Pre Monsoon Dry Sowing: ఇలా చేస్తే బట్టతడుపు వాన పడినా చాలు విత్తనం మొలుస్తుంది!

10 May, 2022 10:15 IST|Sakshi

వానకు ముందే విత్తన గుళికలు!

Pre Monsoon Dry Sowing: మెట్ట భూముల్లో 365 రోజులూ నిరంతరాయంగా ప్రకృతి పంటల సాగులో తొలి దశ వానకు ముందే విత్తటం (ఇదే ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ –పీఎండీఎస్‌)లో ప్రత్యేక పద్ధతులను రైతులు అనుసరించాల్సి ఉంటుంది. 365 డిజీసీ పద్ధతిని ప్రారంభించే రైతులు తొలి సంవత్సరం మొదట్లో మాత్రమే దుక్కి దున్నాల్సి ఉంటుంది. తదనంతరం ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనుషులు చేతులతోనే విత్తన గుళికలు విత్తుకోవాలి.

మళ్లీ దుక్కి చేయాల్సిన అవసరం లేదు. 20కి పైగా పంటలు ఒకేసారి విత్తుకున్నప్పటికీ ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులు, రైతుల ఆసక్తి, పంట కాలాలను బట్టి ప్రధాన పంటలను ఎంపిక చేసుకోవాలి. వానకు ముందే వేసవిలో విత్తుకోవాలి కాబట్టి.. వేడిని తట్టుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనాలకు లేపనం చేయటం ముఖ్యమైన విషయం.

బంక మట్టి, ఘనజీవామృతం పొడులతో పాటు బూడితతో లేపనం చేసిన విత్తన గుళికలను మాత్రమే విత్తుకోవాలి. విత్తనాన్ని బొచ్చెలో లేదా గోనె సంచిలో పోసి అటూ ఇటూ ఊపుతూ.. బీజామృతంను తగుమాత్రంగా చిలకరిస్తూ.. తొలుత మెత్తగా వజ్రకాయం పట్టిన బంక మట్టి లేదా చెరువు మట్టిని విత్తనాలపై చల్లాలి. తర్వాత మెత్తగా చేసిన ఘన జీవామృతం పొడిని అవే విత్తనాలపై వేస్తూ బీజామృతాన్ని తగుమాత్రంగా చిలకరించాలి.

చివరిగా కట్టె బూడిదను కూడా వేస్తూ విత్తనాలకు లేపనం చేయాలి. ఇలా ఐదు దఫాలుగా చేయాలి. విత్తనం పరిమాణానికి విత్తన గుళికల పరిమాణం 5 రెట్లు పెరుగుతుంది. ఈ విత్తనాన్ని మార్చి నుంచి మే వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 400 కేజీల ఘన జీవామృతాన్ని చల్లుకోవాలి. ఆ తర్వాత కనీసం 3 అంగుళాల మందాన వేరుశనగ పొట్టు, కంది పొట్టు, శనగ పొట్టు, గడ్డి తదితర పంట వ్యర్థాలతో పొలం అంతా ఆచ్ఛాదన చేయాలి. 

పొలం చదరంగా ఉంటే.. (తొలి ఏడాది మాత్రమే) దుక్కి చేసిన తర్వాత.. ఎద్దుల గొర్రు లేదా సీడ్‌ డ్రిల్‌తో విత్తన గుళికలను వరుసలుగా విత్తుకోవచ్చు. పొలం వాలు ఎక్కువగా ఉంటే.. వాలుకు అడ్డంగా బోదెలు తోలుకొని.. మనుషులే విత్తన గుళికలను వరుసలుగా విత్తుకోవాలి. లేపనం చేసిన విత్తనం 6 నెలలు భద్రంగా ఉంటుంది. భూమిలో వేసిన తర్వాత బట్టతడుపు వాన (5–10 ఎం.ఎం.) పడినా చాలు మొలుస్తుంది.

ఘనజీవామృతంతో లేపనం చేసినందున మొలక 25–30 రోజుల వరకు వాన లేకపోయినా తట్టుకొని నిలబడుతుంది. ద్రవజీవామృతం 15 రోజులకోసారి పిచికారీ చేస్తూ ఉంటే.. ఇక ఆ పంటకు డోకా ఉండదు. 45–50 రోజులకు పిఎండీఎస్‌ పంటలను కోసి ఆచ్ఛాదనగా వేయాలి. లేదా పశువులకు మేపాలి. అంతకుముందే ఖరీఫ్‌ పంటలను విత్తుకోవాలి. యూట్యూబ్‌లో ఇందుకు సంబంధించిన వీడియో చూస్తే మరింత అవగాహన వస్తుంది.

చదవండి👉🏾Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే!


 

మరిన్ని వార్తలు