Zomato Girl: ఆకలి చూపిన ఉపాధి

16 Jun, 2021 00:05 IST|Sakshi

కటక్‌కు చెందిన బిష్టుప్రియ 
సీనియర్‌ ఇంటర్‌.
క్లాసులు కట్టిపెట్టి తండ్రి బైక్‌ను
ఎక్కి జొమాటో టీషర్ట్‌ వేసుకుంది.
లాక్‌డౌన్‌లో రాత్రి పూట
ఒంటరి రోడ్ల మీద ఫుడ్‌ డెలివరి
ఇస్తూ కనిపిస్తుంది.
ఆమెను అందరూ మెచ్చుకుంటున్నారు.
ఎందుకంటే ఇంటి ఆకలి తీర్చడానికి
ఈ రిస్క్‌ ఉన్న పనిని సైతం 
ఎంచుకుంది కనుక.
కటక్‌ ఓన్లీ జొమాటో గర్ల్‌ బిష్ణు

డబ్బు, సంపాదన ఉన్నవారికి డబ్బు, సంపాదన వల్ల ఆకలి తీరకపోవడం మంచిదే. అంటే డబ్బు, సంపాదన ఉన్నా వేళకు వండుకోవాలి. లేదంటే బయటి భోజనం తినాలి. డబ్బు తిని ఉండలేరు కదా. ప్రపంచం అటుదిటు అయినా మనిషికి ఆకలి పోదు. ఈ కథలో ఒకరి ఆకలి ఇంకొకరి ఆకలిని తీర్చింది. ఆకలి ఉన్నవారు ఆహార పదార్థాలు ఇంటికి తెప్పించుకునే వీలున్న జొమాటో సర్వీస్‌ ఒక కుటుంబం ఆకలి తీర్చింది. అలా తీర్చేందుకు కష్టపడుతున్న అమ్మాయి బిష్ణుప్రియ ఈ కథకు కథానాయిక.

కటక్‌ అమ్మాయి
ఫస్ట్‌వేవ్‌ నుంచి బయటపడి ఎలాగోలా బతుకీడుస్తున్న బడుగు జీవుల మీద సెకండ్‌ వేవ్‌ వచ్చి పడింది. మళ్లీ లాక్‌డౌన్స్‌ తప్పలేదు. కటక్‌ శైలబాల విద్యాలయాలో సిబిఎస్‌ఇ 12వ తరగతి చదువుతున్న బిష్ణుప్రియ చదువులో బ్రైట్‌. ఇంటర్‌ అయ్యాక మెడిసిన్‌ చేయాలని కోరిక. తండ్రి టాక్సీ డ్రైవర్‌. కాని లాక్‌డౌన్‌ వల్ల అతని ఉద్యోగం పోయింది. ఇంట్లో మెల్లమెల్లగా ఆకలి మొదలయ్యింది. ‘నేను నా కాలేజీ ఫీజు కోసం ఇంటి దగ్గర రోజూ ట్యూషన్‌ చెప్పేదాన్ని. అయితే కరోనా భయంతో పిల్లలు రావడం మానేశారు. ఆ డబ్బు కూడా ఆగిపోయింది. ఏం చేయాలో తోచలేదు’ అంది బిష్ణుప్రియ. ఇంట్లో బిష్ణుప్రియే పెద్ద కూతురు. ఆమె తర్వాత ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ‘నాన్నకు వేరే ఏ పనీ రాదు. అమ్మ టైలరింగ్‌ చేస్తుంది కాని ఆ పని నడవడం లేదు. ఇక నేను నా చదువును కొంతకాలం పక్కనపెడదామని అనుకున్నాను’ అంటుంది బిష్ణుప్రియ.

చదువుకుంటున్న బిష్ణుప్రియ

జొమాటో ఉద్యోగి
‘ఈ లాక్‌డౌన్లో నేను ఏపని చేయగలను రోజూ ఏపని దొరుకుతుంది అని చూస్తే నాకు జొమాటో ఒక మార్గంగా కనిపించింది. కటక్‌లో వాళ్ల బ్రాంచీకి వెళ్లి ఉద్యోగం కావాలన్నాను. నాకు ఈ సంవత్సరమే 18 నిండాయి. వాళ్లు ఉద్యోగం ఇచ్చారు. నాన్న బైక్‌ నాకు నడపడం వచ్చు. వెంటనే పనిలో దిగాను’ అంటుంది బిష్ణు.

అయితే కటక్‌లో ఇలా జొమాటోలో డెలివరీ కి పని చేస్తున్న ఆడపిల్లలు లేరు. బిష్ణు మొదటి అమ్మాయి. మామూలు రోజుల్లో డెలివరీ ఒక పద్ధతి. లాక్డౌన్‌ అంటే నిర్మానుష్య వీధుల్లో తిరగాలి. డెలివరీ కోసం రాత్రి వరకూ పని చేయాలి. ‘అయినా ఇప్పటివరకూ నాకు ఏ ఇబ్బందీ రాలేదు. పైగా నా పనిని చూసి నలుగురూ మెచ్చుకుంటున్నారు’ అంది బిష్ణు. 

ఆమెను చూసి తల్లిదండ్రులు కూడా ఆనందిస్తున్నారు. ‘మా అమ్మాయి చాలామందికి స్ఫూర్తినిస్తోంది. నాకు అదే సంతోషం’ అన్నాడు బిష్ణు తండ్రి. చెడు కాలం వచ్చినప్పుడు మనిషిలోని ఎదుర్కొనే శక్తులు బయటకి వస్తాయి. ఇలాంటి అమ్మాయిల శక్తి ఇప్పుడు దేశంలో చాలా కుటుంబాలను ఆదుకుంటోంది. 

చదవండి: జొమాటో సంచలనం.. నోయిడాలో అమల్లోకి..

చదవండి: కరోనా వ్యాప్తి.. స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్‌ బంద్‌

>
మరిన్ని వార్తలు