Lilly Singh: సూపర్‌ ఉమన్‌ లిల్లీసింగ్‌!

2 Jun, 2021 02:51 IST|Sakshi

సోషల్‌ స్టార్‌

మూడో తరగతి చదివే చిన్నారికి ‘ద రాక్‌ డ్వైన్‌’ అంటే.. బెడ్‌రూంలో కటౌట్‌ పెట్టుకునేంత ఇష్టం. దీంతో అంతా తనని రాక్‌ సింగ్‌ అని పిలిచేవారు. డ్వైన్‌ను సూపర్‌మ్యాన్‌గా భావించిన ఆ చిన్నారి.. తనని సూపర్‌ ఉమన్‌గా ఊహించుకుంది. తన ఊహ అక్కడితో ఆగిపోలేదు. తనతోనే పెరిగి పెద్దై నేడు సూపర్‌ ఉమన్‌ లిల్లీసింగ్‌ గా ఎదిగింది. కామెడీ కంటెంట్‌ వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేస్తూ సోషల్‌ మీడియా స్టార్‌గానే గాక, కోట్లమంది ఫాలోవర్స్‌తో ప్రపంచంలోనే పాపులర్‌ యాక్టర్, ర్యాపర్, వ్లాగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

కెనడాలో స్థిరపడిన పంజాబీ దంపతులు సుఖ్విందర్‌ సింగ్, మల్విందర్‌ సింగ్‌ల రెండో సంతానంగా 1988 సెప్టెంబర్‌ 26న ఒంటారియాలోని స్కార్‌బరోలో లిల్లీ సైనీ సింగ్‌ పుట్టింది. లిల్లీకి నీనా అనే అక్క ఉంది. స్కార్‌బరోలోనే విద్యనభ్యసించిన లిల్లీ... యార్క్‌ యూనివర్సిటీలో సైకాలజీలో డిగ్రీ చదివింది. డిగ్రీలో ఉండగా లిల్లీ భాంగ్రా నృత్యాన్ని నేర్చుకుంది. 


సూపర్‌ ఉమన్‌..
డిగ్రీ పూర్తయ్యాక కలెక్షన్స్‌ ఏజెన్సీలో ఉద్యోగంలో చేరినప్పటికి, అది తనకి నచ్చకపోవడంతో.. జాబ్‌ వదిలేసి 2010లో ‘సూపర్‌ ఉమన్‌’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. కామెడీ, ఫన్నీ వీడియోలు రూపొందించి తన ఛానల్‌లో పోస్టుచేసేది. పురుషులపై ప్యారడీ, తన తల్లిదండ్రులు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులను అనుకరిస్తూ లిల్లీ చేసే కామెడీని ఎక్కువమంది లైక్‌ చేసేవారు. లిల్లీ చేసిన తొలి వీడియో ‘అఫీషియల్‌ గైడ్‌ టు బ్రౌన్‌ గార్ల్స్‌’లో భారతీయ సంప్రదాయ దుస్తులు వేసుకుని వ్యంగ్యం, కామెడీలతో హాస్యాన్ని రక్తికట్టించడంతో బాగా వైరల్‌ అయింది. దీంతో లిల్లీ ఛానల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య కోటి దాటింది. ఈ ఉత్సాహంతో ‘సూపర్‌ ఉమన్‌ వ్లాగ్స్‌’ పేరిట రెండో యూట్యూబ్‌ ఛానల్‌ను క్రియేట్‌ చేసింది. ఈ ఛానల్‌లో తన డైలీ రొటీన్‌ యాక్టివిటీ వీడియోలు పోస్టు చేసేది.

ఫోర్బ్స్‌ టాప్‌టెన్‌లో..
లాస్‌ ఏంజిల్స్‌కు మకాం మార్చి తన వీడియోలతో రాకెట్‌లా దూసుకుపోయి కోటిన్నరకు పైగా సబ్‌స్రై్కబర్స్‌తో 10.5 మిలియన్‌ డాలర్లను సంపాదించి 2017లో ఫోర్బ్స్‌ అత్యధిక ఆదాయం కలిగిన యూట్యూబ్‌ స్టార్స్‌ టాప్‌ టెన్‌లో లిల్లీ సింగ్‌ నిలిచింది. తన ప్రతిభతో అనేక అవార్డులు అందుకుంది. 

మంచినటిగానూ..
యూట్యూబర్‌గా బిజీగా ఉంటూనే హాలీవుడ్‌ బాలీవుడ్‌ సినిమాల్లో నటించింది. ‘డాక్టర్‌ క్యాబీ’, బాలీవుడ్‌ సినిమా‘స్పీడీ సింగ్స్, థ్యాంక్యూలలో నటించగా, బబుల్స్‌ అండ్‌ మిస్టీ అనే యానిమేటెడ్‌ సినిమాకు గాత్రం అందించింది. తరువాత హాలీవుడ్‌ సినిమా ఐస్‌ ఏజ్‌: కొలిజన్‌ కోర్స్‌’, ‘బ్యాడ్‌ మామ్స్‌లో నటించింది. ఓ పంజాబీ సాంగ్‌ను ర్యాప్‌ చేసి పాడడంతో బాలీవుడ్‌ సినిమా గులాబ్‌ గ్యాంగ్‌లో పెట్టారు. కాగా అనేక సామాజిక అంశాలపై స్పందించే లిల్లీ సింగ్‌ ఈ ఏడాది జరిగిన గ్రామీ అవార్డ్స్‌ ఈవెంట్‌లో ‘ఐ స్టాండ్‌ విత్‌ ఫార్మర్స్‌’ అని రాసి ఉన్న మాస్క్‌ ధరించి ఇండియాలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపింది. 

ఎ లిటిల్‌ లేట్‌ విత్‌ లిల్లీసింగ్‌..
నిర్విరామంగా వీడియోలతో అలరించిన లిల్లీసింగ్‌ 2018 నవంబర్‌లో ‘‘గత ఎనిమిదేళ్లుగా మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. కొద్దిరోజులు వీడియోలు చేయలేను’’ అని చెప్పి కొద్దికాలం బ్రేక్‌ తీసుకుంది. తర్వాత 2019లో ‘‘నేను ‘బైసెక్సువల్‌ని’ అని ట్వీట్‌ చేసి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని కొందరు విమర్శిస్తే, మరికొందరు ఆమె నిజాయితీని మెచ్చుకున్నారు. ఇదే ఏడాది కార్సన్‌ నిర్వహించే ఎన్‌బీసీ షోను లిల్లీ సింగ్‌ చేపట్టి, అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రసారమయ్యే ‘ఎ లిటిల్‌ లేట్‌ విత్‌ లిల్లీసింగ్‌’కు వ్యాఖ్యాతగా మారింది. దీంతో లేట్‌ నైట్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి మహిళగా లిల్లీసింగ్‌ నిలిచింది. కాగా ఈ షోను ఈ ఏడాది ముగిస్తున్నట్లు ఎన్‌బీసీ ప్రకటించింది.చివరి ఎపిసోడ్‌ జూన్‌ 3న ప్రసారం కానుంది. 

మరిన్ని వార్తలు