Organic Farming: ఫ్యాషన్‌ డిజైనర్‌ నుంచి రైతుగా.. రోజుకు 7 వేలు సంపాదిస్తూ!

8 Jun, 2022 17:01 IST|Sakshi

అపూర్వ సేద్యం!

‘‘జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలని అనుకుంటే చిన్నపాటి రిస్క్‌ చేయక తప్పదు. ధైర్యంగా ముందడుగు వేసినప్పుడే అనుకున్నది సాధించగలం’’ అంటోంది పూర్వ జిందాల్‌. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసిన పూర్వ.. బీడు భూమిని పంటపొలంగా మార్చి సేంద్రియ కూరగాయలు పండిస్తోంది. తను లక్షలు సంపాదిస్తూ మరికొంత మందికి ఉద్యోగాలిచ్చి ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.

రాజస్థాన్‌కు చెందిన పూర్వ జిందాల్‌ కుటుంబం ఏళ్లుగా వస్త్ర వ్యాపారం రంగంలో రాణిస్తోంది. కుటుంబ నేపథ్యం టెక్స్‌టైల్స్‌ బిజినెస్‌ కావడంతో తండ్రి ఎన్కే‌ జిందాల్‌ ప్రోత్సాహంతో ముంబైలో ఫ్యాషన్‌  డిజైనింగ్‌ లో ఎమ్‌బీఏ చదివింది. చదువు పూర్తయ్యాక కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా పొల్గొనేది. కొన్నాళ్ల తరువాత పూర్వకు కొత్తగా ఏదైనా చేయలన్న ఆలోచన వచ్చింది.

ఇదే సమయంలో ఇంట్లో రెండు మూడు కూరగాయ మొక్కల్ని పెంచుతుండేది. పెరట్లో పెరిగిన కూరగాయలతో వండిన కూర చాలా రుచిగా ఉండడం గమనించింది. కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం అవసరమని వైద్యులు చెప్పడంతో..సేంద్రియ పంటలను ఆహారంగా చేర్చుకున్నప్పుడే మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది అని గ్రహించింది.

ఈ రెండు సంఘటనలతో దుస్తుల డిజైనింగ్‌ను వదిలేసి సేంద్రియ పంటలు పండించాలని నిర్ణయించుకుంది. కానీ కుటుంబంలో ఎవరికీ వ్యవసాయంపై అవగాహన లేదు. తన సర్కిల్‌లో వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నవారు కూడా లేరు. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా సేంద్రియ పంటలు ఎలా పండించాలి? అనేదానికి సంబంధించిన సమాచారం వెతకడం ప్రారంభించింది. 

అనుభవం ఉన్న రైతులు, వ్యవసాయ రంగ నిపుణుల వద్ద నుంచి సేంద్రియ పంటల గురించిన సమాచారం తెలుసుకుని సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంది. తరువాత రాజస్థాన్‌లోని ఔజిరా గ్రామంలో కొంత భూమిని ఐదేళ్ల కాలపరిమితితో కౌలుకు తీసుకుంది. రాళ్లూరప్పలతో నిండిన బంజరు భూమి కావడంతో.. సంప్రదాయ పద్ధతుల్లో శుభ్రం చేసి ఆవుపేడ, సేంద్రియ కంపోస్టును వేసి పంట పొలంగా మార్చింది.

దీనిలో బఠాణీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టొమాటో, బంగాళ దుంపలు, శనగలు, చెర్రీలు, ఆకుకూరలను పండించడం ప్రారంభించింది. సేంద్రియ ఎరువులు కావడంతో పంటలన్నీ చీడపీడలు లేకుండా ఏపుగా పెరిగాయి. బాగా పండాయి కూడా. అలా పండిన కూరగాయలన్నింటిని దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్‌కు

తరలించి తానే విక్రయిస్తూ రోజుకి ఆరు నుంచి ఏడువేల రూపాయలను ఆర్జిస్తోంది. తన దగ్గర పనిచేసే ఏడుగురు సిబ్బందికి నెలవారి జీతాలు, మిగతా వారికి రోజువారి కూలికి నాలుగు వందల రూపాయల చొప్పున ఇస్తూ ఉపాధి కల్పిస్తోంది. 

ఆరోగ్యం అవగాహన..
కుటుంబంలో వ్యవసాయం చేసే తొలి వ్యక్తి తానే కావడంతో పంటలు పండించడంపై అవగాహన వచ్చేంత వరకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది పూర్వ. సాధారణ కూరగాయలకంటే సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు ధర ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే కాకుండా భవిష్యత్‌లోనూ సేంద్రియ పంటలకు మంచి డిమాండ్‌ ఉంటుందని భావించి తన పంటలను ‘సాఖి ఆర్గానిక్‌’ పేరిట విస్తరించింది.

వాట్సాప్‌ ఆర్డర్‌లను స్వీకరించి నేరుగా కస్టమర్ల ఇంటికే కూరగాయలను డెలివరీ చేస్తోంది. పూర్వ పంటల గురించి తెలిసిన వారంతా ఆమె వద్ద కూరగాయలు కొనడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. ఈ ప్రోత్సాహంతో ‘ఆగ్రో టూరిజం’పైన అవగాహన కల్పిస్తోంది. గ్రామాలకు దూరంగా నగరాల్లో నివసించేవారిని నెలలో రెండు రోజులు తన పొలానికి ఆహ్వానించి సేంద్రియ వ్యవసాయం గురించి వివరిస్తోంది.

ఇలా వచ్చిన వారికి సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు ఎలా పండిస్తున్నారు, ఈ కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వివరిస్తూ వారిలో ఆసక్తి కల్పిస్తోంది. విభిన్న ఆలోచనలకు ధైర్యం తోడైతే సాధించలేనిదంటూ ఏది లేదనడానికి పూర్వ జిందాల్‌ సేంద్రియ వ్యవసాయమే తార్కాణం.

చదవండి: Dragon Fruit: ఒక్కసారి మొక్క నాటితే 20-30 ఏళ్లు పంట.. ఎకరాకు 14 లక్షల ఆదాయం!
  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు