Pandiri Sagu: ఎకరంలో కూరగాయల పందిరి సాగు.. ఏడాదికి లక్ష వరకు ఆదాయం! ఇక సోరకాయతో నెలలో 50 వేల వరకు..

12 Oct, 2022 12:34 IST|Sakshi
సర్ధార్‌నగర్‌లో పందిరి సాగు విధానంలో కాకర తోటను పరిశీలిస్తున్న ఉద్యానశాఖ అధికారులు (ఫైల్‌)

లాభాల ‘పందిరి’

పందిరిసాగు వైపు రైతుల చూపు 

ఎకరానికి రూ.లక్ష చొప్పునసబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం

అవగాహన కల్పిస్తున్న అధికారులు.. ఆసక్తి చూపిస్తున్న అన్నదాతలు 

లాభాలు బాగున్నాయని సంతృప్తి  

జిల్లాలో 1,500 ఎకరాల్లో సాగు 

షాబాద్‌/రంగారెడ్డి: కూరగాయల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శాశ్వత పందిళ్లు, బిందు సేద్యం, మల్చింగ్, స్ప్రింక్లర్ల ప్రాముఖ్యతపై ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పించడంతో ఆ పద్ధతిలో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

ప్రభుత్వం పందిరిసాగు ద్వారా కూరగాయలు పండించే రైతులకు ఎకరానికి రూ.లక్ష వరకు సబ్సిడీ అందిచడంతో చాలామంది ముందుకు వస్తున్నారు. కాకర, బీర, దొండ, సోరకాయ విత్తనాలు నాటిన కొద్ది రోజులకే పంట చేతికి వస్తోంది. మార్కెట్‌లో మంచి ధర పలుకుతుండడంతో పెట్టుబడి పోను మంచి లాభాలు వస్తున్నాయి.  

దిగుబడి.. రాబడి  
జిల్లాలో అత్యధికంగా షాబాద్, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, షాద్‌నగర్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని రైతులు పందిరి సాగు ద్వారా కూరగాయలు పండిస్తున్నారు.

బీర, చిక్కుడు ఎకరానికి 25 వేల పెట్టుబడి.. రాబడి 1.55 లక్షలు
ఏడాదిలో రెండుసార్లు సోరకాయ దిగుబడి వస్తోంది. ఎకరానికి రూ.6 వేల వరకు ఖర్చు కాగా, సుమారు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్‌లో కిలో రూ.20–25 చొప్పున ధర పలుకుతోంది. నెలలో రూ.50వేల వరకు ఆదాయం వస్తోంది. బీర, చిక్కుడు పంటలకు ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి ఖర్చు కాగా, రూ.1.55 లక్షల వరకు రాబడి వస్తోంది.   

తక్కువ పెట్టుబడితో..  
జిల్లాలోని ఆయా మండలాల్లో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులు 1,500 ఎకరాల్లో పందిరి సాగు ద్వారా వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి రూ.లక్ష చొప్పున 250 మంది రైతులకు.. 550 ఎకరాల వరకు సబ్సిడీ  అందించింది. ఏడాది పొడవునా కూరగాయలను సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందుతున్నామని రైతులు చెబుతున్నారు.  

లాభదాయకం..  
కూరగాయలను నేల కంటే పందిరి సాగు విధానంలో పండిస్తేనే లాభదాయకంగా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసినా పంట నాణ్యతగానే ఉంటుంది. ఎకరంలో పందిరి సాగులో కూరగాయలు పండిస్తున్నా. ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇవ్వడం బాగుంది.   – అమృత్‌రావు, రైతు, సర్ధార్‌నగర్‌ 

అవగాహన కల్పిస్తున్నాం 
పందిరి సాగుపై ఆయా ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నాం. ప్రభుత్వం సబ్సిడీ సైతం అందిస్తోంది. దీంతో చాలా మంది రైతులు పందిరి సాగు విధానానికి ఆసక్తి చూపుతున్నారు. కాకర, బీర, సోర, దొండ పంటలను సాగు చేస్తున్నారు.   – సునందారాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి  

చదవండి: Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా..
Sagubadi: కాసుల పంట డ్రాగన్‌! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!

మరిన్ని వార్తలు