుంచి డ్రాగన్‌ మొక్కల్ని సేకరించటం మొదలు పెట్టారు. ఈక్వడార్, తైవాన్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల నుంచి డ్రాగన్‌ మొక్కల్ని తెప్పించి ఇంటి పెరట్లోని 65 సెంట్ల స్థలంలో నాటారు.

100 రకాలు
ఇప్పటికి దాదాపు 100 రకాలు సేకరించారు. అందులో కొన్ని మాత్రమే రుచిగా ఉంటాయంటారు జోసెఫ్‌. కొన్ని రకాల పండు లోపలి గుజ్జు తెల్లగా ఉంటే, మరికొన్నిటికి ఎర్రగా, పసుపు పచ్చగానూ ఉంటాయి. డ్రాగన్‌ జీవవైవిధ్యంతో ఆయన పెరటి తోట కళకళలాడుతూ ఉంటుంది. తనకు నచ్చిన రకాలను సంకరం చేసి 10 కొత్త డ్రాగన్‌ వంగడాలను రూపొందించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు.

65 రోజులకు పండు కోతకు
వీటిల్లో జేకే1 పలోరా 2, రెడ్‌ చిల్లీ, వండర్‌ బాయ్‌ జేకే 2 అనే రకాల మొక్కలు నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి. జేకే1 పలోరా 2 రకం పసుపు రంగు పండు అన్నిటికన్నా తియ్యనిది (బ్రిక్స్‌ 23.6). పూత వచ్చాక 65 రోజులకు పండు కోతకు వస్తుందని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.  

తన డ్రాగన్‌ పండ్ల రంగు, రుచిని బట్టి.. ఒక్కో మొక్కను రూ. వంద నుంచి 4,000 వరకు విక్రయిస్తుండటం విశేషం. వండర్‌ బాయ్‌ జేకే 2 రకం (క్రాస్‌ పాలినేషన్‌ రకం) పండు తియ్యదనం బ్రిక్స్‌ 21.5. ఈ మొక్క ధర రూ. 1,500. రెడ్‌ చిల్లీ పండు తియ్యదనం బ్రిక్స్‌ 17.5. దీని కటింగ్‌ను రూ. వెయ్యికి అమ్ముతున్నారాయన. అన్నట్టు.. మొక్కలతో పాటు పండ్లను కూడా అమ్ముతున్నారు జోసెఫ్‌(94472 94236). అనేక రాష్ట్రాల్లో తన కస్టమర్లున్నారని ఆయన అంటున్నారు కించిత్‌ గర్వంగా!

చదవండి: Cocoponics: మట్టి లేని సేద్యం.. కూరగాయలు పుష్కలం! రూపాయి పెట్టుబడికి 11 వరకు ఆదాయం!

మరిన్ని వార్తలు