Mosambi Cultivation: లాభాల బుట్టలో రైతు.. బత్తాయి కాయలకు తాటాకు బుట్టలు తొడిగి!

26 Jul, 2022 10:04 IST|Sakshi

లాభాల బుట్టలో బత్తాయి రైతు!

బత్తాయి కాయలకు తాటాకు బుట్టలు తొడిగి నాణ్యమైన దిగుబడులు

తాటాకు బుట్టలు బత్తాయి కాయలకు చుట్టడం, రసాయనిక ఎరువులకు బదులు చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వేయటం ద్వారా బత్తాయి సాగులో యువ రైతు కడసాని రవీందర్‌రెడ్డి బహుళ ప్రయోజనాలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని తోపుచర్ల గ్రామానికి చెందిన రవీందర్‌ రెడ్డి మూడు ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు.

చాలా ఏళ్ల నుంచి రసాయనిక ఎరువులు వాడి భూమి నిస్సారమై పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో రవీందర్‌ రెడ్డి రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. 

పిందె దశ నుంచే చీడపీడల బారి నుంచి పంటను కాపాడేందుకు అనేక రకాల రసాయనిక పురుగు మందులను బత్తాయి రైతులు పిచికారీ చేస్తుంటారు. రవీందర్‌ రెడ్డి మందుల జోలికి పోకుండా తాటాకు బుట్టలను కాయలకు తొడుగుతున్నారు.

తద్వారా పేనుబంక, మంగు, దోమ తదితర చీడపీడల నుంచి కాయలను కాపాడుకోగలుగుతున్నారు. కాయ సైజు పెరగటం, బంగారు పసుపు రంగులోకి మారటం వల్ల కొనుగోలుదారులు ఈ కాయలను ఇష్టపడి అధిక ధర చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. 

ఇలా చేస్తే అధిక లాభాలు!
బత్తాయి రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని మాడుగులపల్లి ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి సూచిస్తున్నారు. సేంద్రియ సాగులోకి మళ్లటంతో పాటు కాయలకు తాటాకు బుట్టలు తొడిగే పద్ధతిని ఆచరిస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు సాధించవచ్చన్నారు.  

మాడుగులపల్లి నుంచి బత్తాయిలను తూర్పుగోదావరి జిల్లాలో మార్కెట్లకు తరలిస్తుంటారు. అక్కడ కాయ రూ. 20–25లకు అమ్ముతున్నట్లు సమాచారం. బత్తాయి కాయలకు తొడిగే తాటాకు బుట్టలను సైతం రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నారు. బుట్ట ఖరీదు రూ.5. రవాణా, కూలి ఖర్చులతో కలిపి బుట్టకు మొత్తం రూ.8 ఖర్చవుతున్నదని రవీందర్‌ రెడ్డి చెబుతున్నారు. వేములపల్లి మండలంలోని మొల్కపట్నంలో కూడా మరో ఇద్దరు బత్తాయి రైతులు తాటాకు బుట్టలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 

20–22 టన్నుల దిగుబడికి అవకాశం
గతంలో రసాయనిక ఎరువుల వాడినప్పుడు ఎకరానికి బత్తాయి పండ్ల దిగుబడి 13–15 టన్నుల వరకు వచ్చేది. చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వేయటం వల్ల కాయల సంఖ్యతో పాటు కాయ సైజు గణనీయంగా పెరిగింది. ఈసారి ఎకరానికి 20–22 టన్నుల దిగుబడి వస్తుందనుకుంటున్నా.

తాటాకు బుట్టల వాడకం వల్ల తెగుళ్లు సోకటం లేదు. కాయ బంగారు పసుపు రంగులోకి మారి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నది. – కడసాని రవీందర్‌ రెడ్డి, బత్తాయి రైతు, ఫోన్‌: 9392990998, తోపుచర్ల, మాడుగులపల్లి మం. నల్లగొండ జిల్లా
– పండుగ శ్రీనివాస్, సాక్షి, మాడుగులపల్లి, నల్లగొండ జిల్లా 
చదవండి: Maharashtra: ఇక నల్లేరుపై బండి నడకే!.. బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించే ఆవిష్కరణ

మరిన్ని వార్తలు