కంటే కూతుర్నే కను

27 Oct, 2020 08:52 IST|Sakshi

కపిల్‌ దేవ్‌ చాలా వికెట్లు పడగొట్టాడు గాని కూతురి ప్రేమకు ప్రతిసారీ బౌల్డ్‌ అవుతూనే ఉన్నాడు. వివాహం అయిన 16 ఏళ్లకు జన్మించిన ఏకైక కుమార్తె అమియా దేవ్‌. తండ్రిని ఈ కాలంతో కనెక్ట్‌ చేస్తూ ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంచుతూ ఉంటుంది. మొన్న కపిల్‌ దేవ్‌కు యాంజియోప్లాస్టీ జరిగితే డిశ్చార్జ్‌ అయ్యే వరకు అమియా పక్కనే ఉండి అన్నీ చూసుకుంది. కపిల్‌ దేవ్, రొమి భాటియాల ప్రేమ,పెళ్లి, కుమార్తె జననం అన్నీ విశేషమే.

1980లకు ముందు కపిల్‌ దేవ్‌ చాలాసార్లు హాఫ్‌ సెంచరీ 49 దగ్గర, సెంచరీ  97 దగ్గర మిస్‌ అయ్యాడుగానీ ప్రేమలో రోమి చేయి పట్టుకోవడం మిస్‌ కాలేదు. ఢిల్లీని తమ నివాస స్థలంగా చేసుకున్న వీరిద్దరు కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. కపిల్‌ దేవ్‌ అప్పటికే క్రికెట్‌ స్టార్‌. కాని రోమి మీద ప్రేమ పెంచుకున్నాడు. రోమి వారి స్నేహ బృందంలో నాయక స్థానంలో ఉండేది. ఆ వయసులోనే 80 కేజీల బరువుతో బెరుకు లేకుండా అబ్బాయిలంటే లెక్క లేనట్టుగా ఉండేది.

ఆమెను చూసి అందరూ జంకే వారు కాని క్రీజ్‌ మీద ఎంతటి భీకర బ్యాట్స్‌మెన్‌కైనా బంతి వేయడానికి భయపడని కపిల్‌ దేవ్‌ రోమీని ప్రేమపూర్వకంగా దక్కించుకోవడానికే నిశ్చయించుకున్నాడు. ఢిల్లీ సబర్బ్‌ ట్రైన్‌లో తన ప్రేమను ప్రతిపాదించాడు. రోమి అంగీకరించింది. ఒకటి రెండు సంవత్సరాల ప్రేమ తర్వాత 1980లో వాళ్లు వివాహం చేసుకున్నారు. పెళ్లినాటికి కపిల్‌ దేవ్‌కు 21 సంవత్సరాలు.(చదవండి: గగన నేత్రాలు.. ముగ్గురు మహిళా పైలట్‌లు)

సంతానం కోసం ఎదురు చూపు
పెళ్లయ్యాక రోమి, కపిల్‌ల జీవితంలో సహజంగానే సంతానం కోసం ఎదురు చూపు మొదలయ్యింది. ఒకటి రెండు సంవత్సరాలు ఇద్దరూ పట్టించుకోలేదు. మూడో సంవత్సరం కొంచెం బెంగ పడ్డారు. నాలుగో సంవత్సరం నుంచి రోమి తీవ్రంగా సంతాన వాంఛతో ఇబ్బంది పడింది. ‘నేను ఎక్కే క్లినిక్‌ దిగే క్లినిక్‌తో రోజులు గడిపేదాన్ని’ అని ఆమె చెప్పుకుంది. గర్భం రావడానికి అప్పటికి వీలైన వైద్య విధానాల కోసం ప్రయత్నించేది. కపిల్‌ భార్య పడే శ్రమ చూడలేకపోయేవాడు. ‘మనిద్దరం బాగున్నాం కదా. పిల్లలు ఇవాళ కాకపోయినా రేపయినా పుడతారులే’ అని ధైర్యం చెప్పేవాడు.

కాని రొమి హాస్పిటళ్ల చుట్టూ తిరగడం మానలేదు. ‘పద్నాలుగేళ్లు అలా హాస్పిటళ్లకు తిరిగి అలసిపోయాను. ఒకరోజు క్లినిక్‌లో నాకే అనిపించింది. ఇచ్చేవాడు భగవంతుడు. ఆయన ఇవ్వదలిస్తే ఇస్తాడు. లేకుంటే లేదు అనుకుని ప్రయత్నాలు మానేశాను. ఇది జరిగిన ఒక సంవత్సరానికి గర్భం దాల్చాను. అసలది నేను నమ్మలేకపోయాను. హాస్పిటల్‌కు వెళ్లి కన్ఫర్మ్‌ చేసుకున్నాక అక్కడి నుంచే కపిల్‌కు ఫోన్‌ చేసి చెప్పాను’ అంటుంది రోమి.

‘దాదా’ అన్న పిలుపు
కపిల్, రోమిలకు 1996లో అమియా పుట్టింది. తండ్రిని ‘దాదా’ అని పిలవడం కపిల్‌ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సందర్భం. ‘నేను క్రికెట్‌లో పీక్‌లో ఉండగా అమియా పుట్టి ఉంటే ఆమె బాల్యాన్ని నేను మిస్‌ అయి ఉండేవాణ్ణి. రిటైర్‌ అయ్యాక పుట్టడంతో ఆమె ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేశాను. పని తర్వాత సాయంత్రం ఇల్లు చేరుకున్నప్పుడు కూతురు ఎదురొస్తే కలిగే ఆనందం ఏ తండ్రికైనా అంతా ఇంతా కాదు’ అంటాడు కపిల్‌. తల్లిదండ్రులు ఇద్దరూ అమియాను తమ అభిప్రాయాల ప్రతిబింబంలా కాకుండా ఆమె స్వేచ్ఛాలోచనలకు వీలుగా పెంచడానికే ఇష్టపడ్డారు. ప్రాథమిక చదువు గుర్‌గావ్‌లో, పై చదువు లండన్‌లో చదువుకుంది అమియా. ఇప్పుడు తల్లిదండ్రుల వద్దే ఉంటూ యువతరంతో, కాలంతో తండ్రి కనెక్ట్‌ అయ్యేలా అమియా సహాయం చేస్తోంది. సోషల్‌ మీడియాలో కపిల్‌ ప్రెజెన్స్‌ను అమియా పర్యవేక్షిస్తోంది. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను హ్యాండిల్‌ చేస్తోంది.

తండ్రి సినిమాలో
అమియాకు బాలీవుడ్‌లో పని చేయాలని ఒక కోరిక. అందుకే దేశానికి కెప్టెన్‌గా కపిల్‌ దేవ్‌ క్రికెట్‌లో వరల్డ్‌ కప్‌ తెచ్చిపెట్టిన కథతో ‘83’ సినిమా మొదలైనప్పుడు అమియా దానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరింది. ఇలా ఒక క్రీడాకారుడి జీవితంపై సినిమా వస్తున్నప్పుడు దానికి ఆ క్రీడాకారుని కుమార్తె పని చేయడం ఎక్కడా జరిగి ఉండదు. దానివల్ల తండ్రి సినిమా సరిగ్గా రావడంలో పాత్ర వహించడంతోపాటు తండ్రి బాడీ లాంగ్వేజ్‌ను ఆ పాత్ర పోషిస్తున్న రణ్‌వీర్‌ సింగ్‌కు చెప్పడానికి కూడా అమియా తోడ్పడింది.

అత్యవసరంలో వెన్నుదన్నుగా
మొన్న అక్టోబర్‌ 22 గురువారం పొద్దుపోయాక కపిల్‌ దేవ్‌ ఛాతీలో అసౌకర్యం చెప్పగానే దక్షిణ ఢిల్లీలోని ఒక హాస్పిటల్‌లో హుటాహుటిన చేర్చడం, తెల్లారే సమయానికి డాక్టర్లు యాంజియోప్లాస్టీ నిర్వహించడం, కపిల్‌ కోలుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని తల్లితో కలిసి నిర్వర్తించింది అమియా. తండ్రి పక్కనే ఉండి అనుక్షణం బలాన్ని ఇచ్చింది. కూతురు ఎదురుగా ఉండే ఏ తండ్రైనా శక్తిసంపన్నుడు కాకతప్పదు. అందుకే హాస్పిటల్‌ బెడ్‌ మీద కపిల్‌ నవ్వుతూ తన అభిమానులను ఫొటో ద్వారా పలకరించగలిగాడు. ఆ నవ్వు పక్కన అమియాను చూడొచ్చు. కూతురి చిరునవ్వే ఇంటికి శ్రీరామరక్ష.
– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు