ఆ గుండె ఆగిపోలేదు

23 Nov, 2020 04:47 IST|Sakshi
లెఫ్టినెంట్‌ ఆఫీసర్‌గా కనిక రాణే

రెండేళ్ల క్రితం కశ్మీర్‌లో ఉగ్రవాదులతో ముఖాముఖి పోరాడుతూ మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తున్న క్షణాల్లోనూ చివరి వరకు మేజర్‌ కౌస్తుభ్‌ రాణే గుండె.. దేశం కోసమే కొట్టుకుంది.  ఆ గుండె ఆగిపోదని, భార్యగా తను బతికున్నంత వరకు దేశం కోసం కొట్టుకుంటూనే ఉంటుందని శత్రువుకు చెప్పదలచుకున్నారు కనికా రాణే. అందుకే ఆర్మీలో చేరారు. శిక్షణ పూర్తి చేశారు. ఇప్పుడిక కమాండెంట్‌గా  విధులకు సిద్ధమౌతున్నారు. 

చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ నుంచి నలభై తొమ్మిది వారాల  శిక్షణను ముగించుకుని శనివారం నాడు క్యాంపస్‌ బయటికి వచ్చిన 230 మంది ఆర్మీ ఆఫీసర్‌లలో 29 ఏళ్ల కనికా కౌస్తుభ్‌ రాణే కూడా ఒకరు. నిజానికైతే ఆమె ఇప్పుడు ఏ మల్టీనేషనల్‌ కంపెనీలోనో ప్రాజెక్టు మేనేజరుగా లేదా అంతకంటే పైస్థాయిలో కొనసాగుతూ ఉండవలసినవారు. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేసి, ఎంబీఏలో పట్టభద్రురాలై ఉన్న కనికకు తను ఎంచుకున్న కెరియర్‌లో కొన్ని లక్ష్యాలు ఉండేవి. కొన్ని ధ్యేయాలు ఉండేవి. కొన్ని కలలు ఉండేవి.

అవన్నీ పక్కనపెట్టి.. భర్త లక్ష్యాలు, భర్త ధ్యేయాలు, భర్త కలల్ని కనురెప్పల మధ్య ఒత్తుల్లా వెలిగించుకుని గత ఏడాది వార్‌ విడోస్‌ విభాగంలో సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు పరీక్ష రాసి, ర్యాంకు సంపాదించి ఆర్మీలో చేరేందుకు అర్హత సంపాదించారు. అకాడమీలో శిక్షణ  పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఆఫీసర్‌గా కమాండెంట్‌ బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. ఆ బాధ్యతలు ఆమె భర్త కౌస్తుభ్‌ రాణే మిగిల్చి వెళ్లినవి!  రాణే భారత సైన్యంలో మేజర్‌. దేశమే ఆయన సర్వస్వం.

దేశ రక్షణ, దేశ భద్రత, దేశ గౌరవం కోసమే ప్రతిక్షణం ఆలోచించాడు. అనుక్షణం కార్మోన్ముఖుడు అయి ఉన్నాడు. ప్రాణాలను ఫణంగా పెట్టి కశ్మీర్‌లో ఉగ్రవాదులతో తలపడుతూ ఆ భీకర పోరులో నేల కొరుగుతున్న క్షణంలోనూ ఆయన గుండె దేశం కోసమే కొట్టుకుంది. అయితే భార్యగా తను బతికి ఉన్నంత కాలం అతడి గుండె తన దేశం కోసం కొట్టుకుంటూనే ఉంటుందని శత్రువుకు చెప్పదలచుకున్నారు కనిక. అందుకే ఆర్మీలో చేరారు. 

2018 ఆగస్టులో.. శ్రీనగర్‌కు 125 కి.మీ. దూరంలోని బందీపురా జిల్లా గురెజ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖను దాటి దేశం లోపలికి వస్తున్న ఉగ్రవాద చొరబాటు దారులతో పోరాడుతూ మేజర్‌ కౌస్తుభ్‌ రాణే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు హమీర్‌సింగ్, మన్‌దీప్‌సింగ్, విక్రమ్‌జీత్‌సింగ్‌ అనే ముగ్గురు సైనికులు వీర మరణం పొందారు. మేజర్‌ రాణేకు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు లభించింది. ఆయన భార్య కనిక ముంబై నుంచి ఉధంపూర్‌ వెళ్లి ఆ అవార్డును ఎంత అపురూపంగా అందుకుని వచ్చారో.. శనివారం చెన్నై పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆర్మీ యోగ్యత పత్రాలను అంతే అపురూపంగా, దీక్షగా అందుకున్నారు.

‘‘నా భర్త కలల్ని నిజం చేయడానికి ఆయన స్థానంలో నేను ఆర్మీలోకి వచ్చాను’’ అని ఆమె చెబుతున్న వీడియోను రక్షణశాఖ పీఆర్‌వో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘నా భర్త ఎప్పుడూ నా కలల్ని నిజం చేసుకోడానికి ప్రోత్సహించేవారు. ఆయన మరణంతో ఆయన కలలే నా కలలయ్యాయి’’ అని కనిక అన్నారు. ‘‘మా పాత్రలు మారాయంతే. లక్ష్యం, ధ్యేయం ఒక్కటే. దేశ భద్రత, దేశ రక్షణ’’ అని ఆమె చెబుతున్నప్పుడు ఆమె మాటలో పట్టుదల ప్రస్ఫుటమయింది.

ఆర్మీ శిక్షణను కూడా ఆమె అంతే పట్టుదలతో పూర్తి చేశారు. ‘‘శిక్షణలో శారీరకబలం కంటే కూడా మానసిక బలం ఎక్కువ అవసరం. నేనెప్పుడూ వంద మీటర్ల దూరానికి మించి పరుగు తీయలేదు. ఇప్పుడు 40 కి.మీ. వరకు పరుగెత్తగలను! మనసు గట్టిగా ఉంటే మనిషికి గట్టితనం వస్తుంది’’ అన్నారు కనిక. ఆమెకొక కొడుకు. అగస్త్య (4). భర్త తల్లిదండ్రులు కూడా ఆమెతో ఉంటున్నారు. వారి బాధ్యతను తీసుకున్నట్లే, దేశ రక్షణ విధులనూ నిర్వర్తించేందుకు సిద్ధం అయ్యారు ఆర్మీ లెఫ్టినెంట్‌ కనిక. 

మరిన్ని వార్తలు