సేంద్రియ కూరగాయల సాగుకు ‘కదిలే పై కప్పు’ పాలిహౌస్‌! ప్రయోజనాలెన్నో..

5 Oct, 2021 10:11 IST|Sakshi

మీట నొక్కితే ముడుచుకునే / విచ్చుకునే  పై కప్పు కలిగిన పాలిహౌస్‌ వచ్చేస్తోంది

కృత్రిమ మేథతో కూడిన సెన్సార్‌ వ్యవస్థతో అనుసంధానం 

సేంద్రియ కూరగాయల సాగుకు అనువైనది

చ.మీ. ఖర్చు రూ.1,500–3,000

కేంద్ర ప్రభుత్వ సంస్థ సి.ఎం.ఇ.ఆర్‌.ఐ. శాస్త్రవేత్తల ఆవిష్కరణ

కూరగాయ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడానికి అనువైన ప్రత్యేకమైన కదిలే పై కప్పు కలిగిన పాలిహౌస్‌లు త్వరలోనే మన రైతులకు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ పాలిహౌస్‌ పైకప్పు స్థిరంగా ఉంటుంది. దీని వల్ల పాలిహౌస్‌లో సాగవుతున్న పంట (ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ) అనివార్యంగా కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. వేడి వాతావరణంలో పంటలుతీవ్ర వత్తిడికి గురై నష్టపోయే సందర్భాలుంటున్నాయి.

అయితే, పాలీహౌస్‌ పై కప్పు కదిలే వెసులుబాటు ఉండి, అవసరమైతే నిమిషాల్లో పై కప్పును తాత్కాలికంగా పక్కకు జరపడానికి లేదా నిమిషాల్లో మూసేయడానికి వీలుంటే? ఈ వెసులుబాటు ఉంటే పంటల సాగుకు మరింత అనువుగా ఉంటుందని, ముఖ్యంగా సేంద్రియ కూరగాయ పంటలను ఏడాది పొడవునా సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌లోని కేంద్రీయ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పరిశోధనా సంస్థ (సి.ఎం.ఇ.ఆర్‌.ఐ.), హిమాచల్‌ప్రదేశ్‌ పాలంపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ (సిఎస్‌ఐఆర్‌ అనుబంధ సంస్థలు) శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వినూత్న పాలీహౌస్‌లను రూపొందించారు. 

‘అధిక వేడి, చలి, వర్షం.. వంటి తీవ్రమైన వాతావరణ సంబంధమైన ఇబ్బందులతో సాధారణ పాలిహౌస్‌ రైతులు బాధలు పడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి రక్షణ పొందడానికి పై కప్పు కదిలే పాలిహౌస్‌లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సేంద్రియ సాగుకు కూడా ఇవి అనువైనవి..’ అంటున్నారు సి.ఎం.ఇ.ఆర్‌.ఐ. సంచాలకులు డా. హరీష్‌ హిరాని. ఆయన ఆధ్వర్యంలో సీనియర్‌ శాస్త్రవేత్త జగదీశ్‌ మానిక్‌రావు ఈ కదిలే పై కప్పు పాలిహౌస్‌లపై పరిశోధనా ప్రాజెక్టుకు సారధ్యం వహిస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రం లూధియానాలోని సి.ఎం.ఇ.ఆర్‌.ఐ. విస్తరణ కేంద్రం ఆవరణలో ప్రయోగాత్మకంగా ఈ పాలిహౌస్‌లను నిర్మిస్తున్నారు. 

‘పంటలకు తగినంత గాలిలో తేమ, ఉష్ణోగ్రత వంటి వాతావరణ స్థితిగతులను ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇచ్చే సాంకేతిక వ్యవస్థ ఈ పాలిహౌస్‌లలో ఉంటుంది. అందువల్ల సీజనల్, అన్‌సీజనల్‌ పంటలను కూడా సాగు చేయడానికి వీలవుతుంది’ అని డా. హిరాని వివరించారు. మరో ఆరు నెలల్లోనే ఈ సరికొత్త పాలిహౌస్‌ టెక్నాలజీలను రైతులకు అందించనున్నామన్నారు. 

ఏయే పంటలు సాగు చేయొచ్చు?
►పైకప్పు కదిలే పాలిహౌస్‌లలో కీరదోస, చెర్ర టమాటో, క్యాబేజి, కూరమిరప, బ్రకోలి, లెట్యూస్, కాకర, కాళిఫ్లవర్, కొత్తిమీర, పాలకూర  వంటి కూరగాయలు, ఆకుకూరలతోపాటు కార్నేషన్, జెర్బర, ఆర్కిడ్స్‌ వంటి పూలను కూడా సాగు చేయవచ్చని  సి.ఎం.ఇ.ఆర్‌.ఐ. చెబుతోంది. 
►పాలిహౌస్‌లో పంట ఎదుగుదల అవసరాలను బట్టి రైతు స్వయంగా మీట నొక్కితే పనిచేసే రకం పాలిహౌస్‌ ఒకటి ఉంది. కృత్రిమ మేథ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సెన్సార్ల వ్యవస్థ ఆధారంగా దానంతట అదే తెరచుకునే లేదా ముడుచుకునే మరో రకం పాలిహౌస్‌ కూడా ఉంది. 
►మొదటి రకం కన్నా రెండో రకం ఖర్చుతో కూడిన పని. పైకప్పు కదిలే సదుపాయం ఉండే ఈ పాలిహౌస్‌ నిర్మాణానికి ఖర్చు చదరపు మీటరుకు ఆటోమేషన్‌ స్థాయిని బట్టి రూ. 1,500 నుంచి 3,000 వరకు ఉంటుందని సిఎంఇఆర్‌ఐ ప్రతినిధి అజయ్‌ రాయ్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.  

సాధారణ పాలిహౌస్‌ కన్నా ఏ విధంగా మెరుగైనది?
సాధారణ పాలిహౌస్‌తో పోల్చితే పై కప్పు కదిలే సదుపాయం ఉన్న పాలిహౌస్‌ ప్రయోజనాలు ఇవి..
►ఆరుబయట పొలాలు, నేచురల్లీ వెంటిలేటెడ్‌ పాలిహౌస్‌లతో పోల్చితే ఈ పాలిహౌస్‌ ద్వారా అధిక దిగుబడి వస్తుంది. పంట దిగుబడుల నిల్వ సామర్ధ్యం ఇనుమడిస్తుంది.
►ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ను తగ్గించడం ద్వారా పంటను అధిక వేడి నుంచి కాపాడుతుంది. సాధారణ సాగు పద్ధతుల్లో కన్నా ఇందులో పండించే పంటలు ‘ఫొటోసింథటికల్లీ యాక్టివ్‌’గా ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి మెరుగైన నాణ్యతతో అధిక దిగుబడిని పొందవచ్చువెంటిలేటర్లను సరిచేయడం ద్వారా పాలిహౌస్‌ లోపల గాలిలో తేమ పాలిహౌస్‌ అన్ని వైపులా ఒకేలా ఉండే విధంగా నియంత్రించవచ్చు 
►వాతావరణం నుంచి గాలి, కార్బన్‌ డయాక్సయిడ్‌ల మార్పిడి పాలిహౌస్‌ అంతటా సరిసమానంగా ఉంటుంది
►గాలిలో తేమ, కాంతి బాగా అందుతుంది కాబట్టి పంటల ఎదుగుదల బాగుంటుంది
►సేంద్రియ వ్యవసాయానికి బాగా అనువైన సాంకేతికత ఇది సాధారణ పాలిహౌస్‌లలో మాదిరిగా కాకుండా అవసరం మేరకు నేరుగా ఎండ తగలటం వల్ల మొక్కలు దట్టంగా పెరుగుతాయి

సాధారణ పాలిహౌస్‌ వల్ల ఎదురవుతున్న సమస్యలు
సాధారణ పాలిహౌస్‌ పైకప్పు కదల్చడానికి వీల్లేకుండా, ఎప్పుడూ బలంగా బిగించి ఉంటుంది. శాశ్వత పైకప్పు వల్ల ఉన్న సమస్యలు.. 
►పాలీహౌస్‌లో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.
►ఉదయం, సాయంత్రపు వేళల్లో సూర్యకాంతి పంటలకు సరిపడినంత అందదు.
►పంటలకు తగినంత కార్బన్‌ డయాక్సయిడ్‌ అందదు. పంట మొక్కల నుంచి తగినంతగా నీటి ఆవిరి విడుదల కాదు. నీటి వత్తిడి ఉంటుంది. అందువల్ల సాధారణ పాలిహౌస్‌లలో పెరిగే పంటలు మెతకబారి చీడపీడలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

‘కదిలే పై కప్పు పాలిహౌస్‌’ వల్ల రైతులకు ప్రయోజనాలు
►ఆయా కాలాల్లో సాగు చేయదగిన, సాధారణంగా ఆ కాలంలో సాగు చేయని పంటలను సైతం ఈ పాలిహౌస్‌లో సాగు చేసుకోవచ్చు
►పంటలకు తెగుళ్లు, పురుగుల బెడద తక్కువగా ఉంటుంది
►పంట కోత కాలం పెరుగుతుంది
►సాగు ఖర్చు తగ్గుతుంది
►ఏడాది పొడవునా రైతులు నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు
►అర్బన్‌ అగ్రికల్చర్‌కు అనువైనది 

ఇతర వివరాలకు.. అజయ్‌ రాయ్, హెడ్, ఎంఎస్‌ఎంఇ గ్రూప్, సిఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్‌. 
ఫోన్‌ నంబర్లు: 094746 40064, 087590 39523
ajoy.roy@cmeri.res.in
kumarajoy1962@gmail.com
www.cmeri.res.in

ఏపీ, తెలంగాణలో ప్రయోగాత్మక సాగు చేపడతాం..
కదిలే పై కప్పు గల పాలిహౌస్‌ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. పాలిహౌస్‌లో పెరుగుతున్న పంటకు వర్షం/ఎండ ఎంతసేపు అవసరమో అంతసేపు తెరచి ఉంచుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు మూసేయవచ్చు. చలి/కొండ ప్రాంతాల కోసం దీన్ని తొలుత డిజైన్‌ చేశాం. వర్షాధార వ్యవసాయానికి కూడా ఇది పనికొస్తుంది. దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాతావరణానికి ఇవి సరిపోతాయా? లేదా? అనే విషయం ఇంకా అధ్యయనం చేయలేదు. త్వరలో ప్రయోగాత్మకంగా సాగు చేసి చూడాలనుకుంటున్నాం.
– డా. జగదీష్‌ మానిక్‌రావు, 
సీనియర్‌ శాస్త్రవేత్త, సిఎస్‌ఐఆర్‌ – సిఎంఇఆర్‌ఐ – సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆన్‌ ఫామ్‌ మెషినరీ, 
గిల్‌ రోడ్డు, లూధియానా– 141006

మరిన్ని వార్తలు