ఒంటరి తల్లులకు భరోసా ఏదీ?

14 Apr, 2021 04:40 IST|Sakshi

‘నేను కేవలం స్త్రీని. నాకు పురుషుని తోడు అన్ని వేళలా అవసరం అని స్త్రీ అనుకుంటూ ఉంటే కనుక ఆమెకు స్వయం జీవనం కల్పించడంలో వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వ పథకాలు స్త్రీలకు ముఖ్యం గా ఒంటరి స్త్రీలకు లేదా ఒంటరి తల్లులకు తగిన భరోసా కల్పించడంలో విఫలమైనట్టే’ అని మొన్న శనివారం  కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. దత్తత ఇచ్చిన తన బిడ్డను తిరిగి వెనక్కు తెచ్చుకోవడానికి ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించగా ఆమె వాదనల సమయంలో న్యాయమూర్తులు ముహమ్మద్‌ ముష్టాక్, కౌసర్‌ ఎడప్పగత్‌ ఈ వ్యాఖ్య చేశారు. 

కేసు ఏమిటి?
కేరళలో ఒక మహిళ తన సహచరునితో లివ్‌ - ఇన్‌ రిలేషన్‌లో ఉండేది. దానివల్ల వారికి సంతానం కలిగింది. అయితే ఆ తర్వాత వాళ్లు విడిపోయారు. ఆ సంతానం తల్లి దగ్గర ఉండిపోయింది. ఒంటరి తల్లిగా బిడ్డను పెంచడం ఈ సంఘంలో చాలా పెద్ద సవాలు అని భావించిన ఆ తల్లి ఆ బిడ్డను దత్తతకు ఇచ్చేసింది. ఇప్పుడు ఆ తండ్రి తిరిగి వచ్చాడు. వారు మళ్లీ కలిసి జీవించదలిచి దత్తత ఇచ్చిన బిడ్డ కోసం కోర్టు మెట్లెక్కారు. ఆ కేసు వాదనలు వింటూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యానం చేశారు.

ఇంత ఆందోళన ఎందుకు?
‘తన బిడ్డను దత్తత ఇచ్చే ముందు ఆ తల్లి ఒక సామాజిక కార్యకర్తతో చేసిన చాట్స్‌ చూశాం. అందులో ఆమె ఎంత ఒత్తిడికి లోనయ్యిందో తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా ఏ మద్దతు ఒంటరి తల్లులకు లభించదని, కనుక బిడ్డను పెంచలేనని ఆ తల్లి భావించింది. జన్మనిచ్చిన బిడ్డను దత్తత ఇచ్చేసింది. ఈ విధంగా చూసినట్టయితే ఒక ఒంటరి తల్లి ధైర్యంగా బతికేలా చేయడంలో ఈ వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వం సింగిల్‌ మదర్స్‌ కోసం ఏం ఆలోచనలు చేస్తున్నట్టు? వారు ఆర్థికంగా, సామాజికంగా తగిన గౌరవంతో బతకడానికి ఎటువంటి చైతన్యం కలిగిస్తున్నట్టు’ అని కోర్టు అంది.
మగతోడు లేకుండా బతకలేమా?
అయితే ఒక రకంగా చూస్తే ఇది ‘మధ్యతరగతి’ సమస్యా? అనిపిస్తుంది. ఆర్థికంగా దిగువ వర్గాల్లో ఒంటరి తల్లులు ధైర్యంగా బతకడం చూడొచ్చు. సంపన్న వర్గాల్లో పెళ్లిని నిరాకరించి మరీ సింగిల్‌ మదర్స్‌ అవుతున్నవారు ఉన్నారు. అందరికీ తెలిసిన ఉదాహరణలు ఏక్తా కపూర్, సుస్మితాసేన్‌. దీనికి చాలా ఏళ్ల ముందు సింగిల్‌ మదర్‌గా తాను జీవించగలనని నీనా గుప్తా నిరూపించింది. మరోవైపు దిగువ వర్గాల్లోగాని, ఉన్నత వర్గాల్లో కాని విడాకులు ఒక సమంజసమైన పరిష్కారంగా భావించి విడిపోయే జంటలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలతో మిగిలిన తల్లులు ధైర్యంగా బతకడం కనిపిస్తూనే ఉంటుంది. ఎటొచ్చి మధ్యతరగతి మర్యాదలలో ‘మగతోడు’ ఒక తప్పనిసరి సాంఘిక చిహ్నంగా, భద్రతగా, రక్షణగా భావించే పరిస్థితితులు ఉన్నాయి. మధ్యతరగతి సమాజం లిఖించుకున్న విలువలు చాలామటుకు స్త్రీని ప్రశ్నించే, నిలదీసే, సరిదిద్దడానికే ప్రయత్నించేలా ఉంటాయి. అందుకే విడాకులకు వెరచి గృహహింసను భరించే స్త్రీలు, ఒంటరి స్త్రీలుగా ఉంటూ పిల్లలను పెంచడానికి భయపడే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. 

చుట్టూ సవాళ్లు 
ఒకసారి భర్తతో లేదా సహజీవనం నుంచి విడిపోయాక స్త్రీలు ఒంటరిగా జీవించడానికే ఇష్టపడి తమ పిల్లలను ఒంటరిగానే పెంచుకుందామని అనుకున్నా వారికి సవాళ్లు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వీరికి అద్దెకు ఇళ్లు దొరకడం ఒక సమస్య. ఇంటిపని, సంపాదన చూస్తూ పిల్లల అవసరాల గురించి సమయం పెట్టాలంటే వీలు కాదు. నమ్మకమైన బేబి సిట్టర్స్‌ దొరకడం ఒక సమస్య. సమాజం నుంచి మద్దతు దొరకదు. ఆర్థిక ఆలంబన ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏమీ అందదు. మరో పెళ్లి చేసుకోమని సమాజం నుంచి వచ్చే వొత్తిడి. అవకాశంగా తీసుకుని అడ్వాన్స్‌ అయ్యే పురుషులతో సమస్య. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే బహుశా ఆ కేరళ తల్లి తన బిడ్డను దత్తతకు ఇచ్చి ఉండవచ్చు. కోర్టు ఈ వ్యాఖ్యానాలు చేయడం వెనుక ఈ నేపథ్యం అంతా ఉంది. సమాజంలో చట్ట పరిధికి లోబడి తమకు నచ్చిన రీతిలో బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సింగిల్‌ మదర్‌గా ఎవరైనా జీవించదలిస్తే వారిని సమాజం లో భాగంగా చేసుకోవడం. గౌరవించడం, మద్దతు గా నిలవడం చేయవలసిన వ్యవస్థ సంపూర్ణంగా తయారు కాలేదని కేరళ ఉదంతం తెలియచేస్తోంది.
- సాక్షి ఫ్యామిలీ   

మరిన్ని వార్తలు