Dragon Fruit: ఒక్కసారి మొక్క నాటితే 20-30 ఏళ్లు పంట.. ఎకరాకు 14 లక్షల ఆదాయం!

7 Jun, 2022 10:04 IST|Sakshi
డ్రాగన్‌ తోటలో రైతు రమేశ్‌ రెడ్డి

డ్రాగన్‌ వెలుగులు!

మూడో ఏడాది ఎకరానికి 16 టన్నుల దిగుబడి 

ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో ఆఫ్‌ సీజన్‌లోనూ అదనపు దిగుబడి

ఎకరాకు రూ.14 లక్షల నికరాదాయం పొందిన యువ రైతు

Dragon Fruit Farming: సంప్రదాయ పంటలకు సస్తి చెప్పి తమకు లాభాలను, ప్రజలకు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. సరికొత్త ఆలోచనలతో వినూత్న పద్ధతుల్లో పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వేగంగా విస్తరిస్తుండగా, ప్రస్తుతం తెలంగాణలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సుమారు 700 ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా.

సంగారెడ్డి జిల్లా రంజోల్‌ గ్రామానికి చెందిన యువరైతు బి.రమేశ్‌రెడ్డి తన తండ్రి నర్సింహ్మరెడ్డి ప్రోత్సహంతో డ్రాగన్‌  ఫూట్‌ను రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. తొలి ఏడాది ఎకరానికి రూ. 6 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. అయినప్పటికీ, సుమారు 30 ఏళ్లపాటు అధిక లాభాలనిస్తుంది కాబట్టి డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నానని రమేశ్‌రెడ్డి తెలిపారు. రెండో ఏడాది నుంచి ఎకరానికి ఏడాదికి రూ. లక్షకు మించి ఖర్చు అవ్వదన్నారు.

ప్రేరణ ఇచ్చిన పండ్ల రసం
రమేశ్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఎంబీఏ (మార్కెటింగ్‌) చదివి హైదరాబాద్‌లో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ సమయంలో ఆరేళ్ల క్రితం స్నేహితులతో కలిసి రమేశ్‌రెడ్డి మణికొండలోని పండ్ల రసం సెంటర్‌కు వెళ్లినప్పుడు, గ్లాస్‌ డ్రాగన్‌ పండు రసం ధర రూ.120 అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి ఈ పండు గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.

2016లో మహారాష్ట్రకు ని ఔరంగ్‌బాద్‌కు వెళ్లి 8 మొక్కలు తెచ్చి ప్రయోగాత్మకంగా నాటారు. మొక్కలు ఏపుగా పెరిగి మంచి కాపు వచ్చింది.  ఈ అనుభవంతో మూడేళ్ల క్రితం రెండు ఎకరాల్లో పంట వేశారు. మెరోగన్‌ రెడ్‌ రకానికి చెందిన ఒక్కో మొక్క  రూ. 70 చొప్పున 2 వేల మొక్కలు నాటారు. తండ్రి సాగుచేస్తున్న అల్లం, అరటి, చెరకు పంటల వల్ల లాభాలు అంతగా రావటం లేదని భావించి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వైపు రమేశ్‌రెడ్డి అడుగులు వేశారు. 

ఆఫ్‌ సీజన్‌లో ఎల్‌ఈడీ వెలుగుతో అదనపు పంట 
పంట సాగు చేసిన మొదటి సంవత్సరంలోనే ఎకరాకు ఒకటిన్నర టన్నుల దిగుబడి వచ్చింది. రెండో సంవత్సరం 5 టన్నులు వచ్చింది. మొదటి సంవత్సరం టన్నుకు రూ. 1.5 లక్షల ధర పలికింది. పెట్టుబడులు పోగా మొదటి ఏడాదిలోనే ఎకరానికి రూ. 10 లక్షల ఆదాయం వచ్చిందని రైతు రమేశ్‌రెడ్డి తెలిపారు. పంట సాగు కోసం ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి సరిపోతుందన్నారు. ఒకసారి మొక్క నాటితే 20 నుంచి 30 సంవత్సరాల వరకు క్రాప్‌ వస్తుందన్నారు. 

సాధారణంగా జూన్‌ నుంచి నవంబర్‌ వరకు 45 రోజులకో దఫా డ్రాగన్‌ పండ్ల దిగుబడి వస్తుంది. ఆర్నెల్లకోసారి పశువుల ఎరువు, ఎన్‌పికె, సూక్ష్మపోషకాలు అందిస్తున్నారు.  రెండు ఎకరాల్లో డ్రాగన్‌  ఫ్రూట్‌ తోటలో 100 ఎల్‌ఈడీ బల్పులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ. 2 లక్షలు  వెచ్చించారు.

పంటకు 12 గంటల పాటు వెలుతురు ఉన్నప్పుడే పంట నాణ్యతతో వస్తుంది. పగలు తక్కువగా ఉండే నవంబర్‌ తర్వాత కాలంలో ప్రతి నిత్యం 4 గంటల పాటు ఎల్‌ఈడీ బల్పులను వెలిగించారు. ఎకరానికి నెలకు విద్యుత్‌ ఖర్చు రూ. 4 వేల వరకు అదనంగా ఖర్చు వచ్చిందని రమేశ్‌రెడ్డి చెప్పారు. 

ఎకరానికి 16 టన్నులు.. రూ. 14 లక్షలు..
మొక్కలు నాటి మూడేళ్లకు గత సంవత్సరంలో జూన్‌–నవంబర్‌ వరకు సీజన్‌లో మూడో ఏడాది ఎకరానికి 12 టన్నుల దిగుబడి వచ్చిందని రమేశ్‌ రెడ్డి చెప్పారు. ఎల్‌ఈడీ బల్పులు ఏర్పాటు చేయటంతో ఆఫ్‌ సీజన్‌లో నవంబర్‌ నుంచి మార్చి వరకు కూడా ఎకరానికి 4 టన్నుల వరకు అదనపు దిగుబడి వచ్చిందన్నారు.

జూన్‌–మార్చి వరకు మొత్తం కలిపి ఎకరానికి 16 టన్నుల డ్రాగన్‌ పంట దిగుబడి వచ్చిందన్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు పోగా.. ఎకరానికి రూ. 14 లక్షల నికరాదాయం వచ్చిందని వివరించారు. ఇప్పుడు నాలుగో సీజన్‌ ప్రారంభం కావటంతో కాపు మొదలైంది. 

80 రకాల డ్రాగన్‌ మొక్కలు
పొలంలో 80 రకాల డ్రాగన్‌ మొక్కలను ప్రయోగాత్మకంగా నాటించానని, ఏ రకం బాగా దిగుబడి వస్తే అదే రకం పంట పండించాలన్న ఆలోచన వచ్చిందన్నారు. రెడ్‌ అండ్‌ రెడ్, రెడ్‌ అండ్‌ వైట్, ఎల్లో అండ్‌ వైట్‌ బేసిక్‌ కలర్లన్నారు. ఎల్లోవైట్‌ తీపిగా ఉంటుందని, ఇదే ఖరీదైన పండన్నారు. నాలుగు నెలకు ఒకసారి పండ్ల దిగుబడి వస్తుందని, కిలో ధర రూ. 1000 నుంచి రూ. 1200 వరకు పలుకుతుందన్నారు.

ఆమెరికా, వియత్నాం దేశాల్లో పర్యటించి డ్రాగన్‌  ఫ్రూట్‌ సాగు గురించి తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. ముదురు డ్రాగన్‌ మొక్కల నుంచి కాండాన్ని కత్తిరించి మొక్కల్ని తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైతులకు సుమారు 300 ఎకరాలకు సరిపడా డ్రాగన్‌ మొక్కల్ని సరఫరా చేశానన్నారు. భవిష్యత్తులో డ్రాగన్‌ ఫ్రూట్‌ జ్యూస్, సౌందర్య సాధన ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవాలని రమేశ్‌ రెడ్డి ఆశిస్తున్నారు.
– వై.శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి, జహీరాబాద్‌ 


యాజమాన్యం ముఖ్యం!
రోజూ పంటను గమనించుకుంటూ రైతువారీగా తగిన శ్రద్ధ తీసుకుంటూ ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటలో మొదటి ఏడాది నుంచే మంచి దిగుబడులు వస్తాయి. అయితే, రైతు స్వయంగా కాకుండా పూర్తిగా పనివారిపై ఆధారపడి సరిగ్గా యాజమాన్య పద్ధతులు పాటించకపోతే రెండేళ్లయినా సరైన దిగుబడి తియ్యలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. వ్యక్తిగత శ్రద్ధతో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతుకు ఆశ్చర్యకరమైన దిగుబడితోపాటు అదే స్థాయిలో ఆదాయమూ వస్తుంది. 
– బి.రమేశ్‌రెడ్డి (96666 66357), రంజోల్, సంగారెడ్డి జిల్లా

చదవండి: ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట: ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం 

మరిన్ని వార్తలు